పేర్ని నాని… రాజకీయాలకు వన్నె తెచ్చిన నాయకుడు. వ్యంగ్యోక్తులతో ప్రత్యర్థులకు చురకలు అంటించడంలో పేర్ని నానికి మరో నాయకుడు సాటిరారంటే అతిశయోక్తి కాదు. మరీ ముఖ్యంగా జనసేనాని పవన్‌కల్యాణ్‌పై సెటైర్స్ వేయడంలో పేర్ని నానిది ప్రత్యేక పంథా. మీది తెనాలి, మాది తెనాలి అనే చందాన… పవన్ కాపు, నేను కాపు అంటూ జనసేన నాయకులు, కార్యకర్తలకు మంట పుట్టేలా మాటలతో అగ్గి రాజేసిన సందర్భాలు అనేకం.
అలాంటి పేర్ని నాని ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నారా? అంటే… ఔననే సమాధానం ఇస్తోంది. ఇవాళ మచిలీపట్నంలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పిన మాటలు… వచ్చే ఎన్నికల్లో పేర్ని నాని పోటీ చేయరనే ప్రచారానికి బలం కలిగిస్తున్నాయి. కొడాలి నాని ఏమన్నారంటే…
‘మచిలీపట్నంలో పేర్ని నాని నిలబడినా.. ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి నిలబడినా అండగా నిలబడాలి. బందరులో వారసుడినే గెలిపించండి. ఇల్లరికం అల్లుడిని (టీడీపీ నేత కొల్లు రవీంద్ర) కాదు. వారసత్వమంటే తాత, తండ్రి, కొడుకు. వారసత్వ మంటే వైఎస్సార్.. జగన్. సీనియర్ ఎన్టీఆర్… జూనియర్ ఎన్టీఆర్. రాష్ట్రంలో చంద్రబాబు, బందరులో కొల్లు రవీంద్ర వంటి ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపించండి’ అని మచిలీపట్నం నియోజకవర్గ ప్రజల్ని కొడాలి నాని కోరారు.
దీంతో 2024 ఎన్నికల్లో పేర్ని నాని బదులు ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి బరిలో నిలుస్తారని కొడాలి నాని నేరుగా సంకేతాలు ఇచ్చినట్టైంది. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయనని, అవకాశం వుంటే తన కుమారుడు కిట్టుకు మచిలీపట్నం సీటు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పేర్ని నాని విన్నవించినట్టు సమాచారం. అయితే నవ్వుతూ…ఔను అనక, కాదు అనక, పని చేసుకోవాలని పేర్ని నానికి జగన్ సూచించినట్టు తెలిసింది.
ఇదిలా వుండగా ఆ నియోజకవర్గ ప్రజలు అభిమానంతో పేర్ని నాని కుమారుడిని కిట్టు అని పిలుస్తుంటారు. ఇప్పటికే మచిలీపట్నం నియోజకవర్గంలో పేర్ని కిట్టు చురుగ్గా పని చేస్తున్నారు. తాత, తండ్రిలా ప్రజలతో మమేకం అయ్యేందుకు యువ నాయకుడిగా కాకుండా, సామాన్య కార్యకర్తలా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళుతున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ, వాళ్ల కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలిగేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఏ సమయంలో ఫోన్ చేసినా పలికే వైసీపీ యువనాయకుడిగా పేర్ని కిట్టుకు మంచి పేరు ఉంది. కొడాలి నాని తాజా ప్రకటనతో పేర్ని కిట్టు పోటీపై ఒక స్పష్టత వచ్చినట్టైంది.