సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చినట్టేనా..?

దేశంలో కరోనా రోజువారీ కేసులు నిలకడగా 2లక్షల లోపు నమోదు కావడం నిజంగా విశేషమే. అయితే ఓరోజు తక్కువ, ఆ మరుసటి రోజు ఎక్కువ అన్నట్టుగా ఇటీవల కాలంలో ఊగిసలాట కొనసాగింది. ఓ దశలో…

దేశంలో కరోనా రోజువారీ కేసులు నిలకడగా 2లక్షల లోపు నమోదు కావడం నిజంగా విశేషమే. అయితే ఓరోజు తక్కువ, ఆ మరుసటి రోజు ఎక్కువ అన్నట్టుగా ఇటీవల కాలంలో ఊగిసలాట కొనసాగింది. ఓ దశలో మే 6న అత్యథికంగా 4.14లక్షల కేసుల రికార్డు స్థాయిని అందుకున్న భారత్.. ఆ తర్వాత క్రమంగా కోలుకుంటూ వచ్చింది.

మే 24న తొలిసారిగా 2లక్షల కంటే తక్కువగా 1.96 లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే ఆ ఆనందం 24 గంటలు కూడా ఉండలేదు మే 25న 2.08లక్షలు, ఆ తర్వాతి రోజు మే 26న అంతకంటే ఎక్కువగా 2.11 లక్షల కేసులు నమోదయ్యాయి. దీంతో పరిస్థితిని అంచనా వేయడం నిపుణులకు కూడా కష్టంగా మారింది. ఇప్పుడు వరుసగా మూడురోజుల తగ్గుదల చూసే సరికి అందరిలో కాస్త ధైర్యం వచ్చింది.

వరుసగా మూడు రోజుల పాటు భారత్ లో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. శనివారం ఒక్కరోజు 1,65,553 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మరణాల సంఖ్య 3,460గా నమోదైంది. రోజువారీ మరణాల రేటు ఐదు రోజుల కనిష్టానికి పడిపోవడం కూడా మరో శుభ పరిణామం. ఇప్పటి వరకూ భారత్ లో నమోదైన మొత్తం కేసులు 2.79 కోట్లకు చేరుకున్నాయి. మొత్తం మరణాల సంఖ్య 3,25,972.

ఈ గణాంకాలు చూస్తుంటే.. భారత్ లో సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టినట్టేనని తెలుస్తోంది. లెక్కల్ని ఆధారంగా తీసుకోకపోయినా, ఆస్పత్రుల్లో పరిస్థితులు కూడా ఏమంత ప్రమాదకరంగా లేవని తేలుతోంది. గతంలో ఆస్పత్రి బెడ్ కావాలంటూ రికమండేషన్లు ఎక్కువయ్యేవి, ఏ వాట్సప్ గ్రూప్ లో చూసినా ఫలానా చోట ఆక్సిజన్ బెడ్ ఇప్పించండి, ఫలానా ప్రాంతంలో ఐసీయూ బెడ్ కావాలి అని అడిగేవారే ఎక్కువ. కానీ ఇప్పుడు కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా ఐసీయూ బెడ్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి.

ఒకప్పుడు రెమిడిసెవిర్ ఇంజక్షన్ల కోసం చాంతాడంత క్యూలైన్లు కనిపించేవి, బ్లాక్ మార్కెట్ దందా విపరీతంగా సాగింది. ఇప్పుడు రెమిడిసెవిర్ గురించి ఆలోచించేవారే లేరు. మరోవైపు ఆక్సిజన్ ధర కూడా పూర్తిగా దిగొచ్చింది. ఆక్సిజన్ పెద్ద సిలిండర్లు రీ-ఫిల్లింగ్ చేయడానికి గతంలో 2 వేల నుంచి 3వేల రూపాయలు వసూలు చేస్తుండగా.. ప్రస్తుతం రూ.600 మాత్రమే తీసుకుంటున్నారు. ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ల ధర గతంలో 60వేలనుంచి 70వేలు ఉండగా.. ఇప్పుడు వాటి రేటు 15వేల రూపాయలకు పడిపోయింది.

భారత్ లో సెకండ్ వేవ్ కల్లోలం తగ్గిపోతుందనడానికి ఇవే ఉదాహణలుగా నిలుస్తున్నాయి. అయితే కొవిడ్ ఆంక్షల సడలింపుకి మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్సాహం చూపించడంలేదు. కొన్ని రాష్ట్రాలు మాత్రమే సడలింపులకి మొగ్గుచూపుతుండగా.. మెజార్టీ రాష్ట్రాలు మాత్రం కర్ఫ్యూ కంటిన్యూ చేయడానికే ఇష్టపడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా కర్ఫ్యూ కొనసాగింపుకే ప్రభుత్వాలు మొగ్గుచూపుతున్నాయి.