ముఖ్యమంత్రి జగన్ విశాఖకు మకాం మారిస్తే విశాఖ జనం వణికిపోతారు అని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారు. విశాఖ వాసులకు సీఎం మకాం షిఫ్టింగ్ ఫీవర్ పట్టుకుందని సెటైర్లు వేస్తున్నారు. జగన్ విశాఖలో ఉంటే ప్రజలకు ఎందుకు వణుకో చంద్రబాబే చెప్పాలని అంటున్నారు.
విశాఖలో పాతిక లక్షల మంది దాకా జనాభా ఉంది. విశాఖ మినీ ఇండియా. సీఎం తన క్యాంప్ ఆఫీసుని విశాఖలోనే ఏర్పాటు చేసుకుంటే పాలనాపరంగా అది ఇంకా సౌకర్యవంతంగా ఉంటుందని ఉత్తరాంధ్రా జిల్లావాసులు భావిస్తారు తప్ప వారెందుకు భయపడతారో చంద్రబాబే చెప్పాలని అంటున్నారు.
ఈ మధ్యకాలమంతా విశాఖ పర్యటనలు చేసిన చంద్రబాబు విశాఖను రాజధాని చేస్తాను అని మాత్రం అనలేకపోయారు. అంత దాకా కాదు కనీసం ఏడాదిలో ఒక అసెంబ్లీ సెషన్ అయినా విశాఖలో నిర్వహిస్తాను అని కూడా చెప్పలేకపోయారు. విభజన తరువాత రాజధానిగా విశాఖకే ఎక్కువ ఓట్లు పడ్డాయని కానీ బాబు మాత్రం అమరావతిని అనౌన్స్ చేసారని ఆయన పార్టీలోనే ఉంటూ వచ్చిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చాలా సార్లు చెప్పారు.
విశాఖకు రాజధాని రాకూడదు అన్నది టీడీపీ ఆలోచన అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇపుడు ఎటూ అది సుప్రీం కోర్టులో ఉంది. తీర్పు అన్నది ఎవరికీ ఎలా వస్తుందో తెలియదు. ఈ లోగా జగన్ విశాఖకు మకాం మారుస్తామంటే టీడీపీకి ఎందుకు వణుకు అని వైసీపీ నుంచి ప్రశ్న వస్తోంది.
జగన్ ఇడుపులపాయ వెళ్ళిపోవాలని చంద్రబాబు అంటున్నారు. ఇడుపులపాయ కూడా ఏపీలో భాగమే అన్నది ఆయన మరచిపోతున్నారని సెటైర్లు పడుతున్నాయి. ఏదో విధంగా విశాఖలో పాలన మొదలెట్టడానికి వైసీపీ చూస్తుంటే దాన్ని అడ్డుకునేందుకే టీడీపీ ఇలా మొదలెట్టింది అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. విశాఖ వాసుల తరఫున వకాల్తా పుచ్చుకుని అంతా తామే చెబుతున్న తమ్ముళ్ళు కానీ అధినాయకత్వం కానీ ఒక్క మాట చెబితే చాలు కదా అందరికీ స్పష్టత వస్తుందని అంటున్నారు.
విశాఖ రాజధానిగా మాకు ఇష్టం లేదు అని టీడీపీ చెబితే ఆ తరువాత ఏమి చేయాలన్నది ఉత్తరాంధ్రా వాసులు చూసుకుంటారని వైసీపీ నేతలు అంటున్నారు. అసలు విషయం చెప్పకుండా విశాఖ ప్రజల ముసుగులో ఎందుకు ఈ మాటలు అంటూ బాబు మీద విమర్శలు చేస్తున్నారు. అయినా విశాఖ రాజధాని అయితే టీడీపీకి వచ్చిన నష్టం కష్తమేంటో ఈ రోజుకీ టీడీపీ బాహాటంగా చెప్పలేకపోవడం రాజకీయ బలహీనతగానే చూస్తున్నారు అంతా.