ఏపీ సర్కార్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలని నిర్ణయించి ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో నంబర్ 69పై ఇవాళ హైకోర్టు స్టే విధించింది. దీంతో ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించాలనే పద్ధతికి బ్రేక్ పడినట్టైంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు సినీ పరిశ్రమకు కొండంత ఊరటనిచ్చేదే.
సినీ పెద్దల కోరిక మేరకు ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో అసలు విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు పెట్టింది. ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే టికెట్లు విక్రయించాలనే నిర్ణయం తమకు తాముగా తీసుకోలేదని జగన్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున తదితర టాలీవుడ్ హీరోలు, పెద్దల సూచన మేరకే ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే టికెట్ల విక్రయానికి ముందుకొచ్చినట్టు నాటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత ఏడాది జీవో నంబర్ 69ను ప్రభుత్వం జారీ చేసింది.
సినిమా టికెట్లను ప్రభుత్వమే విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది తీసుకొచ్చిన సవరణ చట్టం, ఆ తర్వాత జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొంత మంది హైకోర్టును ఆశ్రయించారు. పలు దఫాలు హైకోర్టులో విచారణ జరిగింది. ఇవాళ కీలక తీర్పును హైకోర్టు వెలువరించింది.
ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లను విక్రయిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై హైకోర్టు స్టే విధించింది. జీవో నెంబర్ 69 పై తదనంతర చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. తుది వ్యాజ్యాల విచారణకు ఈ నెల 27కు వాయిదా వేసింది. ఆన్‌లైన్‌లో ప్రభుత్వమే సినిమా టికెట్ల విక్రయించాలనే నిర్ణయంపై స్టే విధించడంతో జగన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్టైంది.