పేకాటలో ఓడి పోతున్న కొద్దీ కసి పెరిగిపోతుంది. చేతికి ఏది అందితే దాన్నే పణంగా పెట్టాలనే దిశగా పంతం సాగిపోతుంది. ధర్మరాజు అంతటి వాడే ఈ తరహా వైఖరి నుంచి తప్పించుకోలేకపోయాడు. సినిమా నిర్మాణం కూడా అలాగే తయారయింది. ఎంత పెద్ద సంస్థ అయినా సరే, ఏదో ఒకటి తీసేయాలనే తపన, ఏదో ఓ సినిమా లైన్ లో వుండాలనే కోరిక. ఇదే బలహీనతగా మారుతోంది. హీరోల బలంగా మారుతోంది.
ఫ్లాపు హీరోలు కూడా కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నారంటే కారణం నిర్మాతల బలహీనత తప్ప వేరుకాదు. డైరక్టర్ల డేట్ లు పట్టేయాలని, హీరోల కాల్ షీట్లు సంపాదించాలని కిందా మీదా అయిపోతున్నారు. కోట్లకు కోట్లు రెమ్యూనిరేషన్ ఆఫర్ చేస్తున్నారు. అడ్వాన్సులు ఇచ్చి వడ్డీలు కట్టుకుంటూ ఏళ్లూ పూళ్లూ కాలక్షేపం చేస్తున్నారు.
ఇది చాలక ఇటీవల కొత్త ట్రెండ్ ఏమిటంటే రెమ్యూనిరేషన్ ఇస్తూనే లాభాల్లో వాటా కూడా ఇవ్వడం. ఆ డైరక్టర్ వల్లనే కదా మనకు సినిమా వచ్చింది. ఆ హీరో వల్లనే కదా సినిమా మార్కెట్ అయ్యింది. అలాంటి అవకాశం రావాలంటే వాళ్లకు వాటా ఇస్తే తప్పేంటీ అనే వాదనలు కూడా.
14రీల్స్..శర్వానంద్ సంగతే చూడండి. శ్రీకారం సినిమా ఒప్పుకునేటప్పటికే శర్వానంద్ రెండు ఫ్లాపుల్లో వున్నాడు. అయినా శ్రీకారం సినిమాకు అడిగిన రెమ్యూనిరేషన్ ఎనిమిది కోట్లు అంట. ఆరుకోట్లు ఇస్తామని, సినిమా బాగా వచ్చి, బాగా ఆడి, లాభాలు వస్తే చూద్దామని చెప్పి, ఒప్పించారు.
ఎంతమంది మిడ్ రేంజ్ హీరోలు వున్నారు. వారెవరు ఈ రేంజ్ లో లేరు. కానీ ఏ విధంగా శర్వానంద్ కు ఆరు కోట్లు ఇచ్చి, సినిమాను మార్కెట్ చేసుకుందాం అనుకున్నారో నిర్మాతలకే తెలియాలి. నిజానికి ఇవ్వాళ నిర్మాతలు అందరి అదృష్టం బాగుంది. నాన్ థియేటర్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగింది.
దాదాపు సిన్మా ఖర్చులో అరవై శాతం కేవలం నాన్ థియేటర్ ద్వారా రికవరీ అయిపోతోంది. కానీ ఆ ఆనందం కూడా నిర్మాతలకు మిగలడంలేదు. ఎంత వస్తోందో హీరోలే లెక్కలు కట్టి, అంతకు అంతా లాగేస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్లి నాన్ థియేటర్ ఆదాయాన్ని తమ రెమ్యూనిరేషన్ గా తీసుకుంటున్నారు.
అంటే నిర్మాతకు వచ్చే రెవెన్యూలో అరవై శాతం హీరోలే తీసేసుకుంటున్నారు. నలభై శాతం వుంటుందిగా? అని అనుకోవడానికి కూడా లేదు. ఫ్లాప్ అయితే ఈ నలభైకి మరో నలభై కలిపి మరీ బకాయిలు తీర్చుకోవాలి. అప్పుడు మాత్రం హీరోలు మరి మాట్లాడరు. మరో సినిమా చేద్దాం అనేది గ్యారంటీ లేని మాట.
తప్పు హీరోలది కాదు. వాళ్ల ద్వారానే వ్యాపారం జరుగుతోందని, వారి వెంట పరుగులు పెడుతూ వారి గొంతెమ్మ కోర్కెలకు తల వొగ్గుతున్న నిర్మాతలది. ఇటీవల ఇలా వాటా ఇవ్వాలనే డిమాండ్ కు తలవొగ్గకపోవడం వల్లే ఓ పెద్ద బ్యానర్ కు ఓ పెద్ద హీరోకు మధ్య చెడి ప్రాజెక్టు క్యాన్సిల్ అయిపోయింది. ఒక నిర్మాత వెళ్తేనేం..పది మంది నిర్మాతలు క్యూలో వుంటున్నారు. ఇక ఎవరి డిమాండ్ లు ఎందుకు తగ్గుతాయి?