అమ్మ మాటకు మించిన ఆరోగ్య మంత్రం లేదని బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు సోనూసూద్ చెబుతున్నాడు. కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న క్రమంలో చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి సెలబ్రిటీలు ఒకొక్కరు ఒక్కో రకమైన అనుభవాన్ని, అనుభూతుల్ని పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా నటుడు సోనూసూద్ కూడా ఆసక్తికరమైన, విలువైన అంశాలను చెబుతూ ఓ వీడియో విడుదల చేశాడు. ఈ సందర్భంగా ఆయన అమ్మలను గుర్తు చేసుకోవడం ప్రశంసలు కురిపిస్తోంది.
ఆరోగ్యంగా ఉండేందుకు మన జీవన శైలిని ఏ విధంగా మలుచుకోవాలో బాల్యం నుంచే మన అమ్మలు ముందుగానే చెబుతూ వస్తున్నారన్నాడు. కానీ అమ్మల మాటలను పెడచెవిన పెట్టడం వల్లే ఈ రోజు ఇలాంటి దుస్థితిలో గడపాల్సి వస్తోందని ఆయన వాపోయాడు. కరోనాకు భయపడాల్సిన పనిలేదని ఆయన ధైర్య వచనాలు చెప్పాడు.
“కరోనా విజృంభన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన జాగ్రత్తల గురించి వింటుంటే , చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన సంగతులు గుర్తుకొస్తున్నాయి. సబ్బుతో చేతుల్ని బాగా శుభ్రం చేసుకోవాలని అమ్మ చెప్పేది. అలాగే ఎప్పుడూ బయట బయటే ఎందుకు తిరుగుతావ్…ఇంట్లో ఉండాలని సూచించేది. అంతేకాదు సంప్రదాయాల గురించి కూడా అమ్మ చేసిన సూచనలు నాకిప్పటికీ బాగా గుర్తు. హాయ్, హలో ఏంటి?…సలామ్, నమస్తే అని చెప్పడం మరిచిపోయారా” అని మందలించేది అని చిన్నప్పుడు అమ్మ నేర్పిన సంస్కారాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
ఇంతటితో ఆయన ఆగలేదు. ఇంకా చాలా చాలా విషయాల్నే ఆయన తన వీడియోలో చెప్పుకొచ్చాడు.
తుమ్ములు, దగ్గుల నుంచి రక్షణ పొందేందుకు దగ్గర కర్చీప్ పెట్టుకోవాలని అమ్మ సూచించేదన్నాడు. అమ్మ మాట ఎవరు విన్నారు? కానీ ఈ రోజు ప్రపంచం ఓ విపత్కర పరిస్థితి ఎదుర్కొంటోందని ఆయన వాపోయాడు. కరోనాతో పోరాడుతున్న క్రమంలో…నాడు అమ్మ చెప్పిన విషయాలు ఎంత పెద్దవో, ఎంత విలువైనవో తనకిప్పుడిప్పుడే అర్థమవుతున్నాయన్నాడు. నిజానికి నటుడు సోనూసూద్‌కు వాళ్లమ్మ చెప్పినట్టే…మనందరికీ అమ్మలు ఇవే జాగ్రత్తలు, సూచనలు బాల్యంలో చేశారు. కానీ మనమెవరూ పట్టించుకున్న పాపాన పోలేదు.
కరోనా రూపంలో ప్రాణం మీదకి వస్తోందనే భయం…ఇప్పుడు అందరికీ అమ్మలు, నాన్నలు, పెద్దవాళ్లు చెప్పిన జాగ్రత్తలు గుర్తు వస్తున్నాయి. ఇప్పటికైనా మించి పోయిందేమీ లేదు. హాయిగా మళ్లీ మనం పాతరోజుల్లోకి పోతే తప్ప…ప్రాణాలతో బతికి బట్టకట్టలేం.