అవును మరి.. అంత సీనియారిటీ ఇన్నేళ్ళ ఇండస్ట్రీ అంటూ ప్రతీ రోజూ డబ్బా కబుర్లు చెప్పేవారు అంతా చేసేది ఆత్మ స్తుతి పరనింద మాత్రమే. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉండడం, జనాలకు మేలు చేసే పనికి మద్దతు ఇచ్చే హృదయ విశాలం లేని వారే ఇపుడు రాజకీయాలలో కనిపిస్తున్నారు.
అటువంటి చోట ఆ టీడీపీ తమ్ముడు అభివృద్ధికే నా మద్దతు అంటూ చెప్పడమే కాదు, తోటి నాయకులకు గడ్డి పెట్టేలా మాట్లాడిన తీరు నిజంగా పసుపు శిబిరంలో సంచలనమే.
విశాఖ నుంచి టీడీపీ తరఫున కార్పోరేటర్ గా ఎన్నికైన కాకి గోవిందరెడ్డి వైసీపీ సర్కార్ నగరంలో చేసే అభివృద్ధి పనులను పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు. విశాఖలోని ముడసర్లోవ జలాశయం వద్ద 80 ఎకరాల్లో అద్భుతమైన పార్క్ నిర్మాణానికి వైసీపీ సర్కార్ రెడీ అవుతోంది.
అంతే అక్కడ వైసీపీ నాయకులు భూ కబ్జా చేస్తున్నారంటూ తమ్ముళ్ళు గగ్గోలు మొదలెట్టేశారు. దీని మీద స్పందించిన టీడీపీ నేత కాకి గోవిందరెడ్డి ఇపుడు రాజకీయం చేయడం కాదు ప్రగతి కావాలంటూ గట్టిగానే మాట్లాడారు. విశాఖకు మంచి చేసే పని ఎవరు చేసినా మెచ్చాల్సిందే అంటూ కుండబద్ధలు కొట్టారు.
విశాఖ కీర్తిని పెంచే విధంగా సిటీలో గొప్పగా పార్కుని నిర్మిస్తామంటే అందులోనూ తప్పులు వెతకడం అసలు మంచిది కాదు అని హితవు పలికారు. మొత్తానికి జనాలకు పనికొచ్చే ప్రతిపక్ష నేత తానే అని ఆయన రుజువు చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అంతా కలసి పనిచేద్దామని గోవిందరెడ్డి పిలుపు ఇవ్వడం పసుపు పార్టీ నేతలకు పెద్ద బాల శిక్ష పాఠమేనా.