నారా లోకేష్- తన తండ్రి చంద్రబాబు నాయుడు గురించి ఒక దారుణమైన సత్యం బయటపెట్టారు. నిజానికి ఇది నిజంగా, చంద్రబాబు నాయుడుతో అనుబంధం కోరుకునే వారికి హెచ్చరిక లాంటిది. చంద్రబాబు నాయుడును ముట్టుకుంటే హైవోల్టేజీ షాక్ కొడుతుందట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని లోకేష్ హెచ్చరిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల టూర్ పేరుతో రాష్ట్రమంతా తిరుగుతూ ఒక్కోచోట ఒక్కోరకంగా జనాన్ని రెచ్చగొట్టడానికి తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉండగా… పాదయాత్రలో కొత్తగా ఏం మాట్లాడాలో తెలియక సతమతం అవుతున్న ఈ చినబాబు తండ్రి ప్రాజెక్టుల టూర్‌ను ప్రమోట్ చేసే విధంగా కొన్ని డైలాగులు వదులుతున్నాడు. ముఖ్యమంత్రి జగన్ కు ప్రాజెక్టులు కట్టడం చేతకాదు అని అంటున్నారు.
‘ఆ సంగతి పక్కన పెడితే చంద్రబాబు నాయుడును ముట్టుకుంటే షాక్ కొడుతుంది’ అనే సీరియస్ డైలాగులు చినబాబు ఎవరిని దృష్టిలో పెట్టుకుని సంధించారో అర్థం కావడం లేదు. ఒకరకంగా నారా లోకేష్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో అనుబంధం పెట్టుకుని బాగుపడిన వారు చరిత్రలో లేరు.
రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులని పరిగణనలోకి తీసుకుంటే కేంద్రంలో దిగ్విజయమైన మెజారిటీతో అధికారం వెలగబడుతున్న భారతీయ జనతా పార్టీ 2014లో ఏపీలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా కూడా రెండు మంత్రి పదవులతో పనిచేసింది. సాధారణంగా పొత్తు పెట్టుకోవడం ద్వారా పార్టీ ఎంతో కొంత బలోపేతం కావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. కానీ ఏపీలో 2019 ఎన్నికల నాటికి పొత్తు లేకుండా పోటీ చేసే సమయానికి భారతీయ జనతా పార్టీకి అంతకు పూర్వం ఉన్న బలం కూడా దిగజారిపోయింది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నందుకు ఏ రేంజ్ లో హై వోల్టేజీ షాక్ కొట్టించగలరు వారికి అనుభవంలో తెలుసు.
ఒకసారి చంద్రబాబు కొట్టించగల హై వోల్టేజ్ షాక్ గురించి అనుభవం ఉన్నవారు గనుకనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెగ ప్రయత్నిస్తున్నప్పటికీ పొత్తుల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి బీజేపీ జంకు తోంది. ప్రస్తుతం అలాంటి అనుభవాన్ని రుచి చూడడానికి జనసేన పవన్ కళ్యాణ్ ఉత్సాహపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే లోకేష్ మాటలు పవన్‌కు హెచ్చరికలని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబును నమ్ముకుని పొత్తులు పెట్టుకుని ఆయన పల్లకి మోయడానికి పవన్ కళ్యాణ్ ఎగబడి పూనుకుంటే గనుక ఎన్నికలు పూర్తయి చంద్రబాబు అనుకున్న ఫలితం దక్కిందంటే, తర్వాత జనసేనను టిష్యూ పేపర్లా తుడుచుకొని పారేస్తాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
నారా లోకేష్ బహుశా తన తండ్రి గురించి గొప్పగా చెప్పాలని అనుకున్నాడో ఏమో గాని.. మొత్తానికి తనతో కలిసిన వాళ్లందర్నీ హైవోల్టేజీ షాక్ లతో మలమల మాడ్చేయగల చంద్రబాబు బుద్ధి, తత్వం గురించి బహిరంగంగా సంకేతాలు అందించారు.