చేసే వృత్తిలో, వ్యక్తిత్వంలో Flawless గా ఉండటం ఎవరికైనా సాధ్యపడుతుందా? పైనుంచి ఒత్తిళ్లు, ప్రలోభాలు పుష్కలంగా ఉండే ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మానవ సహజమైన బలహీనతలకు లొంగిపోకుండా నిలబడటం ఎందరికి సాధ్యం? అసలు అటువంటి వ్యక్తులు ఉండే అవకాశం ఉన్నదా?
నమ్మశక్యం గాని ముక్కుసూటి వ్యక్తిత్వంతో, తన బాధ్యతను నిష్టగా, నిజాయితీగా, నిష్కర్షగా నిర్వర్తించిన అరుదైన పాత్రికేయుడు, విశిష్ట సంపాదకుడైన ఎం. రాజేంద్ర గారు 84 సంవత్సరాల వయస్సులో నిశ్శబ్దంగా ఈ లోకం నుంచి నిష్క్రమించారన్న వార్త మనసును కలచివేసింది.
రాజేంద్ర గారు పత్రికారంగంలో సవ్యసాచి. చిన్నతనం నుండే అబ్బిన సాహిత్య అభిరుచి ఆయనను రచయితగా, కవిగా మలచింది. పత్రికా రంగంలో ప్రవేశించిన తర్వాత ఆయన ఆంధ్రప్రభ, ఈనాడు, ఆంధ్రభూమి తదితర పత్రికలలో కరస్పాండెంట్ నుంచి కీలకమైన సంపాదక బాధ్యతలు నిర్వర్తించారు. సమకాలీన రాజకీయాలను పదునైన పదజాలంతో అలవోకగా విశ్లేషించేవారు.
1980వ దశకం ప్రారంభంలో రాజేంద్ర గారి చేతుల్లోకి ఆంధ్రప్రభ వీక్లీ వచ్చింది. పేరుకు ఆ పత్రిక ఎడిటర్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారే అయినా.. ఇన్చార్జిగా మొత్తం బాధ్యత రాజేంద్ర గారే చూసేవారు. హైదరాబాద్ దోమలగూడలోని ఆంధ్రప్రభ ఆఫీసుకు ఎప్పుడైనా వెళితే.. రాజేంద్ర గారు తన ఎదురుగా బల్లమీద దొంతర్లుగా పరిచిన కథలు, కవితల ఫైళ్లు ముందేసుకొని ఇన్ సెసెంట్ గా సిగరెట్లు తాగుతూ (సిగరెట్ పూర్తవకముందే మరో సిగరెట్ వెలిగించేవారు) తల తిప్పకుండా తదేకంగా తన పనిలో మునిగిపోయినట్లు కన్పించేవారు.
రచయితలు, కవులు తమ రచనల్ని పోస్ట్ లో పంపితేనే స్వీకరించే ఆనవాయితీ ఆంధ్రప్రభకు ఉండేది కనుక.. ఔత్సాహిక రచయితలు, కవులు, కార్టూనిస్టుల తాకిడి ఆయన మీద ఉండేదికాదు. అంచేత రాజేంద్ర గారు లిటరరీ సర్కిల్ లో అంత పాపులర్ కాలేదు.
ప్రముఖ ఆంగ్ల పత్రిక 'ఇండియా టుడే' భారతీయ భాషలలో ప్రాంతీయ ఎడిషన్లు తేవాలని నిర్ణయించి.. 'తెలుగు ఇండియా టుడే' కు కాపీ ఎడిటర్ ఎం.రాజేంద్ర గార్ని ఎంచుకున్నారని తెలిసినపుడు.. తెలుగు పత్రికాలోకం ఉలిక్కి పడింది. అప్పటికే తెలుగులో కొమ్ములు తిరిగిన ఎడిటర్లు కొందరున్నారు. ఏ కొత్త పత్రిక మొదలైనా.. యాజమాన్యాలు వాళ్లతో బేరసారాలు చేసి, భారీ ప్యాకేజీలిచ్చి సంపాదకులుగా వాళ్ళను పెట్టుకోవడం, ఏడాదో రెండేళ్లో వాళ్ళు సదరు పత్రికలకు సంపాదకత్వం నెరపి బయటకు రావడం రివాజుగా వస్తోంది. కానీ, ఆ ఒరవడికి భిన్నంగా.. ఇండియా టుడే యాజమాన్యం భారీ హెూంవర్క్ చేసి.. చివరకు ఎం. రాజేంద్ర గారిని కాపీ ఎడిటర్ గా ఎంచుకొంది.
ప్రతిభతో పాటు నిజాయితీని పరిగణనలోకి తీసుకోవడం వల్లనే తెలుగు ఇండియా టుడేకు ఎం. రాజేంద్ర ఎడిటర్ కాగలిగారు. నిజానికి 'ఇండియా టుడే' యాజమాన్యం ఆ నిర్ణయం తీసుకోవడం వల్లనే.. దాదాపు దశాబ్ద కాలం పైగా తెలుగునాట 'ఇండియా టుడే' ఓ వెలుగు వెలిగింది. హిందీ, తమిళం మొదలైన ప్రాంతీయ భాషలలో కంటే తెలుగులో 'ఇండియా టుడే' సాధించిన విజయం కలిగించిన సంచలనం అంతా ఇంతా కాదు. 'తెలుగు ఇండియా టుడే” వెలువరించిన ప్రత్యేక సంచికలు దేనికదే ఓ అపురూప నిధి. సినిమా, సాంస్కృతికం, కవిత్వం, యాత్రాకథనాలు.. ఇలా పలు అంశాలపై.. మరే ఇతర భాషా సంచికలు చేయనన్ని ప్రయోగాల్ని తెలుగులో రాజేంద్ర గారు చేశారు.
ఆశ్చర్యం ఏమంటే.. 72 పేజీల సంచికలో ఒక్క అక్షర దోషం కూడా కనపడేది కాదు. తెలుగు అనువాదంలో 'ఈనాడు' కూడా చేయలేని పద విన్యాసాలు తెలుగు ఇండియా టుడేలో కనపడేవి. కొన్ని సంచికలు చూసినప్పుడు వాటిని గుండెలకు హత్తుకొని, ఎంత గొప్పగా 'ఎడిట్' చేశావయ్యా అని మనసులోనే రాజేంద్ర గారికి నమస్కారం పెట్టిన సందర్భాలున్నాయి.
తెలుగు 'ఇండియా టుడే' లో కథానిక ప్రచురణ అయితే.. రచయితలకు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందపడే స్థాయిని కల్పించారు రాజేంద్ర గారు. అప్పటికి, డజన్లకొద్దీ నవలలు రాసి.. తెలుగు నవలా ప్రపంచాన్ని ఏలుతున్నామని భావిస్తున్న కొందరు రచయితలు సైతం.. 'ఇండియా టుడే' లో తమ కథ పడాలని తహతహలాడి పోయారు. తాము రాసిన స్క్రిప్ట్ ను యథాతథంగా ప్రచురించాలని, ఎడిట్ చేయడం కుదరదని వీక్లీ ఎడిటర్లకు (అందులో నేనూ ఉన్నాను) టర్మ్స్ డిక్టేట్ చేసిన మల్లాది వెంకటకృష్ణమూర్తి, యండమూరి వీరేంద్రనాథ్ వంటి ప్రముఖ రచయితలకు “మీ రచనలను ఎడిట్ చేసే స్వేచ్ఛ మాకు ఉంది. అందుకు ఇష్టం అయితేనే పంపండి” అని నిష్కర్షగా చెప్పి.. కమర్షియల్ రైటర్స్ కు తమ స్థానం ఏమిటో చూపించిన ఏకైక ఎడిటర్ రాజేంద్ర గారే!
1984 ఫిబ్రవరిలో హైదరాబాద్ నుంచి 'పల్లకి' సచిత్ర వార పత్రికకు నేను సీనియర్ సబ్ ఎడిటర్ చేరిన సందర్భంలో నాకు రాజేంద్రగారితో పరిచయం ఏర్పడింది. పల్లకి పబ్లిషర్ కందనాతి చెన్నారెడ్డి గారికి రాజేంద్ర గారు మిత్రుడు. బంధువు కూడా (ఆ విషయం చెన్నారెడ్డి గారు నాకు చెప్పారు గానీ.. రాజేంద్ర గారు ఎన్నడూ తన నేపథ్యం చెప్పుకొనే వారు కాదు). పంజాగుట్టలోని జర్నలిస్ట్ కాలనీలో వారిరువురు పక్కపక్క ఇళ్లల్లో ఉండేవారు. అప్పటికి రాజేంద్ర గారు ఆంధ్రప్రభ వీక్లీకి అసోసియేట్ ఎడిటర్ గా ఉన్నారు. దాదాపుగా ప్రతిరోజూ రాజేంద్ర గారిని కారులో ఎక్కించుకొని పల్లకి ఆఫీసుకు తెచ్చేవారు చెన్నారెడ్డి గారు.
రాజేంద్ర గారు పత్రికకు సంబంధించి మాకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు. వయస్సులో ఆయన నాకంటే ఓ పాతికేళ్లు పెద్దవాడు. అయినా ఎంతో స్నేహ పూర్వకంగా ఉండేవారు. పల్లకి తర్వాత 'ఈతరం' రాజకీయ పత్రిక ప్రారంభం అయ్యాక.. రాజేంద్ర గారు రోజూ సాయంత్రం వేళల్లో ఆఫీసుకు వచ్చి.. పొలిటికల్ స్టోరీలకు వెడ్డింగ్ లు, కవర్ స్టొరీ అంశాలలో మమ్మల్ని గైడ్ చేసేవారు. మా పరిచయం మరింత పెరిగినాక.. ఆయన నన్ను మరింత అభిమానించారు.
1991లో రాజేంద్ర గారు 'ఇండియా టుడే' సంపాదకుడిగా మద్రాస్ వెళ్లే సమయంలో నేను ఆయన్ను కలిశాను. అప్పటికి నేను 'పల్లకి’కి ఇన్చార్జ్ ఎడిటర్ గా ఉన్నాను. “నిన్ను నా టీమ్ తీసుకోవాలని ఉంది. కానీ, చెన్నారెడ్డి నా ఫ్రెండ్.. అతన్ని అప్సెట్ చేయడం నాకిష్టం లేదు” అని చెప్పారు.
రాజేంద్ర గారు 'ఇండియా టుడే' కు ఎడిటర్ అయ్యాక ఆయన ప్రతిభ, ఆయన వ్యక్తిత్వం పత్రికారంగంలోని వారందరికీ తెలిసొచ్చింది. ఎంతగా అంటే.. ఆయన నెలకొల్పిన ప్రమాణాలతో పోల్చి చూసుకొని తాము సిగ్గుపడేంతగా! సిగరెట్ ప్యాకెట్లకు, మందు బాటిళ్లకు.. చివరకు ద్వారకా హెూటల్, తాజ్ మహల్ హెూటళ్లల్లో రోజువారీ టిఫిన్లకు లొంగిపోయిన సంపాదకులు నాకు తెలుసు. కథలు, కవితలు ప్రచురించినందుకు 'క్విడ్ ప్రో కో’ గా ఇంకా మరి ఎన్నింటికో కక్కుర్తి పడినవారు కూడా ఉన్నారు. కానీ, రాజేంద్ర గారు వృత్తి ధర్మాన్ని నిష్కామకర్మగా, నిప్పులా నిర్వర్తించారు. ఓ చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను.
కందనాతి చిన్నారెడ్డి గారికి, ఎం. రాజేంద్ర గారికి వాస్తుశిల్పి బి.ఎన్.రెడ్డి గారు కామన్ ఫ్రెండ్. హైదరాబాద్ లో 80వ దశకంలోనే అపార్ట్మెంట్ల సముదాయాలు నిర్మించిన వాస్తుశిల్పి బి.ఎన్.రెడ్డికి సాహిత్యంలో ప్రవేశం ఉంది. ఆయన మినీ కవితలు రాసేవారు. ఆయన తన కవితల్ని 'ఆంధ్రప్రభ' వీక్లీలో ప్రచురించమని తన మిత్రుడైన ఎం. రాజేంద్ర గారిని కోరితే.. వాటిని పరిశీలించిన ఆయన “ఇవి మా పత్రికలో ప్రచురించడానికి పనికిరావు. ఇంకో పత్రిక దేనికైనా పంపించు” అని నిష్కర్షగా చెప్పేశారు. అదీ రాజేంద్ర గారి నిబద్ధత. రాజేంద్ర గారు ఎన్నడూ నీతులు, ఆదర్శాలు వల్లించలేదు. వాటిని వ్యక్తిత్వంలో, వృత్తిలో చూపించారు. ఆయనను తలచుకొంటేచాలు గొప్ప గౌరవ భావం నిలువెల్లా కలుగుతుంది. ఆ మహా మనిషికి నివాళి.
– విక్రమ్ పూల