జగన్మోహన రెడ్డి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి తొలిసారిగా సారథ్యం వహించే అరుదైన అవకాశం వచ్చినప్పుడు, అనేక అవకతవకలకు పాల్పడి.. అక్రమాలకు తెరతీసిన చంద్రబాబునాయుడు కోటరీకి ఈ నిర్ణయం అంత సులువుగా మింగుడుపడేది కాకపోవచ్చు. జగన్మోహన రెడ్డి సర్కారు ను రెచ్చగొట్టేలా.. దమ్ముంటే సీబీఐ విచారణకు ఆదేశించండి అంటూ సవాళ్లు విసిరిన వారెవ్వరూ ఇప్పుడు నోరు మెదపడం లేదు. అమరావతి ప్రాంతంలో భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన లావాదేవీలపై సీబీఐ విచారణకు తాజాగా జగన్ సర్కారు ఆదేశించింది.
జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. గత ప్రభుత్వం చేసిన అరాచకాలపై నిగ్గుతేల్చడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన సంగతి తెలిసిందే. సదరు మంత్రివర్గ ఉప సంఘం.. కొన్ని నెలల కసరత్తు తర్వాత.. ముఖ్యమంత్రికి ఓ నివేదిక సమర్పించింది. వాటి ఆధారంగానే గత ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలు, ఇతర వ్యవహారాల మీద దర్యాప్తు చేసి నిగ్గు తేల్చడానికి జగన్ ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కేవలం అమరావతి భూ దందాల మీద విచారించడానికి సీబీఐకు అప్పగించారు.
తెలుగుదేశం హయాంలో అమరావతి ప్రాంతంలో అనేక భూదందాలు జరిగాయనే ఆరోపణలు జగన్ సర్కారు మొదలైన దగ్గర్నుంచి పదేపదే వినిపిస్తూ వచ్చాయి. ఆ అక్రమాల వల్లనే రాజధానిని మార్చదలచుకున్నట్లు కూడా వైకాపా నేతలు పలు సందర్భాల్లో అన్నారు. దీనికి కౌంటరుగా ప్రభుత్వం మీ చేతిలోనే ఉందికదా.. దమ్ముంటే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించండి అంటూ పలువురు తెదేపా నాయకులు సవాళ్లు విసిరారు. తెదేపానుంచి భాజపాలోకి పారిపోయిన సుజనాచౌదరి వంటివాళ్లు కూడా ఇలాంటి సవాళ్లు విసిరారు.
ఎట్టకేలకు విపక్షాల డిమాండ్ మేరకే జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. భూదందాల వ్యవహారాలను సీబీఐకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అమరావతి ప్రాంతంలో సేకరించిన భూముల్ని పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలన్న నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చిన రోజునే, ఈ భూ దందాలను సీబీఐకు అప్పగించడం విశేషం.