కరోనా ఎఫెక్ట్.. పోలీస్ పైనే ఎఫ్ఐఆర్

మహమ్మారిలా ఓవైపు కరోనా వ్యాపిస్తున్నప్పటికీ ఇప్పటికీ కొంతమందిలో ఎలాంటి మార్పు రావడం లేదు. విమానాశ్రయాల్లో పారాసిటమల్ వేసుకొని తప్పించుకోవడం, విదేశాల నుంచి ఇండియాకొచ్చిన తర్వాత వివరాలు ఇవ్వకుండా పరారవ్వడం, సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండకుండా…

మహమ్మారిలా ఓవైపు కరోనా వ్యాపిస్తున్నప్పటికీ ఇప్పటికీ కొంతమందిలో ఎలాంటి మార్పు రావడం లేదు. విమానాశ్రయాల్లో పారాసిటమల్ వేసుకొని తప్పించుకోవడం, విదేశాల నుంచి ఇండియాకొచ్చిన తర్వాత వివరాలు ఇవ్వకుండా పరారవ్వడం, సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండకుండా రోడ్లపై తిరగడం లాంటి పనులెన్నో చేస్తున్నారు. చివరికి ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీస్ కూడా మూర్ఖంగా వ్యవహరించాడు. ఇప్పుడు ఏకంగా పోలీస్ కేసు ఎదుర్కొంటున్నాడు.

ఓ పోలీస్ ఆఫీసర్ కొడుకు ఈమధ్యే 2 వారాల కిందట లండన్ నుంచి వచ్చాడు. కానీ ఆ విషయాన్ని పోలీస్ దాచిపెట్టాడు. కొడుకు వివరాల్ని ఇవ్వకుండా దాచాడు. కనీసం కొడుకును స్వీయ నిర్బంధంలో కూడా ఉంచలేదు. లండన్ నుంచి వచ్చిన పోలీస్ కొడుకు ఎంచక్కా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లాడు. ఫ్రెండ్స్ తో షికార్లు కొట్టాడు.

2 రోజుల నుంచి అతడి ఆరోగ్య పరిస్థితి కాస్త తేడాకొట్టింది. కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. లండన్ నుంచి వచ్చాడనే విషయాన్ని కనీసం అక్కడ కూడా చెప్పలేదు సదరు వ్యక్తి. కానీ వైద్యులకు మాత్రం అనుమానం వచ్చింది. వెంటనే హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు. పరీక్షించి చూస్తే కరోనా పాజిటివ్ అని తేలింది.

ఇప్పుడు బాధితుడితో పాటు అతడి కుటుంబ సభ్యులందర్నీ (పోలీసుతో కలిపి) ఐసొలేషన్ వార్డుల్లో ఉంచారు. పోలీసాఫీసర్ చేసిన మూర్ఖపు పని వల్ల ఇప్పుడీ వైరస్ ఎంతమందికి సోకిందో అర్థం కావడం లేదు. కుర్రాడు కలిసిన ఫ్రెండ్స్, వాళ్ల కుటుంబ సభ్యుల్ని, పోలీస్ ఇంట్లో పనిచేస్తున్న పనిమనుషులు, వాళ్ల కుటుంబ సభ్యులు.. ఇలా అందర్నీ హాస్పిటల్ కు తరలించాల్సి వచ్చింది. ఇక్కడితో అయిపోలేదు. లండన్ నుంచి వచ్చిన ఆ కుర్రాడు ఖమ్మంలోని ఓ గ్రామానికి సైతం వెళ్లాడు. ఇప్పుడు ఆ గ్రామానికి చెందిన ఓ 40 మందిని కూడా ఐసొలేషన్ వార్డులకు తరలించారు. ఇలా పోలీస్ సమాచారం దాచడం వల్ల చాలా పెద్ద తలనొప్పి తయారైంది.

ఈ విషయం మంత్రి ఈటల రాజేందర్ వరకు వెళ్లింది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీసే ఇలా వ్యవహరించడంతో మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు పోలీస్ పై కేసు నమోదుచేయాల్సిందిగా ఆదేశించారు. మంత్రి ఈటల ఆదేశంతో, పోలీస్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. కొత్తగూడెం పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 188 కింద నిన్న సాయంత్రం కేసు ఫైల్ అయింది. ఐసొలేషన్ వార్డు నుంచి సదరు పోలీస్ బయటకొచ్చిన వెంటనే జైళ్లో పెట్టడం గ్యారెంటీ.

బైట తిరిగితే సీరియస్ యాక్షన్