ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్కే పిచ్చి పీక్‌కు చేరుకున్నట్టుంది. ఈ వారం ‘జగన్మోహనమా,జనకంటకమా?’ అనే శీర్షికతో వండివార్చిన విషపు కథనం చదివితే …ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌కు ఆయన కలం కంటకంగా తయారైందనే అనుమానాలు కలుగుతాయి. దాదాపు 20 ఏళ్ల క్రితం ఆర్కే నేతృత్వంలో పాత్రికేయ ఉద్ధండుడైన కె.రామచంద్రమూర్తి సారథ్యంలో ఆంధ్రజ్యోతి పునఃప్రారంభమైంది.
అప్పట్లో వి. మురళి (ప్రస్తుత సాక్షి ఎడిటర్), కొమ్మినేని శ్రీనివాసరావు (సాక్షి చానల్), కె.శ్రీనివాస్ (ప్రస్తుత ఆంధ్రజ్యోతి ఎడిటర్), అల్లం నారాయణ (నమస్తే తెలంగాణ మాజీ ఎడిటర్, ప్రస్తుతం తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్), కట్టా శేఖర్‌రెడ్డి (నమస్తే తెలంగాణ మాజీ ఎడిటర్, ప్రస్తుతం తెలంగాణ ఆర్టీఐ కమిషనర్), వసంతలక్ష్మి (సండే ఇన్‌చార్జ్), శ్రీరమణ, జీఆర్ మహర్షి (వ్యంగ్య రచయితలు) లాంటి కలాల దన్నుతో ఊపిరి పోసుకుంది.
ఎంతో మంది మేధావులు, కళాకారుల చేతిలో పునర్జీవం పొందిన ఆంధ్రజ్యోతి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఏ మాటకా మాట చెప్పాలంటే, ఆంధ్రజ్యోతి పునఃప్రారంభమైన కొత్తలో జర్నలిజానికి స్వర్ణయుగమే. చంద్రబాబుతో ఆర్కే అనుబంధం సంగతలా ఉంచితే, పత్రికపై దాని ప్రభావం అంతగా ఉండేది కాదు. దివంగత నేత వైఎస్సార్ పాదయాత్రకు ఆంధ్రజ్యోతి బ్రహ్మ రథం పట్టింది. ఆ తర్వాత కాలంలో ఏమైందో తెలియదు కానీ, ఆర్కే పూర్తిగా తన స్టాండ్ మార్చుకున్నారు. ఆర్కే మాటల్లోనే చెప్పాలంటే …కుబుసం జారిపోగానే ఆర్కే, ఆంధ్రజ్యోతి అసలు రూపం బయటపడుతూ వచ్చింది. అది టీడీపీ కరపత్రంగా మారింది.
ఏపీలో ఆ రెండు ఎల్లో పత్రికలంటూ వైఎస్సార్ పదేపదే జనాల్లోకి తీసుకెళ్లి …ఈనాడు, ఆంధ్రజ్యోతి విశ్వసనీయతను చావు దెబ్బ తీశారు. ఆ రెండు పత్రికల దెబ్బతిన్న విశ్వసనీయత పునాదులపైన్నే సాక్షి మీడియా …నాణేనికి రెండో వైపు చూపేందుకంటూ అవతరించింది. ‘ఉన్నది ఉన్నట్టు..ఉండదు కనికట్టు’ అనే నినాదంతో సాక్షి అవతరించింది. అయితే ఆచరణలో మాత్రం, జగన్ ప్రయోజనాల తర్వాతే జనం ప్రయోజనాలని చాలా త్వరగా తన రాతలతో నిరూపించుకుంది.
పైన పేర్కొన్నట్టు ఉద్ధండులైన జర్నలిస్టులు మురిపెంగా పెంచి, పెద్ద చేసిన ఆంధ్రజ్యోతి అనే 20 ఏళ్ల అభ్యుదయ యువతి గొంతును ఆర్కే చేజేతులా నులిమేస్తుండడం పాత్రికేయ సమాజ మనసును కలవరపెడుతోంది. గత కొన్నేళ్లుగా పాత్రికేయ వృత్తిలో ఆర్కే అరాచకాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారనేందుకు , ఆయన కలం నుంచి జాలువారిన అనేక ‘కొత్తపలుకు’లను ఉదహరించవచ్చు. ఆర్కే కలం ఎంతగా దిగజారిందో ఈ రోజు తన ఆర్టికల్‌లో రాసిన చివరి పలుకులే నిలువెత్తు నిదర్శనం.
‘గుణం కంటే కులం ముఖ్యమనుకునే సమాజం కనుకే ఒక్క చాన్స్ ప్లీజ్ అన్న జగన్ విజ్ఞప్తికి స్పందించిన జనం ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ముఖచిత్రానికి ప్రజలు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది. ‘యథా ప్రజా తథా రాజా’! అని తన వ్యాసాన్ని ఆర్కే ముగించారు.
ఆంధ్రప్రదేశ్ సమాజంపై ఆర్కేకు ఎంత చిన్న చూపో అర్థం చేసుకోడానికి ఈ వాక్యాలు చాలు. తన ఆరాధ్య నాయకుడు చంద్రబాబునాయుడిని ఘోరంగా ఓడించిన ఆంధ్రప్రదేశ్‌పై ఎంతటి నీచ వ్యాఖ్యలు చేయడానికైనా తాను వెనుకాడనని మరోసారి ఆర్కే కలం నిరూపించుకుంది. 2014లో ఇదే జనం చంద్రబాబుకు అధికారం కట్టబెట్టినప్పుడు కూడా ఆయన కులమే చూశారా? ఏమిటీ రాతలు? ఏమిటీ కూతలు? పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందనే చందంగా, జగన్ గెలుపును కులం కోణంలో చూడడం ఏంటి? ఇంతకంటే దుర్మార్గం, పిచ్చితనం మరేదైనా ఉందా?
‘కుబుసం జారిపోగానే అసలు రూపం బయటపడింది. రాజకీయ ప్రత్యర్థులను వేటాడి వేధించడమే ఆయన (జగన్) ప్రధాన ఎజెండా అయింది. సంక్షేమం పేరిట ప్రజాధనాన్ని పంచిపెడుతూ బలమైన ఓటు బ్యాంకును నిర్మించుకుంటూ, అదే సమ యంలో కక్ష సాధింపులకు తెర తీశారు’ అని ఆర్కే రాసుకొచ్చారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ జగన్ ప్రత్యర్థులను వేటాడి వేధించాడని ఆర్కే రాతల ప్రకారం నిజమే అనుకుందాం. మరి వైఎస్ జగన్‌ను గత పదేళ్లుగా టీడీపీ, కాంగ్రెస్, ఎల్లో మీడియా వెంటాడి వేధిస్తున్న మాటేంటి? మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రాకపోతే ఏపీ నాశనమే సర్వనాశనమే అంటూ చివరికి ఓ ఫుట్‌పాత్ వ్యక్తి ఇంటర్వ్యూని కూడా ప్రచురించిన శ్రీమాన్ జర్నలిజ ఉద్ధారకుడు ఆర్కే సెలవివ్వాలి.
మీడియాను అడ్డుపెట్టుకుని జగన్‌పై తాము ప్రతినిత్యం మానసికంగా దాడి చేస్తే మాత్రం అది పాప ప్రక్షాళన కోసం, అదే జగన్ చేస్తే మాత్రం కక్ష సాధింపా? ఇదెక్కడి లాజిక్ ఆర్కే గారు? చర్యకు ప్రతి చర్య ఉంటుందని న్యూటన్ మహాశయుడు ఏనాడో చెప్పారు. ఒకవేళ జగన్ మీరంటున్నట్టు జగన్ కక్ష సాధిస్తున్నారని అనుకుంటే, అది ప్రతిచర్యగా జనం చూస్తున్నారు.
ఒకవైపు కక్ష సాధిస్తున్నారని చెబుతూనే, మరోవైపు జగన్ ఓటు బ్యాంకును పెంచుకుంటున్నారని ఆర్కే వాపోతున్నారు. ఇది ఎలా సాధ్యం? చంద్రబాబును ఓడించిన జనాన్ని తిట్టిపోసేందుకు కూడా ఆర్కే వెనుకాడలేదంటూ ఆయన కలం విచక్షణ కోల్పోయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారం వారానికి ఆయన కలం మతి తప్పుతోంది. అందుకే జగన్‌తో పాటు జనాన్ని కూడా కలిపి తిట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇది ఏపీ ప్రజాభిప్రాయాన్ని కించపరచడంతో పాటు ఆ సమాజ చైతన్యాన్ని తక్కువ చేయడమే. ఈ తెంపరి తనం ఆర్కేకు ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబు ఓటమికి దారి తీసిన పరిస్థితులను చెప్పి, పార్టీని సరైన మార్గంలో నడిచేలా తన కలం ఉపయోగపడాల్సింది పోయి, మరింత అగాథంలోకి నెట్టేలా ఆర్కే రాతలున్నాయి.
తమ ఆకాంక్షలకు అనుగుణంగా జగన్ పరిపాలించలేదని జనం భావిస్తే, చంద్రబాబుకు పట్టిన గతే పడుతుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ముఖచిత్రం గురించి ఆర్కే బెంగపడాల్సిన పనిలేదు. ఆర్కే మాటల్లో చెప్పాలంటే జనకంటకుడిగా మారిన జగన్‌ను జనం ఓడించకపోతే… అందులో ఆర్కే కూడా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ‘యథా పచ్చ మీడియా తథా టీడీపీ’!
సొదుం రమణ