అనకాపల్లి నియోజక వర్గానికి కీలకనేతలు ఆ ఇద్దరు. కొణతాల రామకృష్ణ.. దాడి వీరభద్రరావు. ఇద్దరూ మాజీ మంత్రులో తమకంటూ అనుచరగణం వున్నవారే. కానీ ఆ ఇద్దరు ఇప్పుడు జంక్షన్ లో నిల్చున్నారు. ఎటువెళ్తారన్నది ప్రశ్నార్థకం.
దాడి వీరభద్రరావును జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించారు. కానీ ఆయన ఊ.. ఆ అనలేదు. కొణతాల రామకృష్ణకు టీడీపీ నుంచి ఓపెన్ ఇన్విటేషన్ వుంది. కానీ ఆయన ఊ.. ఆ అనడం లేదు. చిత్రమేమిటంటే ఆ ఇద్దరూ తమ తమ ఒరిజినల్ పార్టీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని వినికిడి.
తెలుగుదేశంలోకి వెళ్లి టికెట్ తెచ్చుకోవాలని దాడి వీరభద్రరావు చాలా ప్రయత్నిస్తున్నారు. వైకాపాలోకి వెళ్లి టికెట్ తెచ్చుకోవాలని కొణతాల రామకృష్ణ ట్రయ్ చేస్తున్నారు. కానీ ఇద్దరికీ ఆయా పార్టీల్లో రెడ్ కార్పెట్ వెలకమ్ రావడంలేదు. దాడిని తెలుగుదేశంలోకి రమ్మంటున్నారు కానీ, టికెట్ ఆశించవద్దంటున్నారని టాక్.
కొణతాలను విజయసాయిరెడ్డి స్వాగతిస్తున్నారు కానీ, జగన్ అంత సుముఖంగా లేరని టాక్. ఇంకోపక్క దాడికి టికెట్ ఇవ్వడానికి వైకాపా కాస్త సుముఖంగా వుందని, కొణతాలకు ఎంపీ టికెట్ ఇవ్వడానికి దేశం సుముఖంగా వుందని వార్తలు వినిపిస్తున్నాయి.
వైకాపా దాడికి అయితేనే టికెట్ ఇస్తామని, కొడక్కు అయితే ఇవ్వమని అంటున్నారని తెలుస్తోంది. అంటే ఈ ఇద్దరికి తమకు కావాల్సింది అందేలా కనిపించడం లేదు. ఆశించనివి అందేలా కనిపిస్తున్నాయి. కానీ చిత్రంగా ఇద్దరికీ జనసేన మీద చూపులేకపోవడం ఏమిటో?