మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి దేశంలో అశాంతికి కారణమైన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌శర్మ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. నుపుర్‌శర్మది తప్పేమీ లేదని, టీవీ డిబేట్‌లో యాంకర్ అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పారని బీజేపీ మాజీ అధికార ప్రతినిధి తరపు లాయన్ వెనకేసుకు రావడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.
అయితే ఆ టీవీ యాంకర్‌పై కూడా కేసు పెట్టి, చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కోరడం గమనార్హం. మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆమెపై దేశంలో చాలా చోట్ల కేసులు నమోదు చేశారు. నుపుర్‌శర్మ అంతు తేలుస్తామని పలు సంస్థలు హెచ్చరిక జారీ చేశాయి. దీంతో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని, కేసులన్నీ ఢిల్లీకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్‌పై విచారణలో భాగంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దివాలాలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ నుపుర్‌శర్మపై మండిపడింది. టీవీలో చర్చను తాము నేరుగా చూసినట్టు ధర్మాసనం పేర్కొంది. ఆమెకు ముప్పు ఉందా లేక ఆమె దేశానికి ముప్పుగా తయారయ్యారా? అని నిలదీసింది. మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ వ్యాఖ్యలు సిగ్గుచేటని సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒక అజెండాను ప్రచారం చేయడం తప్ప.. టీవీ ఛానెల్, నుపుర్ శర్మల చర్చ వల్ల ఒరిగింది ఏమిటి? అని సూటిగా ఆమె తరపు న్యాయవాదిని ప్రశ్నించింది
తన వ్యాఖ్యలతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది భావోద్వేగాలను నుపుర్ రెచ్చగొట్టారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆమె వ్యాఖ్యల తర్వాత దేశ వ్యాప్తంగా దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. వాటి అన్నింటికీ ఆమే బాధ్యురాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తన వెనుక అధికారం వుంది కదా అని ఏమైనా మాట్లాడ్తారా? అని కోర్టు నిలదీసింది. నుపుర్‌శర్మ వ్యాఖ్యలు వ్యాఖ్యలు ఆమె అహంకారాన్ని తెలియజేస్తున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆమెది సరిదిద్దుకోలేని పొరపాటని బెంచ్ వ్యాఖ్యానించింది.
ఇలాంటి వ్యక్తులకు ఏ మతంపై గౌరవం ఉండదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అనుచిత వ్యాఖ్యలతో దేశ వ్యాప్తంగా మంటలు రేపినందుకు ఆమె టీవీ ముందుకొచ్చి క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే టీవీ యాజమాన్యం కూడా దేశానికి క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా నుపుర్‌శర్మ తరపు లాయర్ జోక్యం చేసుకుని… టీవీ యాంకర్ అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పారని , పిటిషనర్ తప్పేమీ లేదన్న ధోరణిలో వాదించారు.
ధర్మాసనం స్పందిస్తూ అయితే టీవీ యాంకర్‌పై కూడా కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని సూచించడం విశేషం. నుపుర్‌శర్మపై నమోదైన కేసులన్నింటిని ఢిల్లీకి బదిలీ చేయాలనే విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇదే సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం సూచన మేరకు పిటిషన్‌ను నుపుర్‌శర్మ వెనక్కి తీసుకున్నారు. ఈ కేసులో సంబంధిత హైకోర్టును ఆశ్రయిం చాలని నుపుర్ శర్మ తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది.