మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని సోషల్ మీడియా ఓ ఆట ఆడుకుంటోంది. 2004లో తన తర్వాత ఉమ్మడి రాష్ట్ర సీఎంగా జగనే అయి వుంటే…ఈ పాటికి హైదరాబాద్ ఉండేది కాదని, తాను నిర్మించిన హైటెక్ సిటీ, ఐఎస్బీ వంటి వాటిని కూల్చేసేవారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్‌రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులను నిలిపివేసి ఉండేవారని… ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో నాడు ఫలానా ఘటన జరిగి ఉంటే లేదా జరిగి వుండకపోతే… అంటూ నెటిజన్లు చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. బాబుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. చంద్రబాబుకు ఎన్టీఆర్ కూతురితో వివాహం జరిగి వుండకపోతే అని మొదలు పెట్టిన నెటిజన్లు అనేక రకాల సెటైర్స్‌తో బాబును రాజకీయంగా ఉతికి ఆరేస్తున్నారు.
ఎన్టీఆర్ కుమార్తెతో బాబు వివాహం జరిగి వుండకపోతే… 1983లో చంద్రగిరిలో ఓటమితో బాబు రాజకీయ ముగిసి వుండేది కాదా? అల్లుడు కాకపోతే బాబును టీడీపీలో ఎన్టీఆర్ చేర్చుకునే వారా? అల్లుడు కాకపోతే 1995లో ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచేవారా? బావ కాకపోతే తండ్రికి వెన్నుపోటు పొడిచిన బాబుకు బామ్మర్దులు బాలకృష్ణ, హరికృష్ణ మద్దతు పలికేవారా? సడుగుడు కాకపోయి వుంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు సహకరించేవారా?
బాబు వెన్నుపోటు పొడవకపోయి వుంటే… ఎన్టీఆర్ అంత త్వరగా ప్రాణాలు కోల్పేయే వారా? ఒకవేళ ఎన్టీఆరే బతికి వుంటే…చంద్రబాబు గతి ఏమై ఉండేది? 2014లో టీడీపీ-బీజేపీ కూటమికి జనసేనాని పవన్‌కల్యాణ్ మద్దతు ఇవ్వకపోయి వుంటే? 2024లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే… ఇలా నెటిజన్లు తమ సృజనాత్మకతకు పదును పెట్టి, బాబుపై ట్రోలింగ్ చేస్తుండడం విశేషం.