సాక్షి శ్రీకారం చుట్టింది.. మిగతా మీడియా సంగతేంటి?

అందరికీ జర్నలిస్ట్ కావాలి. ఎందుకంటే ప్రచారం చేసి పెడతాడు కాబట్టి. కానీ జర్నలిస్ట్ కు ఏమైనా అయితే ఎవ్వరికీ వద్దు. ఎందుకంటే అతడితో ఇక ఉపయోగం లేదు కాబట్టి. బయట తిరిగే పెద్ద మనుషుల్లోనే…

అందరికీ జర్నలిస్ట్ కావాలి. ఎందుకంటే ప్రచారం చేసి పెడతాడు కాబట్టి. కానీ జర్నలిస్ట్ కు ఏమైనా అయితే ఎవ్వరికీ వద్దు. ఎందుకంటే అతడితో ఇక ఉపయోగం లేదు కాబట్టి. బయట తిరిగే పెద్ద మనుషుల్లోనే కాదు, మీడియా సంస్థల్లో కూడా ఇదే ఆలోచన. అందుకే పాత్రికేయుడి బతుకు దుర్భరం అయిపోయింది.

ఈ కరోనా కష్టకాలంలో ఎంతోమంది టీవీ-ప్రింట్ మీడియా సిబ్బంది మృతిచెందారు. వాళ్ల కుటుంబాలన్నీ రోడ్డునపడ్డాయి. ఇది కఠోర సత్యం. ఆర్థికంగా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాడెవ్వడూ జర్నలిస్ట్ అవ్వడు. జర్నలిస్ట్ గా ఉన్న వాడెవ్వడికీ ఆర్థికంగా బ్యాక్ గ్రౌండ్ ఉండదు. దీనికి ఒకరిద్దరు మినహాయింపు అంతే. అలాంటి వాళ్లను జర్నలిస్టులు అనే కంటే లాబీయిస్టులు అంటుంటారు ముద్దుగా. వాళ్ల సంగతి పక్కనపెడదాం.

కరోనా టైమ్ లో జర్నలిస్టుల బతుకు మాత్రం దుర్భరమైంది. ప్రాణాలు కోల్పోవడం కంటే ముందు ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లే కుప్పలుతెప్పలు. అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు సదరు సంస్థ నుంచి జర్నలిస్టులకు, ఆఫీస్ సిబ్బందికి ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఏమీ లేదు. ఇలాంటి టైమ్ లో ముందుకొచ్చింది సాక్షి. అందరికీ మార్గదర్శకత్వంగా నిలిచేలా మంచి ప్యాకేజీ ప్రకటించింది.

మరణించిన ఉద్యోగి కుటుంబానికి అండగా నిలిచేలా సాక్షి గ్రూప్.. ఆ కుటుంబానికి ప్రతి నెలా కొంత మొత్తం అందిస్తుంది. మరణించిన ఉద్యోగి ప్రస్తుత నెల జీతం లేదా 25వేల రూపాయల్లో ఏది తక్కువైతే అంత మొత్తాన్ని ఏకంగా 12 నెలల పాటు ఉద్యోగి కుటుంబానికి అందిస్తుంది సాక్షి. ఇది కేవలం జర్నలిస్టులకు మాత్రమే కాదు, సంస్థలో పనిచేసే ప్రతి ఫుల్ టైమ్ ఉద్యోగికి వర్తిస్తుంది. దీంతో పాటు గ్రూప్ టర్మ లింక్ ఇన్సూరెన్స్ కింద 4 లక్షల రూపాయలు, ఎంప్లాయి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ కింద మరో 7 లక్షల రూపాయలు అందిస్తుంది.  

ప్రస్తుత పరిస్థితుల్లో ఇది నిజంగా ఎంతో ఉదాత్తమైన నిర్ణయం. ఎందుకంటే ఓ జర్నలిస్ట్ చనిపోయిన తర్వాత అతడి కుటుంబం నెల ఖర్చులు కూడా భరించలేని స్థితికి చేరుకుంటుంది. ఎంతో పేరు సంపాదించుకున్న జర్నలిస్ట్ టీఎన్ఆర్ లాంటి వ్యక్తులు కూడా ఆర్థికంగా ఏమీ సంపాదించుకోలేకపోయారనే విషయం ఆయన మృతిచెందిన తర్వాత జనాలకి తెలిసింది. ఇక సాధారణ జర్నలిస్టు పరిస్థితిని ఊహించుకోవచ్చు.

సాక్షి చూపించిన ఈ చొరవను మిగతా మీడియా చూపిస్తుందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం. తెలుగు మీడియాలో అతిపెద్ద సంస్థగా చెప్పుకునే ఈనాడు గ్రూప్ ఇప్పటివరకు ఇలాంటి పని ఎప్పుడూ చేయలేదు. పైపెచ్చు లే-ఆఫ్ పేరిట చాలామంది ఉద్యోగుల్ని నిర్థాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి తీసేసింది. చాలామందిని శెలవులపై పంపించింది. ఇక ఆంధ్రజ్యోతి సంగతి సరేసరి. కరోనా టైమ్ లో మొట్టమొదట ఉద్యోగాలు తీసేసింది ఈ సంస్థే. ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఎగ్గొట్టి మరీ ఉద్యోగాల నుంచి వెళ్లగొట్టిన నీచ చరిత్ర దీనిది.

తమ కడుపు నిండిందా లేదా అని మాత్రమే చూసుకునే ఇలాంటి సంస్థల నుంచి “”సాక్షి మార్క్ ప్యాకేజీ”” ఆశించడం భ్రమే అవుతుంది. కానీ ఇన్నాళ్లూ కోట్ల రూపాయలు వెనకేసుకున్న ఈ సంస్థలు, ఈ కష్టకాలంలో ఉద్యోగులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పైకి ప్రవచనాలు చెప్పే వీళ్లంతా ఇప్పుడు తమ పెద్దరికాన్ని, పెద్దమనసును చాటిచెప్పాలి.