తెలుగులో స్ట్రయిట్ మూవీ చేసేందుకు దాదాపు మూడేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు కార్తి. కానీ ఇప్పటివరకు అది సాధ్యంకాలేదు. మరీ ముఖ్యంగా ఊపిరి సినిమా తర్వాత కాస్త గట్టిగా ప్రయత్నించినప్పటికీ ఫెయిల్ అయ్యాడు. ఇదే విషయాన్ని గ్రేట్ ఆంధ్ర ప్రస్తావించింది. ఈసారి మాత్రం స్ట్రయిట్ తెలుగు మూవీ చేసే ఛాన్సులు ఉన్నాయంటున్నాడు ఈ హీరో.
“మంచి స్టోరీ వస్తే డైరక్ట్ సినిమా చేస్తానని చెబుతూనే ఉన్నాను. ఇప్పటికీ అదేమాట మీద ఉన్నాను. ఇప్పటివరకు 5-6 కథలు విన్నాను. పెద్ద దర్శకులు మాత్రం ఎప్రోచ్ అవ్వలేదు. చంద్రశేఖర్ ఏలేటి రెండు కాన్సెప్టులు చెప్పారు. రెండూ నచ్చాయి. స్టోరీ కంప్లీట్ అయ్యాక కలుస్తానన్నారు. చర్చలు నడుస్తున్నాయి. చూడాలి ఏం అవుతుందో?”
మరోవైపు మల్టీస్టారర్ సినిమాలపై కూడా రియాక్ట్ అయ్యాడు కార్తి. ఊపిరి తర్వాత అంతలా ఎట్రాక్ట్ చేసిన మల్టీస్టారర్ కథ తనవద్దకు రాలేదంటున్నాడు. కొంతమంది కొత్త దర్శకులు, కొన్ని కథలు చెప్పినప్పటికీ అవి తనకు నచ్చలేదంటున్నాడు.
“మల్టీస్టారర్లు అంటే ఇష్టమే. మరో హీరోతో కలిసి నటించాలని ఎప్పుడూ ఉంటుంది. కానీ పెద్ద దర్శకులెవరూ నన్ను ఎప్రోచ్ అవ్వలేదు. కొత్త కొత్త దర్శకుల నుంచి అలాంటి కథలు వస్తున్నాయి. అందుకే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.”
ఏడాదికి 2 సినిమాలకు మించి చేయడం కుదరడం లేదని, ఆ రెండు సినిమాలు కోలీవుడ్ లోనే చేయడంతో తెలుగులో సినిమా చేయడం సాధ్యంకావడం లేదంటూ తనకు ఎదురవుతున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్ ను బయటపెట్టాడు కార్తి. కనీసం చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలోనైనా కార్తి స్ట్రయిట్ మూవీ వర్కవుట్ అవుతుందేమో చూడాలి.