కూతురిపై ప్రేమ ఓవైపు, పరువు పోతుందనే భయం మరోవైపు.. దీంతో అమృత ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని.. ఆమె తండ్రి మారుతిరావు హత్య చేయించిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. దీనిపై రామ్ గోపాల్ వర్మ తనదైన స్టయిల్ లో సినిమా కూడా తీశాడు. ఇప్పుడు దీన్ని పోలిన మరో ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. తన కంటే తక్కువ స్థాయి ఉన్న వ్యక్తిని కూతురు ప్రేమించిందనే కోపంతో ఓ తండ్రి.. యువకుడ్ని హత్య చేశాడు. అది కూడా అత్యంత కిరాతకంగా.
బెంగళూరులో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ధనశేఖర్ అనే 23 ఏళ్ల కుర్రాడు. ఇతడిది చిత్తూరు జిల్లా పలమనేరు. లాక్ డౌన్ కారణంగా సొంతూరు వచ్చిన ధనశేఖర్.. తన వీధిలోనే ఉన్న ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు.
ఓ రోజు ఇంట్లో ఎవ్వరూ లేని టైమ్ చూసి అమ్మాయి, ధనశేఖర్ కు మెసేజ్ పెట్టింది. దీంతో అమ్మాయి ఇంటికి వెళ్లాడు ధనశేఖర్. అదే టైమ్ కు అమ్మాయి తండ్రి బాబు, ఇంట్లోకి వచ్చాడు. తన కూతురితో పాటు ఉన్న ధనశేఖర్ ను చూశాడు.
ధనశేఖర్ ను తన పొలం వద్దకు తీసుకెళ్లాడు బాబు. కూతుర్ని ప్రేమించాడనే కోపంతో హత్య చేశాడు. మృతదేహాన్ని తన వ్యవసాయ బావిలో పడేశాడు. 3 రోజుల తర్వాత మృతదేహం పైకి తేలడంతో అందరికీ తెలిసిపోతుందనే భయంతో తనే బయటకు తీసి ముక్కలు చేసి తన పొలంలోనే పాతిపెట్టాడు.
కొడుకు కనిపించడం లేదంటూ మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రేమకథ కూపీ లాగగా అసలు విషయం బయటపడింది. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టంకు పంపించారు. హత్య చేసిన బాబును, ఆయన భార్య, కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు.