వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తమ పెద్దలను ఒప్పించుకున్నారు. ఇక పెళ్లే తరువాయి. 2018లో పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ ప్రేమికులకు ప్రకృతి ఏదో ఒక రూపంలో అడ్డు తగులుతూ వస్తోంది. ముచ్చటగా మూడోసారి వారి పెళ్లి వాయిదా పడింది. ఇంతకూ ఎవరా ప్రేమికులు, ఏమా కథా అని తెలుసుకోవాలనుకుంటున్నారా…అయితే ఈ కథనం చదవండి.
కేరళలోని ఎరాన్హీపాలం ప్రాంతానికి చెందిన ప్రేమ్ చంద్రన్ (26), సాండ్రా సంతోష్ (23) పరస్పరం ప్రేమించుకున్నారు. ఇరువైపు పెద్దలను తమ పెళ్లికి ఒప్పించారు. 2018, మే 20న పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. సరిగ్గా అదే సమయంలో నిఫా వైరస్ కేరళను వణికించింది. ఆ వైరస్ కారణంలో కేరళలో 17 మంది మృత్యువాత పడ్డారు. దీంతో అప్పట్లో తప్పని సరి పరిస్థితుల్లో పెళ్లిని వాయిదా వేసుకున్నారు.
ఆ తర్వాత రెండోసారి కేరళవాసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఓనం పండుగ రోజు పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. పెళ్లి రోజు సమీపిస్తున్న తరుణంలో కేరళను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా కేరళ అతలాకుతలమైన విషయం తెలిసిందే. వందలాది మంది మృత్యువాత పడగా, వేల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో అప్పట్లో మళ్లీ పెళ్లి వాయిదా వేసుకున్నారు.
తాజాగా మూడో దఫా ఈ నెల 20న ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ సారి ఎలాగైనా పెళ్లి జరుగుతుందని గట్టిగా అనుకున్నారు. కానీ ప్రకృతి వాళ్ల పెళ్లికి సహకరించలేదు. ఈ సారి కరోనా వైరస్ కారణంగా ముచ్చటగా మూడో దఫా పెళ్లిని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రెండేళ్ల వ్యవధిలో మూడుసార్లు పెళ్లి వాయిదా పడటం చర్చనీయాంశమైంది. రెండు సార్లు వైరస్ , ఒక సారి వరదల కారణంగా పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని ఆ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సెప్టెంబర్‌లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకుని, తామిద్దరం ఒక్కటవుతామని ఆ ప్రేమ జంట గట్టిగా చెబుతోంది. కనీసం నాలుగో సారైనా వారి ఆశ నెరవేరాలని ఆకాంక్షిద్దాం.
ఏదేమైనా సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకుని తీరతాం అంటున్న ఈ జంట ఆశ నెరవేరాలని కోరుకుందాం!