తాలిబన్లు, ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాల్లో భయం. కారణం వాళ్లకి ప్రజాస్వామ్య లక్షణాలు లేవు. వెళ్లిపోయారనుకుంటే, అమెరికా నిర్వాకం వల్ల మళ్లీ వచ్చారు. వీళ్లతో మనకి చాలా చేదు అనుభవాలున్నాయి. తీవ్రవాదులకి శిక్షణ ఇచ్చి మనమీదకి పంపారు.
ఇప్పటికీ దేశంలోకి వస్తున్న డ్రగ్స్ తాలిబన్ల పాపమే. 1999లో మన విమానాన్ని హైజాక్ చేసిన తీవ్రవాదులకి ఆశ్రయం ఇచ్చారు. ఇన్ని చేసినా కష్ట సమయంలో ఆప్ఘన్‌కి భారత్ అన్నం పెట్టింది. సాయం చేసింది. అయితే తాలిబన్లని అధికారికంగా భారత్ ఇప్పటి వరకూ గుర్తించలేదు.
డిసెంబర్ 24, 1999లో IC 814 విమానం ఖాట్మండ్ నుంచి ఢిల్లీ బయల్దేరింది. 191 మంది ప్రయాణికులు. ఐదుగురు టెర్రరిస్టులు హైజాక్ చేశారు. అమృత్‌సర్, లాహోర్, దుబాయ్‌లలో ల్యాండ్ చేసి చివరికి కాందహార్‌లో దిగారు. తాలిబన్లు వాళ్లకి సపోర్ట్ చేశారు.
భారత్ ఎలాంటి మిలటరీ ఆపరేషన్ చేయకుండా రక్షణ ఇచ్చారు. ఏడు రోజులు ఈ హైజాకింగ్ నడిచింది. ప్రయాణికుల్లో ఒకరు చనిపోయారు, కొందరు గాయపడ్డారు. ముగ్గురు టెర్రరిస్టుల్ని , హైజాకర్లని క్షేమంగా పాక్ వెళ్లేలా చేసింది తాలిబన్లే.
ఇది అప్పటి బీజేపీ ప్రభుత్వం డిప్లొమేటిక్ ఫెయిల్యూర్ అన్నవాళ్లున్నారు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడ్డానికి వేరే దారి లేదన్న వాళ్లున్నారు.
ఇన్నేళ్ల తర్వాత ఆశ్చర్యకరంగా భారత్‌లో బీజేపీలో, ఆప్ఘన్‌లో తాలిబన్లు ఉన్నారు. ఆప్ఘన్‌లో ఈ మధ్య భారీ భూకంపం వచ్చింది. వేలల్లో మరణాలు, నిరాశ్రయులు. తాలిబన్లు చేతులెత్తేశారు. ఆప్ఘన్‌లో భారత్ రాయబార కార్యాలయాన్ని మూసేసినా కూడా ప్రజలకి అవసరమైన మందులు, తిండిని భారత్ సాయం చేసింది.
తాలిబన్లు రావడానికి ముందు కూడా ఆప్ఘన్‌లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు భారత్ చేసింది. తాలిబన్లు వచ్చిన తర్వాత అవన్నీ ఆగిపోయాయి.
తాలిబన్లు ఎప్పుడూ భారత్‌కి స్నేహితులు కారు. కానీ భారత్ ఎప్పుడూ ఆప్ఘన్ ప్రజలతో స్నేహంగానే వుంది. మోదీ ప్రభుత్వాన్ని ఎవరెన్ని విమర్శించినా దౌత్యనీతిలో దాన్ని మించిన వాళ్లు లేరు.
జీఆర్ మహర్షి