బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన ప్రియురాలు క్వారీ సైమండ్స్‌ను పెళ్లాడారు. ప్రధానికి 56 ఏళ్లు, ఆమెకు 33 సంవత్సరాలు. వీరిద్దరికీ ఇప్పటికే ఏడాది వయసున్న కుమారుడు ఉండటం విశేషం. ఇదిలా ఉండగా బోరిస్ జాన్సన్ ప్రధాని అయినప్పటి నుంచి ఇద్దరూ డౌనింగ్ స్ట్రీట్‌లో సహజీవనం సాగిస్తున్నారు.
తాజాగా పెళ్లి అనేది కేవలం తంతు మాత్రమే. ఇంగ్లండ్‌లో 1822లో లార్డ్ లివర్ ప్రధాని పదవిలో ఉండగా పెళ్లి చేసుకున్నారు. ఆయన తర్వాత ప్రధాని పదవిలో ఉంటూ పెళ్లి చేసుకున్న రెండో పాలకుడిగా బోరిస్ రికార్డులకెక్కారు.
ఈ పెళ్లి వార్త అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందడానికి ప్రధాన కారణం బోరిస్‌కు మూడో వివాహం. గతంలో రెండుసార్లు విడాకులు తీసుకున్నారాయన. చివరిసారిగా మరీనా వీలర్ అనే లాయర్‌కి 2018లో విడాకులిచ్చారు. వీరికి నలుగురు సంతానం. వివాహేతర సంబంధాలతో బోరిస్ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. గతంలో బోరిస్ వివాహేతర సంబంధంతో కన్జర్వేటివ్ పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు.
ఇదిలా ఉండగా తన కంటే 23 ఏళ్లు చిన్నదైన క్వారీ సైమండ్స్‌పై బోరిస్ మనసు పారేసుకున్నారు. వారిద్దరికి 2020 ఫిబ్రవరిలో నిశ్చితార్ధం జరిగింది. వచ్చే ఏడాది జులైలో వీళ్ల పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే ఆకస్మికంగా తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు.
లండన్‌లో వెస్ట్‌మినిస్టర్ క్యాథెడ్రల్లో శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా తెలియజేసింది. కరోనా ఆంక్షలను పరిగణలోకి తీసుకుని కేవలం 30 మందిని మాత్రమే పెళ్లికి ఆహ్వానించినట్టు సమాచారం. పార్టీతో పాటు ప్రభుత్వంలోని ముఖ్యులకు కూడా ఆహ్వానం అందనట్టు తెలుస్తోంది. వివాహ వేడుకకు పెళ్లి కుమార్తె సైమండ్స్ అర్థగంట ఆలస్యంగా వెళ్లడం విశేషం.