చంద్రబాబు కొత్తగా ఎత్తుకున్న గడియారం కథ గురించి మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. ముల్లు (అధికారం) ఎప్పుడూ ఒక్కచోటే ఆగిపోదని, ఏదో ఒక టైమ్ లో తన దగ్గరకి కూడా వస్తుందని బాబు చిలకజోస్యం చెప్పారు. దీనిపై ఎంపీ విజయసాయి సెటైర్ వేశారు.
“గడియారం ముల్లుపై ఆశలు పెట్టుకుని జూమ్ లో కాలక్షేపం చేస్తుండు. శాశ్వతంగా అక్కడే మిగిలిపోతావు. కాలం పరుగులు పెడుతూనే ఉంటుంది. దానితో పోటీపడి పని చేస్తుంటాడు యువ సిఎం. నీకు వయసు మీద పడింది. టైమ్ అయిపోయింది. ముల్లు వెనక్కి తిరగదు.”
ఇలా బాబు గడియారం ముల్లు కథపై ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు విజయసాయి. జనం సంక్షేమ పథకాల మాయలో పడ్డారని చంద్రబాబు ఆరోపించడం సిగ్గుచేటని అన్నారు. ఇకనైనా చంద్రబాబు జూమ్ లో ఆర్తనాదాలు చేయడం ఆపేయాలన్నారు.
“సిఎం జగన్ గారి నవరత్నాల పేరు వింటేనా గజగజ వణికిపోతాడు బాబు. సంక్షేమ పథకాల మాయలో పడ్డారని ప్రజలపై ఏడుస్తాడు. రాష్ట్రం సుభిక్షంగా ఉంటే తట్టుకోలేకపోతున్నాడు. ఇంట్లో కూర్చుని జూమ్ లో ఆర్తనాదాలు చేస్తున్నాడు. మహానాడు పేరుతో రెండ్రోజులు సంతాప దినాలు పాటించాడు.”
అటు పదో తరగతి పరీక్షల వాయిదా తన గొప్పదనమే అంటూ గొప్పలు చెప్పుకుంటున్న లోకేష్ పై కూడా విజయసాయి పంచ్ లు పడ్డాయి. చదువు విలువ తెలిసిన వాడు మాత్రమే పరీక్షల్ని గౌరవిస్తాడని అన్నారు.
“తండ్రి కంటే కొడుకు ఒక ఆకు ఎక్కువే చదివాడని కిరీటం పెట్టించుకోవాలని తెగ ఆరాటపడుతున్నాడు మాలోకం. కరోనా నేపథ్యంలో టెన్త్ పరీక్షలను వాయిదా వేస్తే అది తన ఘనతే అని జబ్బలు చరుచుకుంటున్నాడు. చదువు 'కొన్న' వాడికి పరీక్షల విలువ ఏం తెలుస్తుంది? శుద్ధ మొద్దులకే పరీక్షలంటే భయం.”
ప్రతి ఏటా వచ్చే వర్థంతి, జయంతికి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం.. ఆ తర్వాత దాన్ని మరిచిపోవడం 20 ఏళ్లుగా జనం చూస్తున్నారని.. ఇకనైనా చంద్రబాబు ఇలాంటి నీచ రాజకీయాలు మానుకుంటే మంచిదని సూచించారు విజయసాయి.