నెల‌న్న‌ర క‌నిష్ట స్థాయికి క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 45 రోజుల క‌నిష్టానికి చేరింది. స‌రిగ్గా నెలన్న‌ర కింద‌ట ఆరోహ‌ణ క్ర‌మంలో పెరుగుతూ దేశ వ్యాప్తంగా రోజువారీ కేసులు ఏ స్థాయిలో న‌మోద‌య్యాయో, తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య…

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 45 రోజుల క‌నిష్టానికి చేరింది. స‌రిగ్గా నెలన్న‌ర కింద‌ట ఆరోహ‌ణ క్ర‌మంలో పెరుగుతూ దేశ వ్యాప్తంగా రోజువారీ కేసులు ఏ స్థాయిలో న‌మోద‌య్యాయో, తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన కేసుల నంబ‌ర్లు అదే స్థాయిలో ఉన్నాయి.

గ‌త ఇర‌వై నాలుగు గంట‌ల్లో పాజిటివ్ గా నిర్ధార‌ణ అయిన కేసుల సంఖ్య 1,73,790 గా కేంద్రం ప్ర‌క‌టించింది. ఏప్రిల్ 14వతేదీన దేశంలో దాదాపు ఇదే స్థాయిలో కేసులు న‌మోద‌య్యాయి. ఆ త‌ర్వాత కేసుల సంఖ్య పెరుగుతూ పోగా, ప్ర‌స్తుతం ఈ నంబ‌ర్లు దిగువ‌కు వ‌స్తూ నెల‌న్న‌ర క‌నిష్ట స్థాయికి చేరాయి. 

ఇక ఇదే స‌మ‌యంలో రిక‌వ‌రీల సంఖ్య కూడా భారీ స్థాయిలో న‌మోదైంది. 1,14,428 మంది గ‌త క‌రోనా నుంచి కోలుకున్న‌ట్టుగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా మ‌రింత త‌గ్గింది. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 22 ల‌క్ష‌ల స్థాయిలో ఉంది. ఒక ద‌శ‌లో ఈ నంబ‌ర్ 37 ల‌క్ష‌ల మార్కును చేరింది. అది ప‌తాక స్థాయి కాగా.. ప‌క్షం రోజుల్లోనే యాక్టివ్ కేసుల సంఖ్య సుమారు 30 శాతం త‌గ్గింది.

ఈ నెలాఖ‌రుకు క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని ఇది వ‌ర‌కూ నిపుణులు అంచ‌నా వేశారు. పూర్తిగా త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోయినా.. అవ‌రోహ‌ణ క్ర‌మం అయితే ప్రారంభం అయ్యి దాదాపు ప‌క్షం రోజులు అవుతూ ఉంది. ఇదే రీతిన కేసుల సంఖ్య త‌గ్గితే.. జూన్ నెలాఖ‌రుకు పూర్తిగా రోజువారీ కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

అయితే క‌రోనా కార‌ణ మ‌ర‌ణాల సంఖ్య మాత్రం ప్ర‌మాద‌క‌ర‌మైన స్థాయిలో కొన‌సాగుతూ ఉంది. ఒక ద‌శ‌లో రోజువారీగా ఈ సంఖ్య నాలుగు వేల‌కు పైగా న‌మోదు అయ్యింది. గ‌త పక్షం రోజులుగా యాక్టివ్ కేసుల సంఖ్య, రోజువారీ కేసుల సంఖ్య త‌గ్గుతూనే ఉన్నా.. మ‌ర‌ణాల శాతం హెచ్చుగానే ఉంది. గ‌త 24 గంట‌ల్లో కూడా 3,617 మ‌ర‌ణాలు న‌మోదు కావ‌డం విచార‌క‌ర‌మైన అంశం.