కరోనా తీవ్ర విజృంభణ సెకెండ్ వేవ్ లో దేశ వ్యాప్తంగా సాగినా, మూడు రాష్ట్రాలు మాత్రం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాయి. భారీ సంఖ్యలో కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ఇబ్బంది పడ్డాయి. ఇప్పటికీ అక్కడ భారీ స్థాయిల్లోనే కరోనా కేసులు నమోదవుతున్నా… ప్రస్తుతం సెకెండ్ వేవ్ ఆ రాష్ట్రాల్లో క్షీణిస్తూ ఉండటం ఊరటను ఇచ్చే అంశం.
మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ.. కరోనా సెకెండ్ వేవ్ లో అత్యంత భారీ స్థాయిలో కేసులు నమోదైన రాష్ట్రాలు. మహారాష్ట్ర సెకెండ్ వేవ్ ఫస్ట్ హాట్ స్పాట్ గా నిలిచింది. అక్కడ నుంచినే భారీ స్థాయిలో కేసులు పెరగడం మొదలైంది. ఒక దశలో మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య ఐదు లక్షల మార్కును దాటింది. ఆ తర్వాత గ్రోత్ రేట్ తగ్గుతూ వచ్చింది.
ప్రస్తుతం మహారాష్ట్రలో 2.91 లక్షల స్థాయిలో యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 20 వేల స్థాయిలో నమోదవుతున్నాయి. రికవరీల సంఖ్య 30 వేల స్థాయిలో ఉంది ప్రస్తుతం. ఇలానే కరోనా కేసుల సంఖ్య అక్కడ తగ్గితే.. మరో నెల రోజుల్లో అయినా మహారాష్ట్రకు పూర్తి స్థాయిలో రిలీఫ్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక మహారాష్ట్ర తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య ఐదు లక్షల మార్కును చేరిన రాష్ట్రం కర్ణాటక. అక్కడ కూడా కొన్నాళ్లుగా ఈ సంఖ్య అవరోహణన క్రమాన్ని అనుసరిస్తూ ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 3.72 లక్షలుగా ఉంది. రోజువారీ కేసుల సంఖ్య 22 వేల స్థాయిలో, రికవరీల సంఖ్య హెచ్చుగా ఉంది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య రోజుకు 30 వేల స్థాయి వరకూ ఉంది కర్ణాటకలో.
భారీ స్థాయిలో కేసులతో సతమతమైన మరో రాష్ట్రం ఢిల్లీలో ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య చాలా తగ్గింది. ఢిల్లీ పరిధిలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 15 వేల లోపుకు చేరింది. రోజు వారీ కేసుల సంఖ్య ఢిల్లీలో రెండు వేల లోపు నమోదవుతూ ఉండటంతో.. సెకెండ్ వేవ్ తీవ్రత ఢిల్లీలో బాగా తగ్గినట్టే అని స్పష్టం అవుతోంది.
ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ డిమాండ్ కూడా బాగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటిస్తున్నాయి. అది సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టడానికి సిగ్నల్ అని చెబుతున్నాయి. తమిళనాడు నుంచి మాత్రం ఆక్సిజన్ డిమాండ్ పెరిగిందని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా తమిళనాడు నిలుస్తోంది. అక్కడ 31 వేల స్థాయిలో కేసులు నమోదయ్యాయి గత ఇరవై గంటల్లో. రికవరీలు ఆ స్థాయిలోనే ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య మూడు లక్షలకు పైగా ఉండటం గమనార్హం.