ర‌ఘురామ స‌రే… కృష్ణుడిని ప‌ట్టించుకోరా?

అధికారం, డ‌బ్బున్న వాళ్ల‌కు ఉండే గౌర‌వం ఎంతో ప్ర‌త్యేకం. న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుని ప‌ట్టించుకున్నంత‌గా స‌స్పెండ్ అయిన జ‌డ్జి రామ‌కృష్ణ‌ను ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. …

అధికారం, డ‌బ్బున్న వాళ్ల‌కు ఉండే గౌర‌వం ఎంతో ప్ర‌త్యేకం. న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుని ప‌ట్టించుకున్నంత‌గా స‌స్పెండ్ అయిన జ‌డ్జి రామ‌కృష్ణ‌ను ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. 

ర‌ఘురామకృష్ణంరాజు, స‌స్పెండ్ జ‌డ్జి రామ‌కృష్ణ …ఇద్ద‌రు కూడా టీడీపీ రాజ‌కీయ‌ ప్ర‌యోజ‌నాల కోస‌మే ప‌నిచేశార‌నేది బ‌ల‌మైన అభిప్రాయం. ఇద్ద‌రూ జైలుపాలు కావ‌డానికి ప్ర‌ధాన పాత్ర పోషించింది టీడీపీ అనుకూల మీడియానే. గ‌త నెల 15న రామ‌కృష్ణ‌ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన త‌ర్వాత రామ‌కృష్ణ గురించి ఊసేలేదు. అస‌లు ఆయ‌న ఏమ‌య్యారో కూడా ఎవ‌రికీ తెలియ‌ని దుస్థితి.

ఇదే ర‌ఘురామ‌కృష్ణంరాజు కుమారుడు భ‌ర‌త్ ఆరోప‌ణ‌ల‌కు, రామ‌కృష్ణ కుమారుడు ఎస్‌.వంశీకృష్ణ ఆందోళ‌న‌కు ఎల్లో మీడియా, టీడీపీ ఇస్తున్న ప్రాధాన్య‌త‌ల‌ను గమ‌నిస్తే నక్క‌కు నాగ‌లోకానికి ఉన్నంత తేడా. ర‌ఘురామ‌కృష్ణంరాజుతో పాటు ఆయ‌న కుమారుడు భ‌ర‌త్‌ తుమ్మినా, ద‌గ్గినా టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా గంద‌ర‌గోళం చేయ‌డం తెలిసిందే. 

న‌ర‌సాపురం ర‌ఘురామ కృష్ణంరాజు బెయిల్ కోసం ఢిల్లీ నుంచి లాయ‌ర్ల‌ను దింపిన టీడీపీ, రామ‌కృష్ణ విష‌యానికి వ‌స్తే ఉలుకుప‌లుకు లేదు. ఓ ద‌ళితుడు, ఆర్థిక బలం లేని రామ‌కృష్ణ‌కు అన్నీ తామై బెయిల్ ఇప్పించే ప్ర‌య‌త్నం ఎందుకు చేయ‌లేద‌నేది ఇప్పుడు ప్ర‌ధానంగా త‌లెత్తుతున్న ప్ర‌శ్న‌. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం రామ‌కృష్ణ కులం అవ‌స‌ర‌మైంది. కానీ ఆయ‌న్ను అరెస్ట్ చేస్తే మాత్రం ప‌ట్టించుకోక పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.

ఏబీఎన్ చాన‌ల్ వేదిక‌గా లైవ్‌లో వైఎస్ జ‌గ‌న్ త‌ల న‌రుకుతాన‌ని రామ‌కృష్ణ ఆవేశంతో ఊగిపోయి క‌ట‌క‌టాల పాల‌య్యారు. ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లా జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో తన తండ్రి ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని రామ‌కృష్ణ త‌న‌యుడు వంశీకృష్ణ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌, జైళ్ల‌శాఖ డీజీతో పాటు చిత్తూరు జిల్లా జ‌డ్జికి, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన తండ్రి ఉన్న బ్యారక్‌లో కొత్త వ్యక్తిని ఉంచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘సీఎం జగన్మోహన్‌ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదిరించేంత మొనగాడివా… నీ అంతు చూస్తా’ అంటూ ఆ వ్యక్తి బెదిరించినట్టు రామ‌కృష్ణ కుమారుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. జైల్లో తనతండ్రిని కలవగా అపరిచిత ఖైదీతో తనకు ప్రాణహాని ఉన్నట్లు ఆందోళన వ్య‌క్తం చేశార‌ని, ఆయనను వేరే బ్యారక్‌లోకి తరలించాలని, లేదంటే అపరిచిత ఖైదీని అయినా వేరే బ్యారక్‌లోకి తరలించాలని కోర‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికైనా రామ‌కృష్ణ‌ను ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.