తలను బట్టి తలపాగా కానీ, తలను మించిన తలపాగా పనికిరాదన్నారు పెద్దలు. హీరో, మార్కెట్ ఇవన్నీ చూసుకుని పెట్టుబడి పెట్టాలి తప్ప, డైరక్టర్ కథ తెచ్చాడని మురిసిపోయి కాదు. చందు మొండేటిని నమ్మి, నాగచైతన్య మీద 30 కోట్లకు పైగా పెట్టి, మొత్తం సంపాదించుకున్న పేరు అంతా పాడు చేసుకున్నారు మైత్రీమూవీస్ జనాలు. ఇప్పుడు మళ్లీ అలాంటి తప్పేదో చేస్తున్నట్లు కనిపిస్తోంది.
విక్రమ్ కే కుమార్ ను నమ్మి, నానితో ప్రాజెక్టు టేకప్ చేసారు. పైగా ఈ ప్రాజెక్టు కోసం మరో నిర్మాత అశ్వనీదత్ కు కోటిన్నర ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. ఈ ప్రాజెక్టుకు యాభై కోట్ల వరకు బడ్జెట్ అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అదే నిజమైతే కాస్త పెద్ద రిస్క్ చేస్తున్నట్లే.
నాని కెరీర్ లోనే అంత పెద్ద సినిమా లేదు. అంత పెద్ద కలెక్షన్లు లేవు. విక్రమ్ కుమార్ భారీగా సక్సెస్ కొట్టిన మనం కూడా యాభై కోట్ల సినిమా తప్ప అంతకన్నా ఎక్కువేమీ కాదు. మరి అలాంటిది ఆ కాంబినేషన్ మీద అంత ఇన్వెస్ట్ చేయడం అంటే కేవలం శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ లాంటి వ్యవహారాలను నమ్ముకుని కావచ్చు.
వాటి ద్వారా ఓ ఇరవై కోట్లు వసూలు చేసుకుంటే 30 కోట్ల మార్కెట్ అన్నది కామన్ అనే ఐడియా కావచ్చు. కానీ దాని వల్ల ప్రాఫిట్ నే తగ్గిపోతుంది కదా? అదే 30 నుంచి 35లో సినిమా చేస్తే వచ్చే లాభం వేరుగా వుంటుంది. కానీ విక్రమ్ కుమార్ కాస్టింగ్, టెక్నీకల్ క్రూ అన్నీకలిసి సినిమా ఖర్చును యాభైకి చేరుస్తున్నట్లు తెలుస్తోంది.