ఏమిటీ లెక్క ? కేసీఆర్ కు యేడాదేమిటి ? జగన్ కు రెండేళ్ళేమిటీ? వాళ్ళు చిన్న పిల్లలు కారు కాబట్టి ఇది వయసు లెక్క కాదు. మరేమిటీ అనుకుంటున్నారా ? వారిద్దరి పదవీ కాలం గడువు. నిజానికి కేసీఆర్ ప్రభుత్వానికి రెండేళ్ల సమయం ఉంది. జగన్ సర్కారుకు మూడేళ్ళ సమయం ఉంది.
తెలంగాణలో 2023 లో ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రాలో 2024 లో ఎన్నికలు జరుగుతాయి. అసలైతే రెండు రాష్ట్రాల్లో 2024 లోనే ఎన్నికలు జరగాలి. కానీ కేసీఆర్ ముందస్తుగా 2018 లోనే గత ఎన్నికలను జరిపేసుకున్నారు. ఏపీలో 2019 లో ఎన్నికలు జరిగాయి. అందుకే రాబోయే ఎన్నికల్లో ఏడాది తేడా వచ్చింది.
కేసీఆర్ కు రెండేళ్ల సమయం ఉన్నా, జగన్ కు మూడేళ్ళ టైం ఉన్నా సాధారణంగా చివరి యేడాదిని లెక్కలోకి తీసుకోరు. ఎందుకంటే పదవీ కాలంలో చివరి ఏడాది ఎన్నికల హడావుడే సరిపోతుంది. పాలనా విషయాలను ముఖ్యమంత్రులు పెద్దగా పట్టించుకోరు. కేసీఆర్ కు ఏడాది, జగన్ కు రెండేళ్లు చాలా విలువైన సమయం. ఏం చేసినా ఈ సమయంలోనే చేయాలి.
ఈ సమయంలో చేసే పనులే ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయి. అసలు పాలనలో సగం పూర్తి కాగానే తరువాతి ఎన్నికల్లో ఎవరిని అధికారంలోకి తీసుకు రావాలనే దానిపై జనం దాదాపు ఒక నిర్ణయానికి వస్తారు. కాసేపు తెలంగాణా విషయం పక్కన పెడితే, జగన్ తన పదవీకాలంలో రెండేళ్లు పూర్తి చేశారు కాబట్టి వచ్చే రెండేళ్లలో ఆయన ఏం చేయబోతున్నాడనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఏ ప్రభుత్వమైనా సగం పాలన పూర్తి కాగానే ఎన్నికల కేబినెట్ తయారు చేసుకుంటుంది. అంటే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి.
ఎన్నికలంటే ఓట్ల వ్యవహారం కాబట్టి ఓట్లు సాధించడానికి కొన్ని సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారు. ఇదే కాకుండా పనితీరును బట్టి మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. కొంతమంది మంత్రుల పట్ల వారి నియోజకవర్గంలో అసంతృప్తిగా ఉంటారు జనం. అల్లాంటి మంత్రులతో ఎన్నికలకు వెళితే రాజకీయంగా నష్టం జరుగుతుంది. ఇలా కేబినెట్ లో మార్పులు చేయడానికి అనేక కారణాలు ఉంటాయి. తెలంగాణలో మంత్రివర్గ ప్రక్షాళన గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నా ఇప్పటివరకు అడుగులు ముందుకు పడలేదు.
ఇందుకు ఉన్న కొన్ని కారణాల్లో కరోనా కూడా ఒక కారణం కావొచ్చు. ఈటల రాజేందర్ ఎపిసోడ్ కూడా కారణం కావొచ్చు. టీఆర్ఎస్ నాయకులు అనేకమంది మంత్రివర్గంలో మార్పుల కోసం ఎదురు చూస్తున్నారు. తమకేమైనా అవకాశం ఉంటుందా అని అంచనా వేసుకుంటున్నారు. కరోనా ముగిసిందని అనుకున్న తరువాత కేబినెట్ లో మార్పులు ఉంటాయని అనుకుంటున్నారు.
ఇక ఏపీ సీఎం జగన్ మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడే మంత్రులతో చెప్పాడు మీరు పదవుల్లో ఉండేది రెండున్నర సంవత్సరాలేనని. ఆ సమయం రాగానే ఆయన కూడా మంత్రివర్గంలో మార్పులు చేయవచ్చు. అదే ఎన్నికల కేబినెట్ అవుతుంది. ఇక జగన్ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంలో మీడియాలో జరుగుతున్న చర్చల్లో వివిధ పార్టీల నాయకులు కావొచ్చు, పార్టీలతో సంబంధం లేనివారు కావొచ్చు ఎక్కువమంది చెబుతున్నది ఒక్కటే మాట … ఏపీ అభివృద్ధి చెందలేదని.
అధికారంలోకి వచ్చినప్పటినుంచి జగన్ అభివృద్ధి విషయం పట్టించుకోలేదని. నిజానికి ఇందులో అవాస్తవం ఏమీ లేదు. సంక్షేమాన్ని గురించి ఎంతైనా చెప్పుకోవడానికి జగన్ కు అవకాశం ఉంది. అభివృద్ధి గురించి ఆయన ఏం చెప్పుకుంటాడు? దీనిపై జనం ప్రశ్నిస్తే ఆయన వారిని ఎలా కన్విన్స్ చేస్తాడు ? వచ్చే రెండేళ్లలో ఏమైనా చేయగలడా ? అది సాధ్యమవుతుందా ?
అప్పులు చేసైనా సంక్షేమం సాగిస్తున్నాడు గానీ అప్పులు చేసైనా అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదు? సంక్షేమం ఉండాలి కరెక్టే. కానీ సంపద పెరగాలంటే, ప్రజలకు ఉపాధి దొరకాలంటే అభివృద్ధికి దోహదం చేసే వివిధ పరిశ్రమలు, కంపెనీలు ఉండాలి కదా. కానీ జగన్ ఆ దిశగా ఆలోచించడంలేదు. ఆయన ఏం చెప్పుకొని ఎన్నికలకు వెళతాడు అనేది పెద్ద చర్చనీయాంశమైంది.