ఓహో వైసీపీ ప్లీన‌రీ అక్క‌డే నిర్వ‌హ‌ణ వెనుక క‌థ అదా?

వివిధ కార‌ణాల రీత్యా వైసీపీ బ‌ల‌హీనంగా ఉన్న గుంటూరు జిల్లాలో ప్లీన‌రీ ఎందుకు నిర్వ‌హించాల‌ని అనుకుంటున్నార‌బ్బా అనే ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. అయితే నాగార్జున యూనివ‌ర్సిటీ చెంత‌న వ‌చ్చే నెలలో వైసీపీ ప్లీన‌రీ ఏర్పాటు వెనుక…

వివిధ కార‌ణాల రీత్యా వైసీపీ బ‌ల‌హీనంగా ఉన్న గుంటూరు జిల్లాలో ప్లీన‌రీ ఎందుకు నిర్వ‌హించాల‌ని అనుకుంటున్నార‌బ్బా అనే ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. అయితే నాగార్జున యూనివ‌ర్సిటీ చెంత‌న వ‌చ్చే నెలలో వైసీపీ ప్లీన‌రీ ఏర్పాటు వెనుక కార‌ణాన్ని ఆ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వెల్ల‌డించారు.

గుంటూరులో పార్టీ ప్లీన‌రీ ప్రాంగ‌ణం ఏర్పాట్ల‌ను వైసీపీ జాతీయ కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి, మాజీ మంత్రి సుచ‌రిత త‌దిత‌రుల‌తో క‌లిసి ఆయ‌న ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 8వ తేదీ వైఎస్సార్ పుట్టినరోజు అని, అది త‌మ‌కు పవిత్రమైన రోజు అని ఆయ‌న‌ అన్నారు. 

అందుకే ఆ రోజు వైసీపీ ప్లీనరీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. వ‌చ్చే నెల 8న త‌ల‌పెట్టిన ప్లీన‌రీకి ప్ర‌తి వార్డుస్థాయి కార్య‌క‌ర్త‌కు పార్టీ అధ్య‌క్షుడి సంత‌కంతో ఆహ్వానం వుంటుం ద‌న్నారు. న‌వ‌ర‌త్నాల ఎజెండా గ‌తంలో గుంటూరు ప్లీన‌రీలోనే ఆవిర్భ‌వించింద‌న్నారు. అదే వేద మంత్రంలా 95 శాతం హామీల‌ను అమ‌లు చేసిన‌ట్టు స‌జ్జ‌ల చెప్పారు.

న‌వ‌ర‌త్నాల సంక్షేమ ప‌థ‌కాల‌కు కార‌ణ‌మైన గుంటూరులోనే మ‌రో సారి ప్లీన‌రీ నిర్వ‌హించ‌నున్న‌ట్టు స‌జ్జ‌ల తెలిపారు. రాష్ట్ర భ‌విష్య‌త్ చిత్ర‌ప‌టాన్ని మ‌ళ్లీ చ‌ర్చిస్తామ‌న్నారు. వ‌రుస‌గా అధికారంలో తామే వుంటామ‌ని, అందుకే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిస్తామ‌ని స‌జ్జ‌ల వెల్ల‌డించారు.  

ఇది కేవ‌లం ఒక పార్టీ ప్లీనరీ కాద‌ని, ప్రజల ఎజెండాతో ముందుకు వెళ్తున్న‌ట్టు స‌జ్జ‌ల వెల్ల‌డించారు. స‌జ్జ‌ల మాట‌ల ప్ర‌కారం… త‌మ పార్టీ అధికారంలోకి రావ‌డానికి న‌వ‌ర‌త్నాలు కీల‌క భూమిక పోషించాయి.

న‌వ‌త‌ర్నాల సంక్షేమ ప‌థ‌కాల‌కు గుంటూరు ప్లీన‌రీ పురుడు పోసింది. అందుకే ఆ స్థలాన్ని సెంటిమెంట్‌గా భావించి, మ‌రోసారి అక్క‌డే జ‌రిపితే అధికారంలోకి వ‌స్తామ‌నే న‌మ్మ‌కం బ‌లంగా క‌నిపిస్తోంది. అందుకే గుంటూరులోని ఆ స్థలంలోనే ప్లీన‌రీ నిర్వ‌హణ‌కు నిర్ణ‌యించిన‌ట్టు స‌జ్జ‌ల స్ప‌ష్టం చేశారు.