ఇటీవలి తమ వెబ్ సీరిస్ కు బ్రహ్మాండమైన ప్రచారాన్ని కల్పించింది అమెజాన్. హంటర్స్ పేరుతో రూపొందించిన ఆ వెబ్ సీరిస్ ప్రచారానికి భారీగా ఖర్చు కూడా పెట్టుకున్నట్టుగా ఉంది. ఒక హాలీవుడ్ సినిమాకు మించిన స్థాయిలో ప్రచారం కల్పించింది. అందుకు తగ్గట్టుగా ట్రైలర్ దగ్గర నుంచినే ఆసక్తిని రేపింది హంటర్స్. ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు అల్ పాచినో ఈ వెబ్ సీరిస్ లో ప్రధాన పాత్ర పోషించాడు. లేటు వయసులో ఆ నటుడు ఇలా డిజిటల్ స్ట్రీమింగ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. పాచినో ఈ వెబ్ సీరిస్ పై అంచనాలను పై పైకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఈ సీరిస్ కాన్సెప్ట్ కూడా సర్వత్రా ఆసక్తిని రేపింది.
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన మూడు దశాబ్దాల తర్వాత అమెరికాలో.. నాజీలను యూధులు వేటాడానికి సంబంధించిన కాన్సెప్ట్ తో ఈ వెబ్ సీరిస్ ను రూపొందిచినట్టుగా ట్రైలర్ లోనే క్లారిటీ ఇచ్చారు. అదే ఈ వెబ్ సీరిస్ మీద అంచనాలను పతాక స్థాయికి తీసుకెళ్లింది.
రెండో ప్రపంచ యుద్ధం మీద ఇప్పటి వరకూ బోలెడన్ని సినిమాలు వచ్చాయి. వాటి సంఖ్య చాలానే ఉంటుంది. అదే సమయంలో రెండో ప్రపంచయుద్ధ కాలం నాటి కాన్సెప్ట్ లో వచ్చిన సినిమాల్లో కొన్ని క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. హాలీవుడ్ సినిమాల్లో రియలిస్టిక్ డ్రామాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి నేపథ్యంలో.. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి కథ, కథనాలతో, నాటి పరిణామాలతో రూపొందించిన సినిమాలు సహజంగానే ప్రేక్షకుల ఆసక్తిని సంతరించుకున్నాయి. వాటి నిర్మాణ విలువలు కూడా అదే స్థాయిలో ఉండటంతో.. చాలా వరకూ ఆ సినిమాలు క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. అలాంటి సినిమాలు అన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు వెబ్ సీరిస్ లు మరో ఎత్తు. వెబ్ సీరిస్ లలో ఏ అంశాన్ని అయినా, ఏ కథను అయినా చాలా డీటెయిల్డ్ గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో.. రెండో ప్రపంచ యుద్ధానంతర పరిణామాల మీద రూపొందింది హంటర్స్. దీంతో దీనిపై మరింత ఆసక్తి వ్యక్తం అయ్యింది. ఆ ఆసక్తికి, అంచనాలకు దాదాపుగా న్యాయం చేసేదిలా ఉంది హంటర్స్.
ఈ వెబ్ సీరిస్ చరిత్రలో జరిగిన కథగా చూపించారు రూపకర్తలు. 1970ల ఆరంభంలో అమెరికాలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల ఆధారంగా ఈ కథను తయారు చేసినట్టుగా వారు చెప్పారు. ఇంతకీ ఆ కథ ఏమిటంటే…రెండో ప్రపంచ యుద్దం ముగిశాకా యూరప్ నుంచి అనేక మంది యుద్ధ నిర్వాసితులు, బాధితులుగా అమెరికా చేరతారు. ఇటలీ, పోలాండ్, జర్మనీ తదితర దేశాల నుంచి అనేక మంది యూధులు ఆమెరికాను ఆశ్రయం కోరతారు. వారిలో యుద్ధం జరుగుతూ ఉండగానే..ఏదో ఒక మార్గం ద్వారా అమెరికాకు చేరుకున్న వాళ్లు ఉంటారు. మరి కొందరు నాజీల దాడుల్లో సర్వం కోల్పోయిన యూధులు. రెండ ప్రపంచ యుద్ధ విజేత కూటమిలో ఒకటైన అమెరికా అలాంటి వాళ్లకు ఆశ్రయం ఇస్తుంది. వాళ్లంతా అమెరికాలో భాగం అయిపోతారు. అయితే ఆ యూధులు తమ గతాన్ని మరిచిపోరు. తమ సంప్రదాయాలను, తమ సంస్కృతిని కొనసాగిస్తూ ఉంటారు. వారిలోనే కొందరు.. నాజీలపై ప్రతీకార వాంఛతో ఉంటారు. యూరప్ లోని పలు దేశాలను ఆక్రమించిన సమయంలో హిట్లర్ యూధులపై అపరిమితమైన ద్వేషాన్ని రాజేసి ఉంటాడు. యూధులను పిట్టలను కాల్చి చంపినట్టుగా చంపి ఉంటారు నాజీలు. యూధులను క్యాంపులకు తరలించి.. వారి చేత వెట్టి చాకిరి చేయించి, పని చేయలేని వాళ్లను గ్యాస్ చాంబర్లలో పెట్టి మసి చేయడం, వాళ్ల ప్రాణాలకు వీసవెత్తు విలువను ఇవ్వని రీతిలో వ్యవహరించడం నాజీల మార్కు హింసాకాండ. ఈ హింసాకాండను ఇది వరకూ అనేక సినిమాల్లో చూపారు. ఈ వెబ్ సీరిస్ లో కూడా నాజీల డెత్ క్యాంపుల్లోని పరిస్థితులను కళ్లకు కట్టారు.
అలా ఒక డెత్ క్యాంపు నుంచి యుద్ధానంతరం బయటపడిన కొంతమంది అమెరికాకు చేరి ఉంటారు. తమను క్యాంపుల్లో చిత్రహింసలు పెట్టిన నాజీ ఉన్నతాధికారులను వారు మరిచిపోరు. వారి మీద ప్రతీకారంతో రగిలిపోతూ ఉంటారు, కొన్నేళ్లకు వాళ్లకు తెలిసేది ఏమిటంటే.. తాము అమెరికాకు వచ్చినట్టుగానే నాజీలు కూడా చాలా మంది యూఎస్ చేరారని, యుద్ధబాధితులుగా పేర్లు మార్చుకుని వారు తమ చుట్టుపక్కలే సెటిల్ అయ్యారని ఆ నాజీ బాధితులు అర్థం చేసుకుంటారు. వారి వివరాలను సంపాదిస్తారు. క్యాంపుల్లో వారు తమను ఎలా అయితే చిత్రహింసలు పెట్టారో,
అదే పద్ధతిలో వారిని చంపడం మొదలుపెడతారు. అలా రెండో ప్రపంచ యుద్ధం పూర్తిన దాదాపు మూడు దశాబ్దాలకు అమెరికాలో జరిగిన ఈ కోల్డ్ వారే హంటర్స్!
ఈ కాన్సెప్ట్ కు తగ్గట్టుగా రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో హాలీవుడ్ సినిమాకు ధీటైన స్థాయిలో ఈ వెబ్ సీరిస్ రూపకల్పన జరిగింది. దాదాపు 10 గంటలకు పైగా వ్యవధితో ఉండే ఈ వెబ్ సీరిస్ అణువణువునా సినిమా స్థాయిలో ఉంటుంది. ఎక్కడా ఏదో తక్కువ బడ్జెట్ లో చుట్టినట్టుగా కనపడదు. నటీనటుల విషయంలో అయినా, రూపకల్పన విషయంలో అయినా అంతా హై లెవల్ ప్రొడక్షనే.
ఇక టైటిల్ కు తగ్గట్టుగా స్క్రిప్ట్ వర్క్ కూడా బ్రహ్మాండం. ఎక్కడా వృథా సన్నివేశాలు, వ్యర్థమైన మాటలు లేకుండా.. ప్రతి సీన్ లోనూ ఒకే రకమైన ఉత్కంఠ కొనసాగుతుంది. రెండు గంటల సినిమాలో ఉత్కంఠను మెయింటెయిన్ చేయడం వేరు, 10 గంటల సేపు ప్రేక్షకుడిని కట్టిపడేయడం వేరు. అది కూడా ఇది మొబైల్ లో చూస్తారు. ఏ మాత్రం బోర్ కొట్టినా.. ఫోన్ పక్కన పడేస్తారు. కాబట్టి.. ఈ తరహా థ్రిల్లింగ్ వెబ్ సీరిస్ అంటే మాటలు కాదు. ఔత్సాహిక మూవీ మేకర్లు హంటర్స్ చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది.
ఇక ఈ వెబ్ సీరిస్ ఆసాంతం చూసిన తర్వాత కలిగే మొదటి ఆశ్చర్యం.. నిజంగానే ఇదంతా జరిగిందా? అనేది! ఆ స్థాయిలో హంటర్స్ ప్రేక్షకుడిని వెంటాడుతుంది. మధ్య మధ్యలో ట్విస్టులు బోలెడన్ని ఆశ్చర్యాలను మిగులుస్తాయి. అలాంటి వాటిల్లో కొన్ని ఆశ్చర్యకరమైన ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ కూటమి ఓటమి తర్వాత, హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత.. నాజీల్లోని మేధావులను, సైంటిస్ట్ లను, నిపుణులను అమెరికా తీసుకెళ్లిపోయిందనే విషయాన్ని ఇందులో ధైర్యంగా ప్రస్తావించారు. వారు ఎన్నో వార్ క్రైమ్స్ చేశారు. అయితే అమెరికా వారిని శిక్షించలేదు. వారిని ఉపయోగించుకోవాలనుకుంది. వారికి పేర్లను మార్చి అమెరికాకు తీసుకెళ్లి.. కీలకమైన విభాగాల్లో వారికి ఉద్యోగాలను ఇచ్చింది. నాసాలో కూడా కొంతమంది హిట్లర్ మాజీ అనుచరులకు అవకాశం ఇచ్చిందట అమెరికా! యూరప్ లో మిలియన్ల కొద్దీ యూధులను చంపిన నాజీలను అమెరికా శిక్షించలేదని, వార్ క్రైమ్స్ కు పాల్పడిన వారికి శిక్ష విధించకుండా.. వారు తెలివైన వారంటూ, వారిని ఉపయోగించుకుందనే అంశాన్ని ఈ వెబ్ సీరిస్ లో ప్రస్తావించారు. అయితే అమెరికా అలాంటి పనికి పాల్పడిందనేందుకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణలూ లేవని మరి కొందరు అంటున్నారు. అలాగే అమెరికా వేదికగా నాజీలను యూధులు వేటాడటం, అమెరికాలో ఫోర్త్ రైట్చ్ ను ఏర్పరచడానికి నాజీలు ప్రయత్నించారని అనడం కూడా ఆధారాలు లేని అంశాలే అని మరి కొందరు అంటున్నారు.
హంటర్స్ రూపకర్తలు మాత్రం..వాస్తవ సంఘటనల ఆధారంగా తాము ఈ వెబ్ సీరిస్ ను రూపొందించినట్టుగా చెబుతున్నారు. అది కూడా ఈ వెబ్ సీరిస్ సాగేదే 50 యేళ్ల కిందటి నాటి పరిణామాల ఆధారంగా కాబట్టి.. దేన్ని నిర్ధారించడానికీ సరైన ఆధారాలు లేనట్టే. సినిమాటిక్ లిబర్టీతో ఈ కథ, కథనాలను రూపొందించి ఉంచారనేది స్పష్టం అవుతుంది. నాజీల కర్కశాన్ని, యూధుల దయనీయమైన పరిస్థితులను, వారు ప్రతీకారంతో రగిలిపోయిన వైనాన్ని మాత్రం అద్భుతంగా చూపించారు. అలాంటి బాధిత యూధుగా అల్ పాచినో అద్భుతమైన నటనను చూపించాడు. అతడి పాత్రకు రాసిన డైలాగ్స్ కూడా ప్రత్యేకం. అతడి పాత్రకు క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ కూడా ఒక డిఫరెంట్ ఫీల్ తో కథ ముగిసేలా చేస్తుంది. అయితే క్లైమాక్స్ కొంత అబ్సర్డ్ గా కూడా ఉంటుంది. దీంతో కొన్ని సందేహాలు అలాగే మిగిలిపోతాయి. బహుశా ఇది సీజన్ వన్ అని చెప్పారు, సీజన్ 2 లో మిగిలిన హంట్ కొనసాగిస్తారేమో!
-జీవన్ రెడ్డి.బి