జనవరిలో విడుదలై, జనాలని ఆకట్టుకోలేక, ముగిసిపోయిన అంకం అనుకున్న వినయ విధేయరామ సినిమా వైనం మళ్లీ తెరపైకి వచ్చింది. హీరో రామ్ చరణ్ కావాలని, కోరి కెలికినట్లు కనిపిస్తోంది. ఆరెంజ్, తుఫాన్, బ్రూస్ లీ, ఇలా చరిత్రలో నిలిచిపోయే డిజాస్టర్లు ఇచ్చినపుడు చేయని పనిని రామ్ చరణ్ ఇప్పుడు చేసారు. తమ వైఫల్యాన్ని అంగీకరిస్తూ, ప్రేక్షకులకు సారీ చెబుతూ, సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు చెబుతూ, నిర్మాత దానయ్యను అక్కున చేర్చుకుంటూ, దర్శకుడు బోయపాటిని మాత్రం వదిలేస్తూ, రామ్ చరణ్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసారు.
పనిలో పనిగా పంపిణీదారులను, ఎగ్జిబిటర్లను, మీడియాను కూడా రామ్ చరణ్ తలుచుకున్నారు. ఒక్క బోయపాటిని మినహా. అయితే ఇప్పుడు వున్నట్లుండి రామ్ చరణ్ ఈ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందన్నది పెద్ద ప్రశ్న. సినిమా విడుదలై అంతా అయిపోయి, బిజినెస్ క్లోజ్ అయిపోయాక ఇప్పుడేందుకు ఈ కెలుకుడు?
వినయ విధేయరామ సినిమా మేకింగ్ సమయంలోనే బోయపాటితో నిర్మాత దానయ్యకు అంతగా పొసగలేదు. కొన్ని విషయాల్లో హీరో రామ్ చరణ్ కూడా బోయపాటి మాట వినలేదు. ఆ ఉక్రోషంతోనే బోయపాటి సినిమా విడుదల దగ్గర పడేవరకు కనీసం ఓ స్టిల్ వదలడం, ప్రచారం పట్టించుకోవడం వంటివి చేయలేదు.
వినయ విధేయను సంక్రాంతి బరిలోకి దిగకుండా చేయాలన్న ప్రయత్నాలు కూడా జరిగాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. కానీ బాలయ్య కథానాయకుడు సినిమాను చరణ్ సినిమా ఢీకొనక తప్పలేదు. అప్పుడే వినయ విధేయకు ఏవీ వదలకపోవడం వెనుక, దర్శకుడు బోయపాటికి బాలయ్యతో వున్న విధేయత కారణం కావచ్చు అంటూ గుసగుసలు వినిపించాయి. తరువాత ఆయన చేయబోయే సినిమా కూడా బాలయ్యదే. అందువల్ల ఇంతకీ ఈ సినిమాను ఏం చేస్తారో? అని క్వశ్చన్లు కూడా వినిపించాయి.
సినిమా విడుదలయ్యాక జనం ఆశ్చర్యపోయారు. బోయపాటి ఫ్లాప్ సినిమా దమ్ము కూడా దీనికన్నా బెటర్ అన్న టాక్ వినిపించింది. బోయపాటి మరీ ఇంత చెత్తగా సినిమా తీస్తారా? ఇలా ఎందుకు చేసారు? అని సర్వత్రా వినిపించింది. అభిమానులు అయితే బోయపాటి కావాలనే చరణ్ సినిమాను పాడుచేసి వుంటారని వాపోయారు కూడా.
నెట్ లో ఇప్పటికీ బాలయ్య అభిమానులు, మెగా అభిమానులు రకరకాల వీడియోలు కట్ చేసి ఒకళ్లపై ఒకళ్లు విసురుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో చరణ్ ఇప్పుడ ఈ లేఖ విడుదల చేయడం అంటే ఈ గడబిడ సోషల్ మీడియాలో ఇంకొంత కాలం సాగడానికి సాయం చేయడమే అవుతుంది.
అదే సమయంలో సినిమా వైఫల్యం అంతా పరోక్షంగా బోయపాటి నెత్తిన రుద్దడమే అవుతుంది. బోయపాటిని బహిరంగంగా ఏమీ అనలేక ఈ విధంగా టార్గెట్ చేసారేమో రామ్ చరణ్?