ఎవరు మద్దతిచ్చినా ఇవ్వకపోయినా టీడీపీ, బీజేపీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పవన్ కల్యాణే మన సీఎం అభ్యర్థి. ఈ మెసేజ్ అందరికీ చేరవేయండి, అందరినీ చైతన్య పరచండి. ఇదీ ప్రస్తుతం జనసైనికుల వాట్సప్ స్టేటస్. కాస్త బుర్ర ఉన్నవాళ్లు ఇలాంటివి పక్కనపెడుతున్నారు కానీ, పవన్ వీరాభిమానులు, మాస్ ఫాలోవర్లు మాత్రం దీన్ని స్టేటస్ గా పెట్టి పవన్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. ఈ స్టేటస్ ఇప్పుడు ఏపీలో పిచ్చ వైరల్ అవుతోంది, ఓ రేంజ్ లో కామెడీ పండిస్తోంది.
2019లో పవన్ కల్యాణ్ జనసేన సీఎం అభ్యర్థే కదా, ఎవరు కాదన్నారు. కానీ రెండుచోట్లా పోటీ చేసిన సీఎం అభ్యర్థి ఓడిపోయారు కదా. 2024లో కూడా పవన్ సీఎం అభ్యర్థి అయితే కాదనేవారెవరు..? ఇంతోటిదానికి స్టేటస్ పెట్టుకుని మరీ మా జుట్టు ఇంకొకరి చేతిలో ఉంది అని చెప్పుకోవాలా..? ఇది తెలివా, అతి తెలివా, అంతకు మించిన అమాయకత్వమా..? జనసైనికుల దీనస్థితి పగవాడికి కూడా రాకూడదని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.
సీఎం సీఎం నుంచి.. సీఎం అభ్యర్థి వరకు..
ఆమధ్య పవన్ కల్యాణ్ పర్యటనల్లో జనసైనికులు సీఎం సీఎం అంటూ తెగ అల్లరి చేసేవారు. తెలిసి అనేవారో లేక తెలియక అనేవారో కానీ.. ఆ మాట అనొద్దయ్యా అంటూ పవన్ కల్యాణే వారికి సర్దిచెప్పుకున్నారు. పవర్ స్టార్ అనే బిరుదు కూడా తనకు వద్దని, తన చేతిలో పవర్ ఉన్నప్పుడే ఆ మాట అనండని అనేవారు పవన్.
ఇప్పుడు “సీఎం అభ్యర్థి పవన్” అనే స్లోగన్ బాగా వాడుకలోకి వచ్చింది. రాజకీయాల్లో ఉన్నన్నిరోజులూ పవన్ కల్యాణే సీఎం అభ్యర్థి కాదనేవారెవరు. ఆ మాటకొస్తే..ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఎవరైనా తనకు తానే సీఎం అభ్యర్థిగా ప్రకటించుకోవచ్చు, పక్క పార్టీల మద్దతుతో అధికారంలోకి వస్తానని చెప్పొచ్చు. దాన్ని కాదనేవారెవరు. కానీ జనసైనికులకు మాత్రం సీఎం అభ్యర్థి పవన్ అనే విషయంపై పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా పవనే సీఎం అభ్యర్థి అని ప్రచారం చేసుకుంటున్నారు.
అల్ప సంతోషం.. అతి సంతృప్తి..
సరిగ్గా పార్టీ రూపకల్పన లేదు, అభ్యర్థులకు దిక్కులేదు, పోనీ పోటీ చేసినా డిపాజిట్లు వస్తాయన్న నమ్మకం లేదు, ఇప్పటికిప్పుడు ఏ పార్టీతో పొత్తులో ఉన్నారో చెప్పే క్లారిటీ లేదు. పోనీ 2024లో ఏ పార్టీతో కలసి పోటీ చేస్తారో అని చెప్పుకునే ధైర్యం లేదు. ఇన్ని ఉన్నా కూడా ఇంకా జనసైనికులు ఆ మాయలోనే ఉన్నారంటే నిజంగానే వారిని చూస్తే జాలేస్తుంది.
సోషల్ మీడియా ఉంది కాబట్టి.. జనసైనికుల ఆటలు, మాటలు అన్నీ చెల్లుబాటవుతున్నాయి కానీ, లేకపోతే వీరి వింత, వితండ వాదాలను తట్టుకోవడం ఎవరి వల్లా అయ్యేపని కాదు.