14 రీల్స్ ప్లస్-శర్వానంద్ విషయంలో తప్పు ఎవరిది అన్నదానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శర్వానంద్ కోర్టు నోటీసులు ఇవ్వడంపై 14 రీల్స్ అధినేతలు చాలా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తాము బకాయి లేదు అని చెప్పడం లేదని, ఇవ్వమని అనలేదని, కానీ శ్రీకారం సినిమా విషయంలో ఎన్ని కష్టాలు పడ్డాం, ఎంత నష్టపోయాం అన్నది శర్వాకు తెలియదా అని నిర్మాతలు తమ సన్నిహితుల దగ్గర వాపోయినట్లు తెలుస్తోంది.
సినిమా క్లయిమాక్స్ షూట్ కు ముందు మూడు నెలలు కేవలం హీరో వల్ల ఆగిపోయిన సంగతి తెలియదా? విడుదలకు ముందు వెనుక కరోనా ఎలా ఇబ్బంది పెట్టిందో తెలియదా? అంటూ వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిర్మాతలు అంతా కూర్చుని, 20శాతం తగ్గించుకోవాలని అందరికీ సూచించని సంగతి, ఆ మేరకు శర్వా కూడా తగ్గించుకోవాల్సిన సంగతిని నిర్మాతలు గుర్తు చేసినట్లు తెలుస్తోంది.
ఇదే శర్వా గతంలో కో అంటే కోటి సినిమా తీస్తే ఓ ఏరియాకు తాము కేవలం రిలేషన్ కోసం ఇరవై లక్షలకు కొని తొంభై శాతం నష్టపోయామని, ఆ బ్యాలన్స్ ఇస్తా అని చెప్పిన శర్వా, ఆ తరువాత ఆ సంగతే మరిచిపోయారని వారు సన్నిహితుల దగ్గర వాపోయినట్లు తెలుస్తోంది.
ఒకటి మాత్రం నిజం. కరోనా కారణంగా ఇండస్ట్రీ పారలైజ్ అయిపోయిన టైమ్ లో, సిన్మా హిట్ కాలేదని తెలిసి కూడా శర్వానంద్ బకాయి రెమ్యూనిరేషన్ కోసం లాయర్ నోటీసుల వరకు వెళ్లడం సరైనది కాదనే అనుకోవాలి.