ఎక్కువ ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లనే జరుగుతాయి. ఇది కూడా అలాంటిదే. జలపాతం చూడ్డానికి కుటుంబంతో కలిసి కారులో వెళ్లిన ఓ వ్యక్తి, కారు హ్యాండ్ బ్రేక్ వేయడం మరిచిపోయాడు. ఫలితంగా ఓ చిన్నారితో సహా, కారు జలపాతంలో పడింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది ఈ ఘటన.
తాజాగా కురిసిన వర్షాలకు ఇండోర్ శివార్లలోని లోహియా కుంద్ జలపాతం నిండుకుండలా మారింది. సుందరంగా తయారైంది. దీన్ని చూసేందుకు స్థానికులతో పాటు, చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఓ చిన్న పిక్నిక్ స్పాట్ గా మారింది ఆ ప్రాంతం. అయితే సెక్యూరిటీ మాత్రం సరిగ్గా లేదు.
జలపాతాన్ని చూసేందుకు సిమ్రోన్ కు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంతో పాటు లోహియా కుంద్ కు చేరుకున్నాడు. దాదాపు జలపాతం వరకు కారును పోనిచ్చాడు. కారు నుంచి ఇద్దరు దిగారు. తండ్రికూతుళ్లు దిగడానికి రెడీ అవుతున్నారు. కానీ కారుకు హ్యాండ్ బ్రేక్ వేయలేదనే విషయాన్ని అతడు మరిచిపోయాడు.
దీంతో లోతట్టుగా ఉన్న ఆ ప్రాంతంలో కారు రయ్ మంటూ జలపాతంవైపు దూసుకుపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే క్షణాల్లో కారు జలపాతంలో పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ అదేమంత పెద్ద లోతుగా లేదు. దీంతో చుట్టుపక్కల వాళ్లు వెంటనే నీళ్లలోకి దూకి వాళ్లను కాపాడారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనను అదనపు ఎస్పీ రూపేష్ కూడా ధృవీకరించారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించారు.