వైఎస్ జగన్ ప్రభుత్వ బాదుడుపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సంబరాలు చేసుకుంటోంది. మరోసారి ఆర్టీసీ చార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ కేవలం విమర్శలకే పరిమితం కావడం విశేషం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ బాదుడిని నిరసిస్తూ రోడ్డెక్కకపోవడం వెనుక పక్కా వ్యూహం ఉంది. తాజాగా ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనకు పిలుపునిచ్చారు.
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, వామపక్ష కార్యకర్తలు పాల్గొన్నారు. మధు మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ చార్జీలు పెంచారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని వైసీపీ వల్లకాడు చేస్తుందని మండిపడ్డారు. ప్రజా ఉద్యమాలకు జనసేన ,టీడీపీలు కలిసి రావాలని ఆయన పిలుపునివ్వడం గమనార్హం.
జనసేన, టీడీపీ కలిసి ఉద్యమించేందుకు ముందుకు రావాలని సీపీఎం నాయకుడు మధు పిలిస్తే తప్ప ఆ పార్టీ నాయకులకు తెలియదని అనుకోవాలా? ఇక్కడే ఆ పార్టీల వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. వివిధ రకాల పన్నులు, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపుతోనూ ప్రజల నడ్డి విరచాలని ప్రతిపక్ష పార్టీలు కోరుకుంటున్నాయి. వీలైనంతగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగాలని ప్రతిపక్షాలు ఆశిస్తున్నాయి. అప్పుడే రాజకీయంగా తమకు లబ్ధి కలుగుతుందనేది ప్రతిపక్ష పార్టీల భావన.
అందుకే వరుసగా ఆర్టీసీ చార్జీలను ప్రభుత్వం పెంచినా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రోడ్డెక్కలేదు. జగన్ ప్రభుత్వం నుంచి ఇలాంటి పాలనే ఆ పార్టీ కోరుకుంటోంది. అధికారంలోకి రావాలని అనుకుంటున్న పార్టీ కోరుకుంటున్నట్టే, వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది.
ఎటూ వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు వామపక్షాల ఆందోళనలు తోడ్పడుతాయని టీడీపీ నమ్ముతోంది. అందుకే చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఇప్పటి వరకూ టీడీపీ ఎలాంటి ఆందోళనలకు దిగకపోవడాన్ని గమనించొచ్చు. పార్టీ, రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజాప్రయోజనాలు ఎవరికీ పట్టవనే సత్యాన్ని టీడీపీ మౌనాన్ని చూసి అర్థం చేసుకోవాల్సి వుంటుంది.