తద్దినానికి పెడితే కానీ లంఖనానికి రాదు అని సామెత. మొత్తం సినిమా ఇండస్ట్రీనే కొలాప్స్ అయ్యే ప్రమాదం కళ్ల ముందు కనిపించడంతో టాలీవుడ్ జనాలు ముందుకు కదిలారు. ఓటిటి అన్నది మొదటికే మోసం తెస్తోందని అర్థం అయింది. టికెట్ పెట్టి జనం సినిమా చూడాలి అంటే అందుకు తగ్గ కంటెంట్ ఇవ్వాలి.
ఏడాదికి అన్నీ భారీ సినిమాలు అందించలేరు. థియేటర్ల మనుగడ అంతా కేవలం పెద్ద సినిమాల మీదే ఆధారపడి వుండదు. వారానికి రెండు నుంచి మూడు, నాలుగు లక్షలు అద్దె థియేటర్ కు అందాల్సి వుంటుంది.
అంటే ఏడాదికి ఓక థియేటర్ కు కనీసంలో కనీసం కోటి రూపాయలు పైగానే. దానికి తోడు ఏడాదికి కోట్లలో పార్కింగ్, క్యాంటీన్ ఆదాయం. ఈ వ్యవస్థ అంతా నడవాలంటే సినిమాలకు జనాలు రావాలి. ఇళ్లు వదిలి థియేటర్ కు రావాలి.
అందుకే ఓటిటికి తాళం వేయాలని డిసైడ్ అయ్యారు. చిన్న, మీడియం సినిమాలు నెల పదిహేను రోజుల వరకు, పెద్ద సినిమాలు రెండు నెలల వరకు ఓటిటికి ఇవ్వడానికి వీలు లేదని తీర్మానం చేసారు. దీని అమలుకు ఎక్కడా తూట్లు పడకుండా చూడాలని సినిమా పెద్దలంతా డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఇప్పటికి నిర్మాణంలో, ప్లానింగ్ లో వున్న సినిమాలు వాటికి కనుక ఓటిటి అగ్రిమెంట్ లు జరిగి వుంటే వాటి కాపీలు కచ్చితంగా అందించాలని ఆదేశాలు జారీ చేసారు.
ఇకపై సినిమాల ప్లానింగ్ విషయంలోనూ, విడుదల ప్లానింగ్ విషయంలోనూ జాగ్రత్తగా వుండాలని నిర్మాతలు వారిలో వారు హెచ్చరించుకుంటున్నారు. కోవిడ్ తరువాత 2022 ప్రధమార్థంలో అన్ని సినిమాలు దులిపేసారు. ద్వితీయార్థానికి వచ్చేసరికి సినిమాలు లేవు. జూలై లో ఒకటి రెండు, ఆగస్టులో ఒకటి రెండు ఇలా, అది కూడా మిడ్ రేంజ్ సినిమాలే మిగిలాయి.
మహేష్ బాబు, ప్రభాస్, పవన్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా పెద్ద హీరోల ఎవ్వరి సినిమాలు 2023 వరకు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో జనాన్ని థియేటర్ కు ఎలా రప్పించడం? మిడ్ రేంజ్ సినిమాల ఖర్చు కిట్టుబాటు కావడం లేదు. అందుకే ఓటిటి ని ముందుగా కట్టడి చేసి, ఆ తరువాత మిడ్ రేంజ్ సినిమాల బడ్జెట్ మీద దృష్టి పెట్టాలని నిర్మాతలంతా గట్టి పట్టుదలగా వున్నారు.