చిత్తూరు జిల్లాలో కరోనా కట్టడికి లాక్డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది.
అయితే రెండు మూడు జిల్లాల్లో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. వాటిలో చిత్తూరు జిల్లా ముందు వరుసలో ఉంది. నిన్న ఒక్కరోజే ఆ జిల్లాలో 2,291 కొత్త కేసులు నమోదు కాగా, 15 మరణాలు సంభవించాయి.
అలాగే ఇప్పటి వరకూ చిత్తూరు జిల్లాలో 1.85 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. వీరిలో 1.63 లక్షల మందికి పైగా కోలుకున్నారు. 1254 మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది.
తిరుపతి ఎస్వీ వెటర్నరీ వర్శిటీలో కోవిడ్‌పై అధికారులతో మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతమ్‌రెడ్డి శనివారం సమీక్షించారు. కర్ఫ్యూ తీరు, ఆక్సిజన్ సరఫరా, బ్లాక్‌ఫంగస్ కేసులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జూన్ 1 నుంచి చిత్తూరు జిల్లాలో లాక్డౌన్ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ సరుకులు కొనుగోలుకు అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించారు.
ఉదయం 10 గంటల తర్వాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని చెప్పారు. కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సరిహద్దు చెక్‌పోస్టులను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.