అటెండెన్స్ తో అమ్మఒడికి లింకు పెట్టారు. దాదాపు 51 వేలమంది తల్లులకు అమ్మఒడి ఆగిపోయింది. అయితే ఇక్కడ తప్పెవరిది. తమ పిల్లలను సరిగా బడికి పంపించలేకపోతున్న తల్లిదండ్రులదా.
పిల్లల్ని కూడా పనికి తీసుకెళ్తే కాని పూటగడవని నిరుపేద అమ్మానాన్నలదా..? యూనిఫామ్, బుక్స్.. అన్నీ ఉచితంగా ఇచ్చినా చదువు కోసం బడికి రాలేని పిల్లలదా..? విద్యా వ్యవస్థలో ఉన్న లోపాన్ని సరిదిద్దేందుకు ఇది ఓ చక్కని అవకాశం. అమ్మఒడి ఇంతమందికి రాలేదు అనేదానికంటే… రాష్ట్రంలోని అందరు తల్లులకు అమ్మఒడి అందించాం అనే ప్రకటన ఎంత గొప్పగా ఉంటుందో ఊహించాలి ప్రభుత్వం.
స్కూల్ లో చేరిన ప్రతి పిల్లవాడూ కచ్చితంగా ప్రతి రోజూ స్కూల్ కి వచ్చేలా చూడటం ఉపాధ్యాయుల బాధ్యత. ఆమధ్య వాలంటీర్లకు వారి పరిధిలోని పిల్లలు స్కూళ్లకు వెళ్లారా లేదా అని చెక్ చేసేలా ఆదేశాలిచ్చారు. ఒకవేళ పిల్లవాడు బడికి వెళ్లకపోతే తల్లిదండ్రులకు సమాచారమిచ్చే ప్రణాళిక కూడా రూపొందించారు. అవన్నీ ఏమైపోయాయి. కేవలం అటెండెన్స్ బూచిగా చూపి అమ్మఒడి ఆపేస్తే.. దాన్ని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తే, దానికి బాధ్యులెవరు..?
వేల రూపాయల ఫీజు కట్టే స్థోమత ఉండి, ప్రైవేట్ స్కూల్స్ కి పిల్లల్ని పంపించే తల్లికి అమ్మఒడి డబ్బు పడింది. ఫీజు కట్టే స్థోమత లేక సర్కారు బడికి పిల్లవాడిని పంపుతూ.. అప్పుడప్పుడూ తనతోపాటు కూలి పనులకు తీసుకెళ్లే తల్లికి అటెండెన్స్ నిబంధనతో డబ్బులు పడలేదు. ఇక్కడ ప్రభుత్వం చూడాల్సింది అటెండెన్సా, లేక వారి అవస్థలా..?
పేదలకే లబ్ది.. ఇక్కడ కథ మారిందా..?
సంక్షేమ పథకాల లబ్ధి అట్టడుగు వర్గాలవారికి చేరాలనేది ప్రభుత్వ ఆశయం. అమ్మఒడి పథకం ముందు ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకే అనుకున్నారు. కానీ ప్రతిపక్షాల రాద్ధాంతం వల్ల అది ప్రైవేట్ స్కూల్స్ కి కూడా వర్తింపజేయాల్సి వచ్చింది. దీంతో సహజంగానే నిరుపేద వర్గాలతో పాటు, ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజుల కట్టగలిగిన ధనిక వర్గాలకు కూడా అమ్మఒడి డబ్బులు అందుతున్నాయి. ఇప్పుడు అటెండెన్స్ అనే విధానంతో నిరుపేదలు ఇబ్బంది పడే అవకాశముంది.
అటెండెన్స్ లేకపోవడం వల్ల డబ్బులు వేయలేకపోతున్నామనే వాదన సరికాదని అంటున్నారు కొంతమంది. స్కూల్ కి పిల్లవాడు రాలేదంటే.. కచ్చితంగా వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అనుకోవాలి. ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్న పిల్లలెవరూ బడి ఎగ్గొట్టరు. వాస్తవానికి అలా బడికి రాలేని పరిస్థితుల్లో ఉన్నవారికి కచ్చితంగా అమ్మఒడి అందాలి. కానీ ఇక్కడ రివర్స్ లో జరుగుతోంది.
51వేల మందికి అమ్మఒడి ఆపడం వల్ల ప్రభుత్వానికి కలిగే లబ్ధి 66 కోట్ల రూపాయలు. అనర్హులను వడపోస్తే కచ్చితంగా ఆ 66 కోట్లను మరో విధంగా సర్దుబాటు చేసుకునే అవకాశముంది. కానీ హాజరు అనేది ప్రాతిపదికగా తీసుకోవడమే ఇక్కడ అధికారులు చేసిన తప్పు. మధ్యాహ్న భోజనం పెడతారనే కారణంతోనే చాలామంది నిరుపేదలు తమ పిల్లల్ని స్కూల్స్ కి పంపిస్తున్నారు. హాజరుకి అమ్మఒడికి లింకు పెట్టడం మంచిదే అయినా.. ఇలా పేదలకు ఆర్థిక సాయం అందించకుండా ఎగరగొట్టడం మాత్రం మంచి పద్ధతి అనిపించుకోదు.
వందమంది అనర్హులకు అమ్మఒడి అందినా పర్లేదు కానీ, ఒక్క పేద కుటుంబానికి ఆ సాయం అందలేదు అనిపించుకోకూడదు. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తే మంచిది.