తెలంగాణలో అధికారంలోకి రావాలనే పెద్ద ప్లాన్ తో హైదరాబాదుకు చేరుకుంది వైఎస్ జగన్ సోదరి షర్మిల. రావడంతోనే బాగానే హడావిడి చేసింది. ఆమెకు అధికారంలోకి వచ్చే సీన్ లేకపోయినా టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు కొన్నిరోజులు బెంబేలెత్తిపోయారు. షర్మిల మీద దాదాపు ప్రతిరోజూ విమర్శలు చేశారు.
ఎప్పటి మాదిరిగానే తెలంగాణా సెంటిమెంటును ఉపయోగించారు. ఇది కేసీఆర్ రాజ్యమని, ఇక్కడ రాజన్న రాజ్యం తెస్తానంటే జనం ఊరుకోరని అన్నారు. ఆంధ్రావాళ్ల రాజకీయాలు ఇక్కడ సాగవన్నారు.
మళ్ళీ దోపిడీ చేయడానికి వచ్చారని రెచ్చిపోయారు. ఇప్పుడు షర్మిల వచ్చిందని, కొంతకాలం తరువాత జగన్ వస్తాడని, ఆ తరువాత చంద్రబాబు వస్తాడని అంటూ ఆంధ్రా దోపిడీ అనే భావనను తెలంగాణా ప్రజల్లో ఎక్కించారు. షర్మిల కూడా కేసీఆర్ మీద బాగానే విమర్శలు చేసింది. ఖమ్మలో సభ పెట్టింది.
అంతకు ముందు జిల్లాలవారీగా వైఎస్సార్ అభిమానులతో లోటస్ పాండ్ లో సమావేశాలు పెట్టింది. కాంగ్రెస్ లోని చిన్నా చితక అసంతృప్తివాదులు, కొందరు చోటా నాయకులు, రాజకీయంగా కనుమరుగైన నాయకులు అక్కా అక్కా అంటూ షర్మిల వెంట పడ్డారు.
ముందుగా షర్మిల సీఎం కేసీఆర్ మీద పోరాటానికి ఎంచుకున్న సబ్జెక్ట్ నిరుద్యోగ సమస్య. ఇది ఎప్పటినుంచో నలుగుతున్న సమస్యే. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ నిరుద్యోగ సమస్యే కీలకమైంది. తెలంగాణలో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వడంలేదని ప్రతిపక్షాలు వీరావేశంతో విమర్శలు చేసినా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగరేసింది.
నిరుద్యోగ సమస్య మీద షర్మిల నిరాహార దీక్ష చేయడం, అది రచ్చగా మారడం, ఆ సందర్భంగా నాటకీయ పరిణామాలు జరగడం తెలిసిందే. తన అనుచరులు జిల్లాల్లో దీక్షలు చేస్తారని షర్మిల ప్రకటించినా కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు. చివరకు షర్మిల ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.
ఇంట్లో కూర్చొని కేసీఆర్ మీద రకరకాల విమర్శలు చేస్తోంది. ఈ కథ ఇలా సాగుతుండగానే ఈటల రాజేందర్ ఎపిసోడ్ తెర మీదికి వచ్చింది. ఓ పక్క కరోనా ఉదృతంగా ఉన్నప్పటికీ ఈటల రాజేందర్ ఎపిసోడ్ పెద్ద చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలోని ప్రతిపక్షాల ఫోకస్ అంతా ఈటల మీదనే కేంద్రీకృతమైంది. మంత్రులు సైతం ఈటల వెంట పడ్డారు. అంటే ఆయన్ని అడ్డుకునే పనిలో పడ్డారన్న మాట. ఆయన నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకులెవ్వరు ఈటల వెంట పోకుండా కట్టడి చేయడంలో బిజీ అయ్యారు.
టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు కూడా ఈటల ధ్యాసలోనే ఉన్నారు. షర్మిలను ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. కొత్తల్లో హడావుడి చేసిన ఆమె అభిమానులు, అనుచరులు ఎవ్వరూ ఎలాంటి కామెంట్స్ చేయడంలేదు. వీరిలో కొందరు కరోనా బారిన పడ్డారేమో తెలియదు.
షర్మిల పంచన చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ ఒక్కతే షర్మిల చేసిన డిమాండ్లనే రిపీట్ చేస్తూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈటల ఎపిసోడ్ తో షర్మిల జోరు తగ్గిపోయింది. దానికి తగ్గట్లు కరోనా వ్యాప్తి తోడైంది. ఈటల అండ్ కరోనా కారణంగా షర్మిల వాయిస్ విబడటంలేదు.
ఉద్యోగాలు భర్తీ చేయాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రకటనలు విడుదల చేస్తూ ఉంటుంది. ఒక్క ఆంధ్రజ్యోతి మాత్రమే ఆమె ప్రకటనలకు విలువిస్తోంది. కరోనా వ్యాప్తి కాకపోయుంటే, ఈటల ఎపిసోడ్ లేకుండా ఉన్నట్లయితే షర్మిల రాజకీయం ఎలా ఉండేదో.