ఈ అతితోనే ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు చిక్కులు!

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెంటాడుతోంద‌న‌డంలో రెండో అభిప్రాయానికి తావులేదు. ఆల్రెడీ రెండేళ్ల పాటు స‌స్పెండ్ చేసిన ప్ర‌భుత్వం, మ‌రోసారి అదే ర‌క‌మైన శిక్ష విధించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రీ ఈ…

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెంటాడుతోంద‌న‌డంలో రెండో అభిప్రాయానికి తావులేదు. ఆల్రెడీ రెండేళ్ల పాటు స‌స్పెండ్ చేసిన ప్ర‌భుత్వం, మ‌రోసారి అదే ర‌క‌మైన శిక్ష విధించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రీ ఈ స్థాయిలో ఏబీవీని వేధించ‌కుండా వుంటే బాగుండేద‌ని మెజార్టీ అభిప్రాయం.

ఇదే సంద‌ర్భంలో చంద్ర‌బాబు హ‌యాంలో ప‌ని చేసిన అధికారుల్లో కేవ‌లం ఏబీనే టార్గెట్ చేశామంటే …అత‌ను ఏ స్థాయిలో టీడీపీ కార్య‌క‌ర్త‌గా ప‌ని చేసి వుంటారో అర్థం చేసుకోవాల‌ని అధికార ప‌క్షం నుంచి వినిపిస్తున్న మాట‌. గ‌తంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ అస‌లు ప‌ని వ‌దిలేసి, త‌మ పార్టీని బ‌ల‌హీన‌ప‌రచ‌డ‌మే ల‌క్ష్యంగా విధులు నిర్వ‌ర్తించార‌ని అధికార పార్టీ వైసీపీ చెబుతోంది.

ఏబీ వ‌ర్సెస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అన్న రీతిలో వ్య‌వ‌హారం త‌యారైంది. రాజు త‌ల‌చుకుంటే కొర‌డా దెబ్బ‌లు త‌క్కువా? అన్న‌ట్టు …ప్ర‌భుత్వం అనుకున్న‌ట్టు ఎవ‌రినైనా వేధించ‌డం పెద్ద ప‌నేం కాదు. ఈ కోణంలోనే ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై సాగుతున్న త‌తంగాన్ని చూడాల్సి వుంటుంది. అయితే ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు త‌క్కువేం తిన‌లేదు. ఏబీ అతే ఆయ‌న‌కు చిక్కులు తెచ్చింద‌నే అభిప్రాయాల్ని కొట్టి పారేయ‌లేం.

మ‌రోసారి ఆయ‌న‌పై ప్ర‌భుత్వం స‌స్పెండ్ వేటు వేసిన నేప‌థ్యంలో …ఏబీవీ ఇవాళ మీడియా ముందుకొచ్చారు. త‌న‌ను అన్యాయంగా స‌స్పెండ్ చేశార‌ని చెప్పుకోవ‌డం వ‌ర‌కూ బాగుంది. కానీ మిమ్మ‌ల్ని మాత్ర‌మే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎందుకు టార్గెట్ చేసిందనే మీడియా ప్ర‌తినిధుల ప్ర‌శ్న‌కు ఆయ‌న ఇచ్చిన స‌మాధానం ఎవ‌రికైనా కోపం తెప్పిస్తుందనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

“రాష్ట్రాన్ని తగలబెట్టకుండా ఆనాడు అడ్డుకున్నాను. కోడి కత్తి ఘటనతో ఘర్షణలు‌ చేయాలని చూస్తే ఆపాను. అందుకే న‌న్ను అన్ని విధాలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు” అని ఏబీవీ అన్నారు. త‌న‌పై ఆరోప‌ణ‌ల‌కు మాత్రం ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేసే ఏబీవీ…. జ‌గ‌న్ పార్టీపై చేసే విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం ఏంటి? ఏ విధంగా నాడు రాష్ట్రం త‌గ‌ల‌బ‌డ‌కుండా అడ్డుకున్నారో ఏబీ స‌మాధానం చెప్పాలి. అలాగే కోడి క‌త్తి ఘ‌ట‌న‌లో బాధితుడు నాటి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌. ప్ర‌స్తుతం ఆయ‌న ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్నారు.

ఆయ‌నపై విశాఖ విమానాశ్ర‌యంలో కోడిక‌త్తితో దాడి చేస్తే… దాన్ని అడ్డు పెట్టుకుని ఘ‌ర్ష‌ణ‌లు చేయాల‌ని చూస్తే, అడ్డుకున్నాన‌ని ఇవాళ ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం రెచ్చ‌గొట్ట‌డం కాదా? మ‌రి నాడు జ‌గ‌న్‌పై కోడి క‌త్తి దాడి జ‌ర‌గ‌కుండా ఎందుకు అడ్డుకోలేక‌పోయారు? త‌నను టార్గెట్ చేయ‌డం వెనుక వాస్త‌వాలేంటో క‌నీసం త‌న అంత‌రాత్మ‌కైనా స‌మాధానం చెప్పుకుంటే మంచిద‌ని నెటిజ‌న్లు ఏబీవీకి హిత‌వు చెబుతున్నారు. 

ఇప్ప‌టికీ రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తూ, క‌య్యానికి కాలు దువ్వుతుండ‌డం వ‌ల్లే ఏబీవీకి క‌ష్టాలు త‌ప్ప‌డం లేదంటే… కాద‌న‌గ‌ల‌మా?