రివ్యూ: గల్లి బోయ్
రేటింగ్: 3.5/5
బ్యానర్: ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్, టైగర్ బేబీ ప్రొడక్షన్స్
తారాగణం: రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్, కల్కి కోక్లేన్, సిద్ధాంత్ చతుర్వేది, విజయ్ రాజ్, విజయ్ వర్మ, అమృతా సుభాష్, షీబా చడ్డా తదితరులు
సంగీతం: డివైన్, నాజీ, డబ్ శర్మ, అంకుర్ తివారీ తదితరులు
కూర్పు: నితిన్ బైద్
ఛాయాగ్రహణం: జే ఓజా
నిర్మాతలు: రితేష్ జిద్వాని, జోయా అక్తర్, ఫర్హాన్ అక్తర్
రచన, దర్శకత్వం: జోయా అఖ్తర్
విడుదల తేదీ: ఫిబ్రవరి 14, 2019
బాలీవుడ్ అంటే ముగ్గురు ఖాన్‌ల తర్వాతే అనేది స్థిరపడిపోయి చాలా కాలమైంది. హృతిక్, రణ్‌భీర్ కపూర్ లాంటి వాళ్లు అడపాదడపా మెరుస్తున్నా కానీ వారిలో నిలకడ లోపించింది. కథల ఎంపికలోనే కాకుండా, పాత్రల పరంగా వైవిధ్యం చూపించడంలో రణ్‌వీర్‌సింగ్ ప్రతి సినిమాతోను సత్తా చాటుకుంటూ… బాలీవుడ్‌కి నెక్స్‌ట్ సూపర్‌స్టార్‌గా అవతరిస్తున్నాడు. బాజీరావు, అల్లావుద్దీన్ ఖిల్‌జీ, సింబా… ఇలా ప్రతి సినిమాలోను సరికొత్తగా కనిపిస్తోన్న రణ్‌వీర్‌సింగ్… 'గల్లీబోయ్'లో సగటు స్లమ్ కుర్రాడిగా అవలీలగా ఒదిగిపోయాడు. ఎంత స్టార్‌డమ్ వచ్చినా పాత్రకి అనుగుణంగా ఒదిగిపోవడమే గొప్ప నటుల లక్షణం.
'గల్లీబోయ్' ఓపెనింగ్ సీన్‌లో విజయ్ రాజ్ కారు దొంగతనం చేయడానికి వడివడిగా వెళుతుంటాడు. వెనక నుంచి ఇద్దరు కుర్రాళ్లొచ్చి జాయిన్ అవుతారు. వారిలో ఒకడు మురాద్ (రణవీర్ సింగ్). ఎంత డీగ్లామ్ క్యారెక్టరయినా కావాలనుకుంటే… ఈ కథలోను అతనికో సోలో ఇంట్రడక్షన్ సీన్ పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నారని ఎవరూ కంప్లయింట్ చేయరు కూడా. కానీ ఆ పాత్ర సగటు స్లమ్ బాయ్ ఎలా వుంటాడో అలాగే వుంటుంది… ఎలాంటి బిల్డప్పులు లేకుండా. ర్యాప్ సాంగ్స్ అంటే మురాద్‌కి పిచ్చి. ఎప్పుడూ ర్యాప్ సాంగ్స్ వింటూ… తనకొచ్చిన కవిత్వం రాసుకుంటూ వుంటాడు. ర్యాపర్ కావాలని కూడా అనుకోడు. ఎవరైనా మంచి ర్యాపర్ చేతిలో తన సాహిత్యం పెడితే చాలనుకుంటాడు.
అతనికి లోకల్ ర్యాపర్ షేర్ (సిద్ధాంత్ – తొలి పరిచయంలోనే విశేషంగా మెప్పించే పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు) పరిచయమవుతాడు. తన సాహిత్యం తాను రాసుకోగలనని, నీ సాహిత్యానికి నువ్వే గొంతు కావాలని షేర్ ప్రోత్సహించడంతో మురాద్ ఒక ర్యాప్ సాంగ్ రికార్డ్ చేసి యూట్యూబ్‌లో పెడతాడు. పాట బాగా పాపులర్ అవుతుంది. వీడియో చూసిన అతని తండ్రి ఆనంద పడడు. చదువు మీద ధ్యాస లేకుండా పక్కదార్లు పడుతున్నాడని కొడతాడు. ఒక మంచి బ్రేక్ కోసం చూస్తోన్న మురాద్, షేర్‌లకి సంయుక్తంగా ఒక 'మంచి వీడియో' రికార్డ్ చేసే వీలు చిక్కుతుంది. ఎన్నారై స్కై (కల్కి – చాలా స్టాక్ క్యారెక్టర్. కల్కిలాంటి ఉత్తమ నటి కూడా ఆ పాత్రని మరో లెవల్‌కి తీసుకెళ్లలేపోయింది) సాయంతో ఈ వీడియో చేసి సక్సెస్ అవుతారు. కానీ మురాద్‌కి అడుగడుగునా పేదరికం అడ్డవుతుంది. తప్పక సంపాదించాల్సిన పరిస్థితులు వస్తాయి. తన పేదరికానికి, తన భవిష్యత్తుకి సమాధానంగా ర్యాప్ కంటెస్ట్ జరుగుతుంది. ప్రథమ బహుమతి పది లక్షలు!
జీరో నుంచి హీరో అయ్యే ప్రతి 'అండర్‌డాగ్' కథే ఇది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాల ఫార్మాట్‌నే జోయా అఖ్తర్ ఫాలో అయింది. కాకపోతే పాత్రలని సజీవంగా తీర్చిదిద్దడంలో, అందరు నటీనటుల నుంచి ఉత్తమ నటన రాబట్టుకోవడంతో పాటు, కథ నుంచి బయటకి వెళ్లకుండా వినోదాన్ని అందించి, ఎమోషన్స్ కూడా గొప్పగా పలికించి గల్లీబోయ్‌తో ట్రావెల్ అయ్యేట్టు చేస్తుంది. మురాద్ ఎమోషన్స్ అన్నీ చూసే ప్రేక్షకులు కూడా ఫీలయ్యేంతగా అతని స్టోరీతో కనక్ట్ చేసింది.
కథ మురాద్‌దే అయినా… అతని జర్నీ, విక్టరీ మాత్రమే గల్లీబోయ్‌లో కనిపించదు. అతని చుట్టూ వున్న వారికి కూడా కథలో కీలకమైన పాత్ర లభించింది. మురాద్‌తో ప్రేమలో వున్న సఫీనా (ఆలియా) 'నా ప్రియుడు నాకే సొంతం' అనే టైప్. అందుకోసం ఎంతకయినా తెగిస్తుంది. స్కైతో సఫీనా కాన్‌ఫ్రంటేషన్ సీన్ హైలైట్స్‌లో ఒకటి. ఈ లవ్‌స్టోరీని కథలో భాగం చేసిన తీరు అద్భుతమనిపిస్తుంది. వీళ్లిద్దరి ఫస్ట్ సీన్‌లో మాటలే వుండవు. కానీ ఇద్దరూ ఎప్పట్నుంచో ప్రేమలో వున్నారనే సంగతి అలా రిజిష్టర్ అయిపోతుంది. ఒక్క డ్యూయట్ కానీ, ఏ పాటలో అయినా హీరోయిన్ కూడా భాగం కావడం కానీ జరగదు. హీరోయిన్ తెర మీదకి రాగానే సాంగ్‌కి బ్రేక్ తీసుకునేవారు ఇలాంటి సినిమాలు చూసి అయినా మారాలి.
మురాద్ ఇంట్లోని పరిస్థితులు… ఇంట్లో వాళ్ల ఎమోషన్స్ పట్టని తండ్రి, భర్త తననెంతగా క్షోభ పెడుతున్నా ఏమీ అనలేని భార్య… ఏదీ అసలు కథకి అడ్డు పడదు. కానీ ఏ సీన్ అయినా కానీ ఎఫెక్టివ్‌గా అలా బలమైన ముద్ర వేసే వెళుతుంది తప్ప వృధా అనిపించదు. మురాద్ జీవితంలో కీలక పాత్ర పోషించే మరో వ్యక్తి మొయీన్ (విజయ్ వర్మ- అత్యంత సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు) క్యారెక్టర్ ఆర్క్ కూడా చక్కగా అసలు కథలో ఇమిడిపోయింది.
ప్రొడక్షన్ డిజైన్ చాలా అథెంటిక్‌గా… నిజంగా ముంబయ్ స్లమ్స్‌లో తిరుగుతోన్న భావనే కలిగిస్తుంది. సినిమాటోగ్రాఫర్ ఎక్కడా 'డార్క్ టోన్' వీడలేదు. ఒక్క ఫ్రేమ్‌లోను 'కలర్' నింపాలని చూడలేదు. యూట్యూబ్ కోసం చేసే 'మేరే గలీ మే' పాటలోను కలర్‌కి చోటుండదు. పాత్రల తాలూకు నేపథ్యం, వారి జీవనశైలికి అనుగుణంగా లైటింగ్, టోన్ పర్‌ఫెక్ట్‌గా సెట్ చేసుకున్నారు. మ్యూజికల్ డ్రామా కనుక పాటలు ఖచ్చితంగా ఆకట్టుకోవాలి. లెక్కలేనన్ని పాటలున్న ఈ చిత్రంలో ప్రతి పాటా ఉత్సాహాన్నిస్తుంది. అన్ని పాటలూ అలరించడమే కాకుండా మళ్లీ వినాలనిపిస్తాయి. తెరపైన, తెరవెనుక ప్రతి ఒక్కరూ గల్లీబాయ్‌కి ప్రాణం పోసారు. ఈ చిత్రాన్ని యథాతథంగా సబ్‌టైటిల్స్‌తో ప్రపంచంలో ఏ భాషలో అయినా విడుదల చేసేయవచ్చు. ఫ్రెంచ్, కొరియన్, స్పానిష్ చిత్రాలని మెచ్చుకునే ప్రేక్షకులు 'గల్లీబోయ్'ని కూడా విశేషంగా లైక్ చేస్తారు.
ఇందులో మైనస్‌లు లేవా అంటే లేకపోలేదు. రెగ్యులర్ అండర్‌డాగ్ స్టోరీ కనుక కథాపరంగా ఎక్కువ సర్‌ప్రైజ్‌లుండవు. పతాక సన్నివేశాన్ని ముందే ఊహించేయవచ్చు. ర్యాప్ బ్యాటిల్స్ పేరిట కొన్ని సీన్లు సుదీర్ఘంగా సాగుతాయి. రన్ టైమ్ కూడా ఒక ఇరవై నిమిషాలు ఎక్కువే వుందనిపిస్తుంది. కొన్ని బలహీనతలు వున్నప్పటికీ దర్శకురాలు జోయా అఖ్తర్ అద్భుతమైన దర్శకత్వానికి తోడు తెరపై రణ్‌వీర్, ఆలియాతో సహా అందరూ కనబరిచిన అద్భుతమైన నటన, పసందైన సంగీతం, వాస్తవికతకి అద్దం పట్టే ప్రొడక్షన్ డిజైన్, ఛాయాగ్రహణం వెరసి 'గల్లీబోయ్'ని ఇటీవల వచ్చిన ఉత్తమ భారతీయ చిత్రాల సరసన నిలబెడుతుంది.
బాటమ్ లైన్: అదరగొట్టాడోయ్!
– గణేష్ రావూరి