ఎంత సూపర్ స్టార్ అయినా నిర్మాతలు సరిగ్గా పట్టుకుంటే తలొగ్గాల్సిందే. మహేష్ బాబు సినిమా వ్యవహారం ఇలాగే తయారయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పరుశురామ్ తో సినిమా చేయాలని మహేష్ బాబు అనుకున్నారు. ఆ సినిమాను మైత్రీ మూవీస్ కు ఇవ్వాలని మహేష్ వ్యవహారాలు చక్కదిద్దే నమ్రత అనుకున్నట్లు వార్తలు ఆ మధ్య వినవచ్చాయి. కానీ అక్కడే సమస్య వచ్చింది.
అప్పటికే పరుశురామ్ ఓ సినిమాను 14రీల్స్ కు కమిట్ అయి, అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేసారు. తమ అడ్వాన్స్ మేరకు తమకు సినిమా చేయాల్సిందే అని మైత్రీ మూవీస్, తమను వదిలి ఎలా వెళ్తారని 14రీల్స్ పట్టుకుని కూర్చున్నాయి.
ఈ విషయంలో 14రీల్స్ తెలివిగా, పైకి ఏమీ మాట్లాడకుండా, డైరక్టర్ ను నొక్కిపెట్టి కూర్చుంది. మైత్రీ మూవీస్ ఎంత ప్రయత్నించినా వ్యవహారం ముందుకు సాగడం లేదు. టైమ్ గడచిపోతోంది. ఈలోగా ఈ కరోనా గొడవ వచ్చి పడింది.
ఇప్పుడు ఏదో ఒకటి తేల్చుకుంటే తప్ప, ముందుగా అనుకున్నట్లు మే లేదా జూన్ నుంచి మహేష్ కొత్త సినిమాను ప్రారంభించడం సాధ్యం కాదు. అందుకే ఇంక ఈ పంచాయతీ తెగేలా లేదని, 14రీల్స్ కు, మైత్రీకి కలిపి సినిమా చేయాలని మహేష్ డిసైడ్ అయినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఇదే నిజమైతే మొత్తం మీద 14రీల్స్ సంస్థ తన పంతం నెగ్గించుకున్నట్లే, ఈ విషయంలో మైత్రీ వైపు నిల్చున్న నమ్రత మాట చెల్లనట్లే అన్న కామెంట్ లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
కానీ ఒకటెే అనుమానం. ఇప్పుడు తన కొడుకు సినిమాను ఆపేస్తే, హీరో నాగార్జున 14 రీల్స్ పట్ల ఎలా ఫీల్ అవుతారన్నదే?