దొంగ‌లు రాజ‌స్తాన్‌లో వుంటే!

కుట్ట‌వుం శిక్షాయుం మ‌ళ‌యాళ సినిమా. నెట్‌ఫ్లిక్స్‌లో వుంది. 2015లో కాస‌ర‌గొడ్‌లోని న‌గ‌ల దుకాణంలో భారీ చోరీ జ‌రిగింది. దొంగ‌లు రాజ‌స్తాన్‌లో ఉన్నారు. వాళ్ల‌ని ఎలా ప‌ట్టుకున్నారు? ఇది క‌థ‌. Advertisement ఈ సినిమా చూస్తున్న‌ప్పుడు…

కుట్ట‌వుం శిక్షాయుం మ‌ళ‌యాళ సినిమా. నెట్‌ఫ్లిక్స్‌లో వుంది. 2015లో కాస‌ర‌గొడ్‌లోని న‌గ‌ల దుకాణంలో భారీ చోరీ జ‌రిగింది. దొంగ‌లు రాజ‌స్తాన్‌లో ఉన్నారు. వాళ్ల‌ని ఎలా ప‌ట్టుకున్నారు? ఇది క‌థ‌.

ఈ సినిమా చూస్తున్న‌ప్పుడు కొన్నేళ్ల క్రితం తిరుప‌తిలో జ‌రిగిన తెలివైన దొంగ‌త‌నం గుర్తొచ్చింది. ఒక చిన్న న‌గ‌ల దుకాణం ప‌క్క‌న ఒక షాపు ఖాళీ అయ్యింది. దాంట్లో రెడీమేడ్ బ‌ట్ట‌ల షాపు పెడ‌తామ‌ని కొంద‌రు అద్దెకు తీసుకున్నారు. రాక్స్, ఫ‌ర్నీచ‌ర్ వ‌ర్క్ ప‌గ‌లు చేస్తే ఆ సౌండ్ అంద‌రికీ ఇబ్బంద‌ని రాత్రిపూట చేసుకుంటామ‌ని ఓన‌ర్‌తో ప‌ర్మీష‌న్ తీసుకున్నారు. ష‌ట్ట‌ర్ వేసుకుని రాత్రిళ్లు వ‌ర్క్ స్టార్ట్ చేశారు. తీరా వాళ్లు చేసింది ఏంటంటే ప‌క్క‌నున్న న‌గ‌లు దుకాణానికి క‌న్నం వేయ‌డం. త‌ర్వాత ఎప్పుడో పోలీసులు ప‌ట్టుకున్నారు.

ప‌క్క రాష్ట్రాల‌కి నేర‌స్తులు పారిపోతే చాలా క‌ష్టం. ఆయా రాష్ట్రాల పోలీసులు స‌హ‌క‌రించ‌క‌పోతే అంతా వృథా. కొన్ని సార్లు స‌హ‌క‌రిస్తారు. పోలీసులే పోలీసుల‌కు లంచం ఇవ్వాల్సిన స్థితి వ‌స్తుంది. ఈ సినిమాలో అలాంటి సీన్ వుంటుంది.

1999లో చిత్తూరు జిల్లా కొంద‌రు అమ్మాయిలు ముంబ‌య్ రెడ్‌లైట్ ఏరియాలో ఇరుక్కున్నార‌ని స‌మాచారం. చిత్తూరు నుంచి ఒక టీం వెళ్లింది. ఒక ఎస్ఐ అక్క‌డి విష‌యాలు చెబితే భ‌య‌మేసింది. ముంబ‌య్ పోలీసులు లేక‌పోతే, మ‌న పోలీసులు శ‌వాలై వ‌చ్చేవాళ్లు.

కుట్ట‌వుం శిక్షాయుం కూడా ఇదే క‌థ‌. డైరెక్ట‌ర్ ప్ర‌త్యేక‌త ఏమంటే ఎక్క‌డా కూడా ట్విస్టులు, అన‌వ‌స‌ర డ్రామా వుండ‌దు. మొత్తం ఇన్వెస్టిగేష‌నే. అక్క‌డ‌క్క‌డ దీని వ‌ల్ల బోర్ కొడుతుంది. పార్వ‌ర్డ్ బ‌ట‌న్ త‌ప్ప‌నిస‌రి. ఒక రాబ‌రీ జ‌రిగితే పోలీస్ ఇన్వెస్టిగేష‌న్ ఎలా వుంటుందో క‌ళ్ల‌ముందుంచారు. హీరోయిన్ లేని ఈ సినిమాలో హీరో అప‌రాథ భావ‌న అనే ఎమోష‌న్ త‌ప్ప ఇంకేమీ లేదు. రాళ్లు విసురుతున్న ఒక యువ‌కున్ని కాల్చి చంపాల్సి వ‌స్తుంది. అది హీరోని క‌ల‌లో వెంటాడుతుంటుంది. ఫ‌స్ట్ సీన్ చూసి సినిమా దాని గురించే అనుకుంటాం. కానీ అదికాదు.

ఇన్వెస్టిగేష‌న్‌లో ఎంత మందిని, ఎన్ని ర‌కాలుగా అనుమానిస్తారు? చివ‌రికి దొంగ‌లు రాజ‌స్తాన్‌లో ఉన్నార‌ని ఎలా తెలుసుకుంటారు? అనేది ఆస‌క్తిక‌రంగా వుంటుంది. రాజ‌స్తాన్ లోకేష‌న్స్ అక్క‌డి పోలీసుల తీరు చాలా న్యాచుర‌ల్‌గా వుంటుంది. సెకెండాఫ్‌లో చాలా మ‌టుకు హిందీ డైలాగ్‌లే వుంటాయి.

కొంచెం స్లోగా ఉన్నా క్రైం ఇన్వెస్టిగేష‌న్‌పైన ఆస‌క్తి వున్న వాళ్ల‌కి ఓకే.

జీఆర్ మ‌హ‌ర్షి