'కథానాయకుడు' ఘోర పరాజయం తర్వాత యాభై కోట్లకి పైగా నష్టాలు చవిచూసిన బయ్యర్లని ఆదుకోవడానికి 'మహానాయకుడు' ప్రదర్శన హక్కులు ఉచితంగా ఇవ్వనున్నారనే ప్రచారం జరిగింది. అయితే మొదటి భాగంలో వచ్చిన నష్టాలని మూడొంతులు భరించిన బాలకృష్ణ, రెండవ భాగం ప్రదర్శన హక్కులలో నలభై శాతం బయ్యర్లకి ఇస్తానని ప్రకటించారు. దీని పట్ల బయ్యర్లు హర్షం వ్యక్తం చేసారు.
దీనివల్ల రిలీజ్ ఖర్చుల మినహా బయ్యర్లపై భారం పడదు. అలాగే ఎంత వచ్చినా కానీ అందులో నలభై శాతం వారి ఖాతాలోకే వెళుతుంది. చాలా ఆకర్షణీయమైన డీల్ అయినా కానీ ఇందులో ఒక మతలబు వుంది. బయ్యర్లు నష్టాల నుంచి గట్టెక్కాలంటే 'మహానాయకుడు' బాగా ఆడాలి. ఫిబ్రవరి 22న విడుదలయ్యే ఈ చిత్రంపై ఎలాంటి క్రేజ్ లేదనేది వాస్తవం. ఫుల్ క్రేజ్‌తో, ఎక్స్‌పెక్టేషన్స్‌తో, సంక్రాంతి లాంటి టాప్ సీజన్‌లో వచ్చిన 'కథానాయకుడు' ఇరవై కోట్ల లోపు షేర్ వసూలు చేసింది.
మహానాయకుడు చిత్రంపై అసలు ఆసక్తి లేని నేపథ్యంలో ఈ చిత్రం ఆ మాత్రమైనా వసూలు చేస్తుందా అనేది అనుమానమే. కథానాయకుడు ప్రచార విషయంలో కదంతొక్కిన చిత్ర బృందం ఈసారి విడుదలకి ముందే చేతులు ఎత్తేసింది. బయ్యర్లు మొదటి సినిమా నష్టాలు భర్తీ చేసుకోవాలంటే 'మహానాయకుడు' సంచలన విజయం సాధించాలి. లేదా ఆల్రెడీ పోయిన డబ్బుల్లో ఎంత తిరిగొచ్చినా 'మహా' ప్రసాదం అనుకోవాలి.