Pakka Commercial Review: మూవీ రివ్యూ: పక్కా కమర్షియల్

టైటిల్: పక్కా కమర్షియల్ రేటింగ్: 2/5 తారాగణం: గోపీచంద్, రాశి ఖన్నా, సత్యరాజ్, వరలక్ష్మి, రావు రమేష్, అజయ్ ఘోష్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సియా గౌతం తదితరులు కెమెరా: కర్మ్ చావ్లా ఎడిటర్: ఉద్ధవ్…

టైటిల్: పక్కా కమర్షియల్
రేటింగ్: 2/5
తారాగణం: గోపీచంద్, రాశి ఖన్నా, సత్యరాజ్, వరలక్ష్మి, రావు రమేష్, అజయ్ ఘోష్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సియా గౌతం తదితరులు
కెమెరా: కర్మ్ చావ్లా
ఎడిటర్: ఉద్ధవ్
సంగీతం: జేక్స్ బిజోయ్
నిర్మాత: బన్నీ వాస్
దర్శకత్వం: మారుతి
విడుదల తేదీ: 1 జూలై 2022

మారుతి దర్శకత్వమనగానే ప్రేక్షకులకి ఒక అంచనా ఉంటుంది. సీరియస్ కథని కూడా సరదాగా చెప్పడం తన స్టైల్. పక్కా కమర్షియల్ అని టైటిల్ ఇన్నాళ్లకి పెట్టినా ఎప్పుడూ కమర్షియల్ చిత్రాలే తీస్తున్న దర్శకుడాయన. టైటిల్, టీజర్, ట్రైలర్ తో..పక్కా కమర్షియల్ అనిపించుకుని అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం తీరూ తెన్నూ ఎలా ఉన్నాయో చూద్దాం. 

నిజాయితీనే శ్వాసిస్తూ బతికే ఆర్ట్ ఫిల్మ్ లాంటి తండ్రి, నిజయితీని నోట్లతో వెలకట్టి అమ్మేసే కమెర్షియల్ కొడుకు. ఇద్దరిదీ నల్లకోటు వృత్తే. బాల్యంలో తండ్రి నిజాయితీ వలన నలిగిపోయిన కొడుకు బాల్యం, పెద్దయ్యాక తండ్రీకొడుకుల మధ్యన సంఘర్షణ..ఇదంతా ఒక ట్రాక్లో నడుస్తుంటుంది. 

ఎంత నెగిటివ్ యాంగిల్ చూపించినా ఎక్కడో అక్కడ హీరోగా మారే టర్నింగ్ పాయింట్ ఇలాంటి కథల్లో కామన్. అదెప్పుడొస్తుందా అని వేచి చూస్తూ అందాకా చూపించే మూసకొట్టుడు పాటలకి, రొమాన్స్ కి కళ్లప్పగించమనే సినిమా ఇది. 

ఇంతకీ మన హీరోయిన్ టీవీ సీరియల్ నటి. లాయర్ పాత్ర పోషించాలని లా చదివేసిందట. ఈ పాయింటుతో మారుతి మార్క్ కామెడీ అంటే చాలా ఊహించుకుంటాం. కానీ అదేంటో అస్సలు డైజెస్ట్ కాని కామెడీతో నడుస్తుంటుంది. 

“జాతిరత్నాలు” చూసి వాత పెట్టున్నట్టు ఈ మధ్య ప్రతి సినిమాలోనూ అలాంటి కోర్టు సీన్లు పెడుతున్నారు. ఆ మధ్య “డి జె టిల్లు” లో కూడా ప్రగతి జడ్జ్ గా అలాంటి సన్నివేశమొకటుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే కోవలో నడిచింది జయలలితని జడ్జిగా పెట్టుకుని. 

ఎప్పుడో “గబ్బర్ సింగ్” నాటి అంత్యాక్షరి టైపులో ఇందులో కోర్టు సన్నివేశంలో రౌడీలు సాయిబాబా పాటలు పాడే ఘట్టమొకటుంటుంది. 

నవ్వుకుందామని డబ్బిచ్చి హాల్లోకి వచ్చి రెండు గంటలు కూర్చునే బదులు హాయిగా పక్కనున్నవాడితో కితకితలు పెట్టించుకుంటే అప్పటికప్పుడే నవ్వేసుకుని వెళ్లిపోవచ్చనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. 

హీరోగా గోపీచంద్ ఫిట్నెస్ బాగానే ఉంది. ఉన్నంతలో కామెడీ జానర్ సినిమా అనుకున్నా ఎప్పటిలానే తన పాత్రని యాక్షన్ సీన్స్ డామినేట్ చేసేసాయి. దాని వల్ల రోటీన్ గానే కనిపించాడు.

రాశీఖన్నా పాత్ర గ్రాఫ్ గానీ, ఆమెకు రాసిన సంభాషణలు గానీ సరిగ్గా లేకపోవడం వల్ల ఆమెది ఓవరాక్షన్ అనిపిస్తుంది. తన పాత్ర మాత్రమే కాకుండా పక్కనున్న పాత్రల్లోకి కూడా చొచ్చుకుపోయి వాళ్ల డయలాగ్స్ కూడా చెప్పేసే కేరక్టరైజేషన్ పెట్టారామెకి. అదింకా చిరాకు తెప్పిస్తుంది. నిజానికి టీవీ సీరియల్ నటి అనే పాయింటుతో అద్భుతమైన కామెడీ పండించవచ్చు. మంచి ఆలోచనని అమలు చేయడంలో విఫలమయ్యారు. 

సత్యరాజ్ ది నిజానికి సీరియస్ పాత్ర. కానీ ఆ కేరక్టర్ మీద కూడా పాటల్లాంటివి పెట్టి పక్కా కమర్షియల్ చేసే పని పెట్టుకున్నారు. ఎంతైనా మాజీ న్యాయమూర్తి తన తీర్పు వల్ల ఒకమ్మాయికి అన్యాయం జరిగిందని రాజీనామా చేసేసి కిరాణాకొట్టు పెట్టుకోవడమనేది సెంటిమెంటే కన్నీళ్లు పెట్టుకునేటంత కామెడీగా ఉంది. 

విలన్ గా రావు రమేష్ ఓకే. అజయ్ ఘోష్ కూడా అతి చేసినా తన ఇమేజ్ రిత్యా అతికినట్టే ఉంది. ఇక సప్తగిరి, శ్రీనివాసరెడ్డి, చమ్మక్ చంద్రల పై పెట్టిన ట్రాకైతే తడిసిపోయిన దీపావళి టపాకాయిలా ఉంది. అస్సలు పేల లేదు. 

ఒకప్పుడు రవితేజ సరసన “నేనింతే” లో నటించిన సియా గౌతం ఇందులో ఒక కెరక్టర్ చేసింది. కథలో కీలక పాత్రే! 

సినీ దర్శకులు ఆదర్శవంతమైన ఆలోచనలు తమ సినిమాల ద్వారా వ్యక్తపరచడం సహజం. అదే విధంగా ఇందులో కూడా లాయరనేవాడు క్రిమినల్స్ పక్షాన వాదించనని కంకణం కట్టుకుంటే క్రైం చెయ్యాలంటేనే నేరస్తులు భయపడతారనే థాట్ బాగుంది. ప్రాక్టికల్ కాకపోయినా ఈ పాయింట్ మీద ఇంకొక సినిమా సీరియస్ గా తీసుకోవచ్చు. 

పాటలు మాత్రం వినడానికంటే చూడడానికి కొత్తగా ఉన్నాయి. “అందాల రాశి…”, “అదిరింది మాస్టారు..”, “లెహంగాలో లేడీ డాను”..తో పాటు “పక్కా కమర్షియలే” అని సాగే టైటిల్ సాంగ్ ఆకట్టుకునే విధంగా చిత్రీకరించారు. 

ఎడిటింగ్ అప్పుడప్పుడు జంప్ కొట్టినట్టుంది. ఒక సీన్ మైండ్ లో సింకయ్యే లోపే కట్ టు ఇంకో సీన్ అన్నట్టుంది. 

సంభాషణలు మాత్రం వీక్. ఎంత సింబాలిక్ గా చెప్పినా, వల్గారిటీ ఎగసిపడుతూనే ఉంటుంది కొన్ని డయలాగ్స్ లో. చాలా ఔట్ డేటెడ్ గా ఉన్న రైటింగ్ అనాలి. 

అసలీ కథని క్లైమాక్స్ సీనుతో మొదలుపెట్టి రివర్స్ లో రాసుకున్నట్టుంది. ఎందుకంటే ఆ ఒక్క పాయింట్ తప్ప మిగిలినందంతా జంక్. 

ఇదంతా మాకూ తెలుసులే అనట్టుగా కాబోలు- “ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చినా “పోసుకుంటూ” వాళ్లు మాట్లాడుకునేదేదో మాట్లాడుకుంటారు” అని ఇంటర్వెల్ డయలాగ్ కూడా పెట్టుకున్నారు హీరో మీద. 

ఆ విధంగా మేం తీసేది మేం తీసాం..ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుకోండి అని చెప్పినట్టుంది.

ఏ మాత్రం బేసిక్ ఐక్యూ అప్లై చేయకుండా చూసే వాళ్లకి కూడా కామెడీ అస్సలు వర్కౌట్ అవ్వలేదనే వాస్తవం అనుభవంలోకొస్తుంది. మరో రెండు వారాలదాకా పక్కా కమర్షియల్ సినిమాలు లేవు కనుక దీనికేదైనా ఊపిరాడొచ్చేమో తప్ప నిజానికిందులో పక్కా వినోదమైతే లేదు. 

బాటం లైన్: “పక్కా” మాత్రం కాదు