మీడియా మూతకు ఇదే అదను

తెలుగునాట మీడియా వ్యవహారం మేడిపండే. పైకి నున్నగా నిగనిగలాడుతూ కనిపిస్తున్నా, షర్ట్  విప్పితే అన్నీ చిరుగులే అన్నట్లు వుంటుంది వ్యవహారం. తెలుగునాట మూడు నాలుగు డైలీలు మినహా మరే దినపత్రిక లాభాల్లో లేదు. పైగా…

తెలుగునాట మీడియా వ్యవహారం మేడిపండే. పైకి నున్నగా నిగనిగలాడుతూ కనిపిస్తున్నా, షర్ట్  విప్పితే అన్నీ చిరుగులే అన్నట్లు వుంటుంది వ్యవహారం. తెలుగునాట మూడు నాలుగు డైలీలు మినహా మరే దినపత్రిక లాభాల్లో లేదు. పైగా తీవ్ర నష్టాల్లో వున్నాయి. అలాగే మూడు నాలుగు చానెళ్లు మినహా మిగిలినవన్నీ లాభాలు గూబల్లోకి వచ్చేసి, ఏదో అలా బండి లాగిస్తున్నాయి. 

చంద్రబాబు వున్నన్నాళ్లు ఏదో విధంగా నెట్టుకువచ్చాయి. ప్రకటనలు వచ్చాయి కాబట్టి, కాస్తయినా ఊరట వుండేది. జగన్, కేసిఆర్ ఈ విషయంలో కాస్త పిసినారితనంగానే వున్నారు. ప్రకటనలు అనేవి ఆచి తూచి ఇస్తున్నారు. దీంతో నూటికి తొంభై మీడియా సంస్థలు పస్తులు వుంటున్నాయి. 

పైగా గతంలో మాదిరిగా ఏదో విధంగా ఆదాయం తెచ్చుకునే మార్గాలు కూడా క్రమేపీ మూసుకుపోతున్నాయి. ఈ మీడియాల సత్తా ఎంత అన్నది జనాలకు కూడా తెలిసిపోతోంది. పైగా కాంట్రాక్టులు, పనులు తగ్గిపోయాయి. ఆ దిశగా ఆదాయ వనరులు కూడా మూసుకుపోయాయి. 

గతంలో అంటే అయిదేళ్ల పాటు నెలకు కోటి వంతున నష్టం భరిస్తే, 60 కోట్ల నష్టం భరించేసరికి, ప్రభుత్వం నుంచి ఓ వంద కోట్ల విలువైన స్థలం ఏదో విధంగా అందుకునే అవకాశం వుండేది. ఇప్పుడు అదీ లేదు. అమరావతి స్థలాల మీద ఆశలు పోయినట్లే.

ఇలాంటి టైమ్ లో ఏదో విధంగా నెట్టుకువస్తున్నారు. మూసేయాలి అంటే ప్రెస్టీజ్ క్వశ్చను.  మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటూ వుంటే ఏదో విధంగా అవకాశం వుంటుంది లేదంటే అస్సలు పలుకుబడి అన్నది వుండదు. కానీ రాను రాను వెబ్ మీడియా, సోషల్ మీడియా పాపులారిటీ పెరిగిపోతోంది. చానెళ్లు కూడా తమ కంటెంట్ ను వెబ్ మీడియాలో అప్ లోడ్ చేసి, లేదా యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసి సంపాదించుకోవాల్సి వస్తొంది తప్ప, మెయిన్ స్ట్రీమ్ లో కాదు. 

ఇలాంటి టైమ్ లో కరోనా వచ్చింది. కాస్త మూసేద్దాం, లేదా కొన్నాళ్లు మూసేద్దాం అనేవాళ్లకు సువర్ణావకాశం. ఆంధ్రభూమి దినపత్రిక సంగతే చూద్దాం. చిరకాలంగా కష్టాల్లో వుంది. అనేక ఒడి దుడుకులు ఎదుర్కొంటోంది. ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన దినపత్రిక, తెలంగాణ గడ్డమీద పుట్టిన తెలుగు దినపత్రిక, కానీ కాంపిటీషన్ కాలంలో దాన్ని మిగిలిన వాటికి పోటీగా నిలబెట్టడంలో యాజమాన్యం విఫలమయింది. దాంతో నష్టాల బాటలో కూరుకుపోయింది. రకరకాల రుణ బాధులు చుట్టుముట్టాయి.

ఇపుడు అందరికన్నా ముందుగా వారం రోజుల పాటు పత్రిక మూసి వేత ప్రకటించింది ఆంధ్రభూమినే. ఇది వారంతో ఆగవచ్చు. ఆగకపోవచ్చు.  కరోనా ప్రభావ తీవ్రత మీదే ఇది ఆధారపడి వుంటుంది. పైగా ఆంధ్రభూమి నిర్ణయం అన్నది మిగిలిన చాలా వాటికి దారి చూపించే అవకాశం వుంది. అది ఎలా వుంటుందన్నది తెలియాల్సి వుంది. ఎందుకంటే చాలా దినపత్రికలు ఆంధ్రభూమి కన్నా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. అందువల్ల అవీ ఇదే బాట పట్టినా ఆశ్చర్యం లేదు.

బైట తిరిగితే సీరియస్ యాక్షన్