బ్రో సినిమాను తను ఎప్పుడో వదిలేశానన్నాడు పవన్ కల్యాణ్. తన కార్యకర్తల్ని, ఫ్యాన్స్ ను కూడా ఆ సినిమా పట్టుకొని వేలాడొద్దంటూ సలహా ఇచ్చాడు. అయితే తను వదిలేసినా వైసీపీ జనాలు మాత్రం ఇంకా ఆ సినిమాను పట్టుకొని వేలాడుతున్నరని ఎద్దేవా చేశారు. ఇప్పుడు వైసీపీ నేతలతో పాటు, ప్రేక్షకులు కూడా ఈ సినిమాను వదిలేసే టైమ్ వచ్చింది.
బ్రో సినిమా మరో వీకెండ్ పూర్తి చేసుకుంది. ఈసారి మరింత చతికిలపడింది. తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి ఈ సినిమా నష్టాలు తెచ్చిపెట్టిందనేది బహిరంగ రహస్యం. ఈ మొత్తం చర్చకు మరో 3-4 రోజుల్లో పూర్తిస్థాయిలో తెరపడనుంది.
గురువారం రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా వస్తోంది. ఆ మరుసటి రోజు శుక్రవారం చిరంజీవి నటించిన భోళాశంకర్ వస్తోంది. ఆ రెండు సినిమాల రాకతో బ్రో సినిమా పూర్తిగా సైడ్ అవ్వబోతోంది. ఇక ఆ తర్వాత ఈ సినిమాను నిజంగానే ఎవ్వరూ పట్టించుకోరు.
ఇప్పటికే ఈ సినిమాకు భారీగా థియేటర్లు తగ్గిపోయాయి. సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో, గత శుక్రవారం గంపగుత్తగా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలా భారీగా థియేటర్లు కోల్పోయిన బ్రో సినిమా, ఈ శుక్రవారం నాటికి మరిన్ని స్క్రీన్స్ ను వదులుకోవాల్సిన పరిస్థితి ఉంది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 30 కోట్ల రూపాయల షేర్ రావాల్సి ఉంటుంది. ఇప్పుడున్న టాక్ తో ఇది దాదాపు అసాధ్యం. కేవలం నైజాం నుంచే ఈ సినిమాకు 10 కోట్ల నష్టం వస్తుందనేది ఓ అంచనా.
అటు ఓవర్సీస్ లో బ్రో దాదాపు క్లోజింగ్ కు వచ్చింది. మొదటి వారం 1.34 మిలియన్ డాలర్లు ఆర్జించిన ఈ సినిమా, 10 రోజుల్లో 1.40 మిలియన్ డాలర్లకు మాత్రమే చేరుకుంది. అంటే ఇక ఈ సినిమా నడవదని అర్థం చేసుకోవాలి. యూఎస్ఏలో ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేసింది పీపుల్ మీడియా సంస్థ. ఓవరాల్ గా చూసుకుంటే, ఇక ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం ఒక్కటే మిగిలింది.