కరోనా సెకెండ్ వేవ్‌తో బుల్లితెర, వెండితెరకు సంబంధించి స్వచ్ఛందంగా షూటింగ్‌లు బంద్ అయ్యాయని కొన్ని రోజులుగా చర్చించుకుంటున్నాం. కానీ ఢిల్లీలో ఓ నాయకుడి వాలకంతో షూటింగ్‌లు బంద్ అయ్యిందెక్కడ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ రోజు ఢిల్లీలో కొత్త గెటప్‌లో ప్రత్యక్షమయ్యారు.
గత కొన్ని రోజులుగా ఆయన వివిధ సందర్భాల్లో, పలు వేషధారణల్లో కనిపిస్తుండడం తెలిసిందే. ఏం చేసినా, చేయకపోయినా రఘురామకంటూ ఓ ప్రత్యేకత ఉంది. రాజకీయ తెరపై చంద్రబాబు తర్వాత అంతటి వారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నిస్తే, వెంటనే రఘురామ పేరే వినిపిస్తుంది.
వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు వారసుడు రఘురామ. కానీ ఇంతకాలం ఎందుకనో ఆ కోణంలో రఘురామ కీర్తినార్జించలేకపోయారు. పోనీ ఇప్పటికైనా రఘురామ ప్రతిభాపాఠవాలను సమాజం గుర్తించింది.
అదేంటో గానీ, సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రి అంటే ఎలాంంటి రోగాన్ని అయినా నిగ్గు తేలుస్తుందనే నమ్మకం ఇంతకాలం అందరిలో బలమైన నమ్మకం ఉండేది. బహుశా ఆ నమ్మకం, విశ్వాసంతోనే సుప్రీంకోర్టు కూడా రఘురామకృష్ణంరాజుకు సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు మిలటరీ ఆస్పత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు, అనంతరం నివేదిక సమర్పించడం చకచకా జరిగిపోయాయి.
అయితే రాజు గారికి ఎంతకూ కాళ్ల నొప్పులు తగ్గకపోవడం, బీపీ కంట్రోల్ కాకపోవడంతో ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఎయిమ్స్ వైద్య బృందం పరీక్షలు నిర్వహించి రఘురామ పాదాల్లో సెల్ డ్యామేజ్ ఎక్కువగా ఉన్నట్టు గుర్తించడం విశేషం. అంటే ఆస్పత్రి స్థాయి పెరిగే కొద్ది రఘురామలో కొత్తకొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయనే సంగతి బయటపడింది.
మొత్తానికి రఘురామకృష్ణంరాజు రెండు కాళ్లకు కట్లు కట్టి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఇంటికి పంపారు. ఈ సందర్భంగా నడవకూడదనే హెచ్చరికలను ఢిల్లీ వైద్యులు చేశారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్‌పై కేంద్రరక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చేసేందుకు వీల్ చైర్‌లో వెళుతూ రఘురామ ఆదివారం ప్రత్యక్షమయ్యారు. రఘురామ ఇంటి నుంచో లేక రాజ్‌నాథ్ కార్యాలయం నుంచో తెలియదు కానీ, రఘురామ వీల్‌చైర్‌లో లోపలి నుంచి రావడాన్ని చిత్రీకరించడంతో పాటు మీడియాకు విడుదల చేయడం వెనుక పక్కా ప్లానింగ్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు ఎలాంటి వీడియోలు మీడియాకు విడుదల చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. బహుశా అది దీనికి వర్తించదు కాబోలు. రక్షణ శాఖ మంత్రితో పది నిమిషాలు భేటీ అయిన ఆయన తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నట్టు ఫిర్యాదు చేశారని సమాచారం. రఘురామకు ఢిల్లీ వెళ్లిన తర్వాత రోగం పెద్దదైందనే విషయాన్ని ఆయనకు కట్టిన కట్లే నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ రఘురామ ప్రియ మిత్రులైన వైసీపీ నేతలు మాత్రం ఆయన నటనలో ఇరగదీస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అసలే షూటింగ్‌లు ఆగిపోయాయని కలత చెందుతున్న సినీ అభిమానులకు రఘురామ చక్కటి షో ప్రదర్శించారని వ్యంగ్యంగా అంటున్నారు. కేంద్రమంత్రులకు ఫిర్యాదు చేయడానికి మాత్రం ఏ రోగం అడ్డురాదని, కానీ విచారణ విషయానికి వస్తే సాకులు చెప్పడానికి వీల్‌చైర్ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
కరోనా విపత్తులో రఘురామ కామెడీని మరికొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సింగల్ టేక్‌లో ఎలాంటి క్యారెక్టర్‌నైనా చేయగలిగే నైపుణ్యం రఘురామ సొంతమని ఆయన్ను అమితంగా ప్రేమించే వారు అభిప్రాయపడుతున్నారు. రామ, రఘురామ, ఎంత కళ దాగి ఉందయ్యా మీలో అని కూనిరాగం తీసేవాళ్లు లేకపోలేదు.