జూమ్ సాక్షిగా టీడీపీలో కుల రచ్చ

తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం కాస్తా కులాల రంగు పులుముకుంది. అసలు పార్టీతో ఏ కులం అంటిపెట్టుకుని ఉంది, ఏ కులంలో పార్టీపై నమ్మకం తగ్గింది అనే విషయాలన్నీ బహిరంగంగానే మాట్లాడుకున్నారు నేతలు. Advertisement…

తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం కాస్తా కులాల రంగు పులుముకుంది. అసలు పార్టీతో ఏ కులం అంటిపెట్టుకుని ఉంది, ఏ కులంలో పార్టీపై నమ్మకం తగ్గింది అనే విషయాలన్నీ బహిరంగంగానే మాట్లాడుకున్నారు నేతలు.

మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కులాల చర్చను లేవనెత్తారు. క్రిస్టియన్, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి కులాల్లో టీడీపీకి ఆదరణ తగ్గిందని చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా ఎస్టీలు  టీడీపీకి దూరమయ్యారని అన్నారు.

వారందరినీ అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చే విధంగా మహానాడులో తీర్మానాలు పెడితే బాగుంటుందని సోమిరెడ్డి చెప్పగా, అలాంటి తీర్మానాలు పెడితే అసలుకే మోసం వస్తుందని యనమల వారించారు. ఇప్పటివరకూ ఆయా కులాలకు టీడీపీ ఏమీ చేయలేదనే వాస్తవాన్ని ఒప్పుకున్నట్టవుతుందని అన్నారు యనమల. అన్ని కులాల్లో అసంతృప్తి ఉందని యనమల ముక్తాయించారు.

రెడ్డి కులంలో పెద్ద కుటుంబాలన్నీ తమవైపే ఉన్నాయని సోమిరెడ్డి చెప్పినా.. ఆయా కుటుంబాల్లో ఎవరూ గెలవలేకపోయారనేది వాస్తవం. ఈ దశలో చంద్రబాబు జోక్యం చేసుకుని, కులాల అభివృద్ధిపై తీర్మానం పెట్టాలా వద్దా చెప్పాలని అడిగారు.

అయితే ఈ తతంగం అంతా బయట లైవ్ లోకి రాకుండా అంతర్గత మీటింగ్ లాగా సాగుతోందని భావించారు నేతలు. కానీ జూమ్ లో ఈ వ్యవహారం అంతా లైవ్ లోకి వచ్చేసింది. కులరచ్చ గురించి ఎవరో హెచ్చరించడంతో వర్ల రామయ్య జోక్యం చేసుకుని.. మన మాటలన్నీ లైవ్ లో వచ్చేస్తున్నాయని చంద్రబాబుకి చెప్పారు. అయితే చంద్రబాబు తనదైన స్టైల్ లో దాన్ని కవర్ చేశారు. కంగారేంలేదని, బయటకు పోనివ్వండని చెప్పి.. మెల్లగా మాటలు మార్చేశారు.

కొన్ని కొన్ని పార్టీలకు కొన్ని కులాల నుంచి ఫిక్స్ డ్ ఓటు బ్యాంకు ఉంటుందని అలా బీసీలు టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉన్నారని కవర్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు. మహానాడులో కులాల అభివృద్ధిపై తీర్మానం పెట్టాలా వద్దే అనే విషయాన్ని అక్కడితో ఆపేసి.. తెలుగుదేశం పార్టీ కులాలకు, మతాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు, సామాజిక న్యాయం కోసం పోరాడుతోందనే విషయాలను ప్రజలకు వివరించాలని చెప్పి అక్కడితో ఆ చర్చ ముగించారు

మొత్తమ్మీద కులాల వారీగా ప్రజల్ని చీల్చి, ఓట్లు దండుకునే వ్యవహారంలో టీడీపీ నేర్పరితనం మరోసారి జూమ్ సాక్షిగా ఇలా బయటపడింది. అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన మాటలు కాస్తా జూమ్ టెక్నాలజీ వల్ల బయటకు లీకయ్యాయి. అప్పుడే వైసీపీ ఈ వీడియోను వైరల్ చేయడం మొదలుపెట్టింది.