పృథ్విరాజ్ కు గీతాకృష్ణ కౌంట‌ర్!

అతి త‌క్కువ కాలంలో గౌర‌వ‌నీయ‌మైన ప‌ద‌వి ద‌క్కితే, దాన్ని నిల‌బెట్టుకోలేక ఇప్పుడు త‌న‌పై కుట్ర జ‌రిగిదంటున్న న‌టుడు పృథ్విరాజ్ కు ఒక‌ప్ప‌టి ద‌ర్శ‌కుడు గీతాకృష్ణ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు. అడ‌పాద‌డ‌పా మాత్ర‌మే సినిమాలు చేయ‌గ‌లుగుతున్న…

అతి త‌క్కువ కాలంలో గౌర‌వ‌నీయ‌మైన ప‌ద‌వి ద‌క్కితే, దాన్ని నిల‌బెట్టుకోలేక ఇప్పుడు త‌న‌పై కుట్ర జ‌రిగిదంటున్న న‌టుడు పృథ్విరాజ్ కు ఒక‌ప్ప‌టి ద‌ర్శ‌కుడు గీతాకృష్ణ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చాడు. అడ‌పాద‌డ‌పా మాత్ర‌మే సినిమాలు చేయ‌గ‌లుగుతున్న గీతాకృష్ణ యూట్యూబ్ చాన‌ళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ ఉన్నారీమ‌ధ్య‌. బోల్డ్ గా మాట్లాడటం కూడా ఈయ‌న స్టైల్. 

త‌ను కూడా కాపును అని  గ‌ట్టిగా చెప్పుకోగ‌ల సినిమా వ్య‌క్తి. ద‌ర్శ‌కుడు కే విశ్వ‌నాథ్ వ‌ద్ద అసిస్టెంట్ గా ప‌ని చేయ‌డం ద్వారా సినిమా కెరీర్ ను ప్రారంభించిన గీతాకృష్ణ.. అప్ప‌ట్లో బ్ర‌హ్మ‌ణుల‌కే విశ్వ‌నాథ్ ఏ త‌ర‌హా అవ‌కాశం అయినా ఇస్తాడ‌నే పేరుంద‌ని, బ‌హుశా త‌ను కూడా బ్ర‌హ్మ‌ణుడిని అనే అవ‌కాశం ఇచ్చారేమో అనే మాట త‌న వ‌ర‌కూ వ‌చ్చే స‌రికి.. త‌నే వెళ్లి త‌ను కాపును అని చెప్పిన‌ట్టుగా ఈ ద‌ర్శ‌కుడు ఒక ఇంట‌ర్వ్యూలో వివ‌రించాడు. 

సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై కూడా గీతాకృష్ణ మాట్లాడుతూ ఉంటాడు. ఈ క్ర‌మంలో ఒక ఇంట‌ర్వ్యూలో పృథ్విరాజ్ వ్య‌వ‌హారంపై స్పందించాడు. సినిమాల్లో మంచి కమేడియ‌న్ అయిన పృథ్వికి రాజ‌కీయాల్లో త్వ‌ర‌గా మంచి అవ‌కాశం ద‌క్కింద‌ని గీతాకృష్ణ అన్నాడు. అది ఆయ‌న‌కు కాపుగా కూడా ద‌క్కిన గుర్తింపు కావొచ్చ‌న్నారు. మెగా ఫ్యామిలీని అప్ప‌ట్లో తిట్ట‌డం పృథ్వికి ప్ల‌స్ అయ్యింద‌ని విశ్లేషించారు.

అలా ఆయ‌న చేసిన చిన్న‌పాటి రాజ‌కీయానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున టీటీడీ చాన‌ల్ చైర్మ‌న్ గా మంచి అవ‌కాశం ద‌క్కింద‌న్నారు. బాధ్య‌త‌యుత‌మైన‌, గౌర‌వ‌నీయ‌మైన ఆ ప‌ద‌వి ద‌క్కిన వెంట‌నే ఏదో కార్పొరేష‌న్ చైర్మ‌న్ త‌ర‌హాలో పృథ్వి వ్య‌వ‌హ‌రించార‌న్నారు. రాజ‌కీయాల్లో ఎద‌గాల‌నుకునే వారికి కొన్ని ర‌కాల బ‌ల‌హీన‌త‌లు ఉండ‌కూడ‌ద‌ని, ఎవ‌రో ఒక అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడ‌గానే సొల్లు కార్చుకునే వారు రాజ‌కీయాల్లోకి ఎలా సెట్ అవుతార‌ని గీతాకృష్ణ అన్నారు.

ఇక త‌న‌పై కుట్ర జ‌రిగింద‌ని పృథ్వి అన‌డాన్ని కూడా ఈ ద‌ర్శ‌కుడు త‌ప్పు ప‌ట్టాడు. ప్ర‌పంచం అంటే అలానే ఉంటుంద‌ని, నీకు బ‌ల‌హీన‌త‌లు ఉండి.. కుట్ర జ‌రిగింద‌ని అన‌డం ఏమిటంటూ ప్ర‌శ్నించాడు. ఏ రాజ‌కీయ పార్టీ వైపూ వ‌కాల్తా పుచ్చుకోని ఒక సినిమా ద‌ర్శ‌కుడు న‌టుడు పృథ్వి వ్య‌వ‌హారంపై ఇలా స్పందించారు. 

రాజ‌కీయాల్లో అతి త‌క్కువ స‌మ‌యంలోనే వ‌చ్చిన మంచి అవ‌కాశాన్ని పృథ్వి అలా చేజార్చుకుని.. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్ట‌డం మ‌రో విడ్డూర‌మ‌న్నారు. ఇలా చేస్తే పృథ్వికి సినిమా అవ‌కాశాలు ద‌క్క‌వ‌చ్చేమో కానీ.. వ్య‌క్తిగా ఎవ‌రూ న‌మ్మే అవ‌కాశం ఉండ‌ద‌న్నారు. 

త‌న‌ను పాకిస్తాన్ టెర్ర‌రిస్టులా త‌యారు చేశారంటూ పృథ్వి చెప్పుకోవ‌డాన్ని కూడా ఈ ద‌ర్శ‌కుడు కొట్టిప‌డేశాడు. పృథ్వి త‌న గురించి త‌ను ఎక్కువ‌గా ఊహించుకునే ఫ‌లిత‌మే ఇలాంటి మాట‌ల‌న్నారు.