కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నాయకుడు, సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డిని హైదరాబాద్‌లో ఆయన నివాసంలో హత్య కుట్రను కడప పోలీసులు రెండురోజుల క్రితం భగ్నం చేశారు. సుఫారీ తీసుకున్న ముగ్గురిని కడపలో చిన్నచౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పంచనామాలో సంచలన విషయాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో నిందితులు ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు రూ.50 లక్షలకు సుఫారీ కుదుర్చుకున్న ఓ ప్రముఖ నేత గురించి చెప్పడంతో, పోలీసులు ఆశ్చర్యపోయారు. రాష్ట్రంలోనే సంచలనం రేకెత్తించే ఆ ప్రముఖ నేత ఎవరో కాదు…మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్. నిందితులు వెల్లడించిన వివరాలను పోలీసులు పంచనామాలో స్పష్టంగా పేర్కొన్నారు.
ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం భగ్నం చేసిన కేసులో పట్టుబడిన ఈ ముగ్గురు నిందితుల్లో ప్రధానమైన వ్యక్తి కర్నూలు జిల్లా సంజామల మండల సోమల గ్రామ నివాసి సంధ్యపాకుల ఫక్కీర అలియాస్ సంజురెడ్డి అలియాస్ మున్నా అలియాస్ ప్రతాప్‌గా నేరాలకు పాల్పడుతుంటాడు.
కడప డీఎస్పీ సూర్యనారాయణ, చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి, ఎస్ఐలు రోషన్, సత్యనారాయణ కలిసి నిందితుల నుంచి వివరాలు సేకరించి తయారు చేసిన పంచనామా వివరాల ప్రకారం అఖిలప్రియ, ఆమె భర్త పాత్రల గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం.
ముగ్గురు నిందితుల నేపథ్యం ఇదే…
కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం, గోవిందంపల్లెకు చెందిన గంగదాసరి రవిచంద్రారెడ్డి ,ఆళ్లగడ్డ మండలం పెద్దచింతకుంట గ్రామానికి చెందిన కుందూరు రామిరెడ్డి ఆలియాస్ రాముడు రాజకీయంగా భూమా నాగిరెడ్డికి మొదటి నుంచి ముఖ్య అనుచరులు. భూమా దంపతుల మరణానంతరం వాళ్ల కుమార్తె అఖిలప్రియ వర్గంలో కొనసాగుతున్నారు. రవిచంద్రారెడ్డిపై పలు నేరాలకు సంబంధించి కేసులున్నాయి. ఇతనిపై శిరివెల్ల పీఎస్‌లో రౌడీషీట్‌తో పాటు మార్కాపురంలో ఓ హత్య కేసు కూడా నమోదైంది.
ఇక కందూరు రామిరెడ్డి అలియాస్ రాముడు విషయానికి వస్తే ఆళ్లగడ్డలో రౌడీ షీట్ ఉంది. ఇతడిపై గతంలో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన ఘటనలో ఆళ్లగడ్డ అర్బన్ పీఎస్‌లో కేసులు నమోదయ్యాయి. ఇతడిపై మొత్తం ఆరు కేసులున్నాయి. కిరాయి హంతకుడిగా ఒప్పందం కుదుర్చుకుని హత్యలకు పాల్పడుతుంటాడు.
కర్నూలు జిల్లా పేరుసోముల గ్రామానికి చెందిన సంధ్యపాకుల ఫక్కీర అలియాస్ సంజురెడ్డి ఆలియాస్ మున్నా అలియాస్ ప్రతాప్.. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా ఉండేవాడు. ప్రస్తుతం అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్లో నివాసం ఉంటున్నాడు. సూడో నక్సలైటుగా చెప్పుకొంటూ పలు నేరాలకు పాల్పడ్డాడు. బీహార్‌లో కంట్రిమేడ్ పిస్టోలు, తూటాలు కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. పలు నేరాలకు పాల్పడేందుకు పిస్తోలును ఉపయోగిస్తూండేవాడు. ఇతడిపై సంజామల, కొలిమిగుండ్లలో కేసులున్నాయి.
ఎలా దొరికారంటే…
హైదరాబాదు జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న సుబ్బారెడ్డిని సూడో నక్సలైట్ ఫక్కీర.. స్నేహితులతో కలిసి మొదట రూ.15లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నారని, హత్య అనంతరం మిగిలిన సొమ్ము తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారని పోలీసులు చెప్పారు. సుబ్బారెడ్డిని చంపేందుకు ఈ నెల 12న తెల్లవారుజామున 3గంటలకు ఫక్కీరు ఒంటరిగా వెళ్లాడని, అదే సమయంలో హైదరాబాదు నైట్ పెట్రోలింగ్ పోలీసులు తిరుగుతుండడంతో అక్కడ నుంచి భయపడి వెనక్కి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఒంటరిగా హత్య చేయలేనని భావించి గంగదాసరి రవిచంద్రారెడ్డి, కుందూరు రామిరెడ్డిని కడప అశోక్‌నగర్ పాతబైపాస్ వద్దకు పిలిపించుకున్నట్లు పోలీసులు తెలిపారు. 21వ తేదీ రాత్రి ముగ్గురూ కలిసి హైదరాబాదు బయలుదేరి సుబ్బారెడ్డిని హత్య చేయాలని పథకం రచించినట్లు తెలిపారు. ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి, ఎస్ఐలు రోషన్, సత్యనారాయణ సిబ్బందితో వెళ్లి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీలు చేసి కంట్రిమేడ్ పిస్టల్, ఒక మ్యాగ్జిన్, ఆరు తూటాలు, 3.20 లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు, ఫక్కీర్ తప్పుడు ఆధార్‌కార్డు, పాన్‌కార్డులను స్వాధీనం చేసుకుని.. వారిని రిమాండ్‌కు తరలించినట్లు కడప పోలీసులు తెలిపారు.
ఈ మొత్తం ఎపిసోడ్లో పంచనామా చాలా కీలకం. ఇందులో రాష్ట్రాన్ని షేక్ చేసే విషయాలున్నాయి. ఎలాగైనా ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయాలని, ఎంత డబ్బైనా ఇస్తామని స్వయంగా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ చెప్పినట్టు ముగ్గురు నిందితులు చెప్పడం గమనార్హం. ముఖ్యంగా ప్రధాన నిందితుడు సంధ్యపాకుల ఫక్కీర హత్యా ఒప్పందం గురించి కళ్లకు కట్టినట్టు వివరించాడు.
సంధ్యపాకుల ఫక్కీర పోలీసులకు చెప్పిన వివరాలు…ఆయన మాటల్లోనే…
2020వ సంవత్సరం జనవరిలో ఒకరోజు రవిచంద్రారెడ్డి నాకు ఫోన్ చేశాడు. నీతో పని ఉందని చెబుతూ ప్రొద్దుటూరుకు రావాలని కోరాడు. దీంతో నేను ఆ మరుసటి రోజు తాడిపత్రిలో బస్సు ఎక్కి ప్రొద్దుటూరు చేరుకున్నాను. ప్రొద్దుటూరులోని సినీ హబ్ థియేటర్ వద్దకు వెళ్లాను. నా దగ్గరికి రవిచంద్రారెడ్డి, రామిరెడ్డి అలియాస్ రాముడు కారులో వచ్చారు. వాళ్లిద్దరూ కారులో ఎక్కించుకుని కొర్రపాడు రోడ్డులోని ఒక కంకర మిషన్ వద్ద ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ రవిచంద్రారెడ్డి, రాముడులు నాతో ఈ విధంగా చెప్పారు.
మా ఇద్దరిని మాజీ మంత్రి భూమా అఖిలప్రియమ్మ, ఆమె భర్త భార్గవ్ కలిసి మా ఇద్దర్ని వాళ్లింటికి పిలిపించుకున్నారు. తన తల్లిదండ్రులు భూమా శోభమ్మ, భూమా నాగిరెడ్డిలతో ఏవీ సుబ్బారెడ్డి సన్నిహితంగా, నమ్మిన బంటుగా ఉంటూ ఆస్తులన్నీ బినామీగా రాయించుకున్నట్టు అఖిలప్రియ దంపతులు చెప్పినట్టు రవిచంద్రారెడ్డి, రాముడు నాకు చెప్పారు. అయితే భూమా నాగిరెడ్డి దంపతులిద్దరూ చనిపోయిన తర్వాత ఆ ఆస్తులన్నీ తనవేనంటూ ఆక్రమించుకుని తమను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పినట్టు నా స్నేహితులు (రవిచంద్రారెడ్డి, రాముడు) తెలిపారు.
అలాగే వైసీపీకి లోలోపుల సపోర్ట్ చేసి, భూమా అఖిలప్రియపై కేసులు పెట్టించి, ఎన్నికల్లో ఆమె ఓటమికి కారకుడయ్యాడని రవిచంద్రారెడ్డి, రాముడులతో చెప్పారు. దీంతో ఎంత డబ్బు ఖర్చు అయినా ఫర్వాలేదని, అతన్ని అంతమొందించాలని రవిచంద్రారెడ్డి, రాముడుతో ఆ దంపతులు చెప్పారు. అప్పుడు నా పేరును అఖిలప్రియ దంపతుల దృష్టికి తీసుకెళ్లినట్టు రవిచంద్రారెడ్డి, రాముడు నాకు చెప్పారు. భూమా అఖిలప్రియమ్మకు మాట ఇచ్చామని, గతంలో మా గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో నేను కీలకపాత్ర పోషించిన విషయాన్ని మాజీ మంత్రికి చెప్పినట్టు వాళ్లిద్దరూ నాతో చెప్పారు. దీంతో ఎలాగైనా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయాలని నన్ను అడిగారు.
అయితే ఏవీ సుబ్బరెడ్డిని చంపేందుకు కిరాయిగా రూ.కోటి అడిగాను. చివరికి రూ.50 లక్షలకు ఒప్పందం కుదిరింది. ముందుగా రూ.15 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు. అడ్వాన్స్‌గా రూ.లక్ష ఇచ్చారు. తర్వాత వారం రోజులకు హైదరాబాద్‌కు పోయి రవిచంద్రారెడ్డికి ఫోన్ చేసి డబ్బులు కావాలని అడిగాను. దీంతో రవిచంద్రారెడ్డి, రాముడు కలిసి అఖిలప్రియమ్మ భర్త భార్గవ్ సార్‌కు ఫోన్ చేసి డబ్బు కావాలని అడిగారు. దీంతో అఖిలప్రియమ్మ భర్త భార్గవ్ సార్ తన పర్సనల్ అసిస్టెంట్ మాద శ్రీనివాసులు అలియాస్ గుంటూరు శ్రీనుతో రూ.4లక్షలు పంపాడు.
ఆ డబ్బును హైదరాబాద్ సిటీలోని ఫిల్మ్ ఏరియాలో ఉన్న మా దగ్గరికి వచ్చి రూ.4 లక్షలు ఇచ్చాడు. (మరో సందర్భంలో రూ.10 లక్షలు ఇచ్చారు) ఆ తర్వాత అతని సెల్‌ఫోన్ ద్వారా అఖిలప్రియమ్మ, ఆమె భర్త భార్గవ్ సార్‌తో వాట్సప్‌లో నాతో మాట్లాడించాడు. ఏవీ సుబ్బారెడ్డిని చంపి పనిపూర్తి చేసిన తర్వాత ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామని వాట్సప్ కాల్లో అఖిలప్రియమ్మ, ఆమె భర్త నాతో చెప్పారు. అలాగే పని పూర్తి అయిన వెంటనే నన్ను ముంబయ్‌కి పంపుతామని, ఎలాంటి కేసులు లేకుండా చూసుకుంటామని, భవిష్యత్‌ను మేము చూసుకుంటామని, ధైర్యంగా ఉండాలని వాళ్లిద్దరూ (అఖిలప్రియ దంపతులు) భరోసా ఇచ్చారు.
ఇవే విషయాలను మిగిలిన ఇద్దరు నిందితులు చెప్పిన వివరాల్లో కూడా పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసు మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌కు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో వాళ్లద్దరినీ అరెస్ట్ చేసే అవకాశాలున్నట్టు సమాచారం.